Achyutapuram Sez
-
అచ్యుతాపురం సెజ్‌లో రిలయన్స్ సోలార్ పవర్ సెల్ ప్లాంట్!
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్‌లో రిలయన్స్ సోలార్ పవర్ అండ్ మాడ్యుల్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు రిలయన్స్ పవర్ అధినేత అనిల్ అంబానీ శనివారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్ పరిధిలోని సీతంపాలెం గ్రామంలో స్థలం పరిశీలించారు. ఆయనకు జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, ఏపీఐఐసీ జనరల్ మేనేజర్ హరిప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. సెజ్‌లో ఏపీఐఐసీ భూములను పరిశీలించి తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టుకు ఆయన బయలుదేరారు. అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు అదానీ సంస్థ ముందుకురావడంతో దానికి పోటీగా పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కొత్తగా రిలయన్స్ న్యూ ఎనర్జీస్ పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసు్తన్నట్లు సమాచారం. అందులో భాగంగానే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్ పరిధిలోని సీతంపాలెం గ్రామంలో రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ పేరుతో సోలార్ పవర్ సెల్ అండ్ మాడ్యుల్స్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు స్థలం పరిశీలించినట్లు తెలిసింది. అనిల్ అంబానీ పర్యటనపై అధికారికంగా ముందస్తు సమాచారం లేదని, ఆయన విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్‌కు వస్తున్నారని తెలిసిన వెంటనే జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఏపీఐఐసీ అధికారులు వెళ్లారని సిబ్బంది చెబుతున్నారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడోజన్ పవర్ ప్లాంట్ ఏర్పాటు నేపథ్యంలో...అచ్యుతాపురం మండలంలోని పూడిమడక గ్రామ సమీపంలో సుమారు 1,600 ఎకరాల విస్తీర్ణంలో రూ.1.85 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని మోదీ శంకుస్థాపన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అనిల్ అంబానీ కూడా సోలార్ పవర్ సెల్ అండ్ మాడ్యుల్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. అందువల్లే ఆయన ఎటువంటి హడావుడి లేకుండా అచ్యుతాపురం సెజ్‌లో స్థలం పరిశీలించి వెళ్లినట్లు సమాచారం. -
అచ్యుతాపురం ఘటన.. చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ బహిరంగ లేఖ
సాక్షి, విశాఖపట్నం: గత ప్రభుత్వ కాలంలోనే కాకుండా.. అంతకుముందు పాలించిన మీ హయాంలోనూ పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయని సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఎఎస్ శర్మ గుర్తుచేశారు. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం దృష్ట్యా భవిష్యత్తులో ఈ తప్పిదాలు జరగకుండా ముఖ్యమంత్రికి పలు సూచనలు చేస్తూ శర్మ శనివారం బహిరంగ లేఖ రాశారు.ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేసి లాభాలు గడిస్తూ అక్కడి కార్మికులు, స్థానికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యాల మీద ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవట్లేదని ఆయన పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకులకు, పరిశ్రమల యజమానుల మధ్య ఉన్న సంబంధాలే దీనికి కారణమని ఆరోపించారు.గత ప్రభుత్వ తప్పిదాలవల్లే ప్రమాదాలు జరిగాయన్న చంద్రబాబు వ్యాఖ్యలపై శర్మ స్పందిస్తూ.. 2014లో తమరు అధికారంలో ఉన్న సమయంలోనూ ప్రమాదాలు జరిగిన విషయం గుర్తుచేసుకోవాలని సూచించారు. 2013 నుంచి 2019 మధ్య కాలంలో కేవలం పరవాడ ఫార్మా సెజ్‌లోనే 24 ప్రమాదాలు సంభవించగా 21 మంది ప్రాణాలు కోల్పోయారనీ, 69 మంది గాయాలపాలయ్యారన్నారు. ప్రభుత్వం ఏదైనా ప్రమాదాలు సహజంగా మారిపోయాయని విమర్శించారు.మీరు వచ్చి వెళ్లగానే మరో ప్రమాదం.. ఎసైన్షియా ప్రమాద బాధితుల్ని పరామర్శించి వెళ్లిన రోజు రాత్రే మరో ప్రమాదం జరిగిన విషయం కూడా చంద్రబాబు గుర్తుచేసుకోవాలని ఈఏఎస్ శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇంతమంది మృత్యువాత పడుతున్నా పరిశ్రమల యజమానులు ఎందుకు ఒక్కరోజైనా జైలుకు వెళ్లడంలేదని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించడం అభినందనీయమే అయినా.. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు పునరావృతం కాకుండా నిబంధలను కఠినతరం చేయాలని ఆయన కోరారు.పరిశ్రమల్లో ప్రమాదాలను, కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టాలంటే, ప్రభుత్వ విధానాల్లోనూ, వైఖరిలోనూ లోతైన మార్పులు రావాలన్నారు. ఎసైన్షియా యాజమాన్యాన్ని ప్రభుత్వం క్షమించకూడదనీ.. చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల అమలులో ఉదాశీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులపైనా చర్యలు తీసుకోవాలంటూ శర్మ డిమాండ్ చేశారు. -
జగన్ వచ్చారు.. చెక్కులు అందాయి
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో దుర్ఘటన జరిగి 17 మంది మృత్యువాత పడితే 24 గంటల వరకు కనీసం ఘటనా స్థలానికే వెళ్లని అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు మాజీ సీఎం వైఎస్ జగన్ రాకతో ఆగమేఘాల మీద చెక్కులు సిద్ధం చేశారు. గడువులోగా పరిహారం అందకుంటే ధర్నా చేస్తామన్న వైఎస్ జగన్ హెచ్చరికలతో అప్పటికప్పుడు 17 మంది మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. మృతుల కుటుంబాలకు స్థానిక తహసీల్దారుల చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
ఎసైన్షియా ఫార్మా ప్రమాద బాధితులందరికీ న్యాయం చేయాలి. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రుల్లో ప్రతి ఒక్కరికీ పరిహారం అందించే వరకు బాధితుల తరపున పోరాడుతాం. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే వైఎస్సార్సీపీ ధర్నాకు దిగుతుంది. – వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, విశాఖపట్నం/తుమ్మపాల/అనకాపల్లి: ఒకవైపు కాలిన గాయాలు.. మరోవైపు సర్కారు నిర్లక్ష్యంతో కుమిలిపోతున్న అచ్యుతాపురం ఎసైన్షియా ఫార్మా ప్రమాద బాధితులను అండగా నేనున్నానంటూ ఓదార్చారు. తృటిలో ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో తల్లడిల్లుతున్న క్షతగాత్రుల్ని ఊరడించి కన్నీళ్లు తుడిచారు. ఆత్మీయ స్పర్శతో కొత్త ఊపిరి అందించారు. విశాఖ అచ్యుతాపురం సెజ్ ప్రమాదం జరిగి మూడు రోజులు కావస్తున్నా ప్రభుత్వం అందించలేని ప్రేమ పూర్వక భరోసాని వైఎస్ జగన్ అందించారు. ఎవరూ అధైర్యపడొద్దు.. మీరంతా క్షేమంగా ఇంటికి చేరుకుంటారు.. నిబ్బరంగా ఉండాలంటూ ధైర్యం చెప్పారు. ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. చికిత్స అనంతరం అందరూ ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం ప్రతి ఒక్కరికీ అందేలా మేం అండగా నిలిచి పోరాడతామని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని భరోసానిచ్చారు. ఎవరికి, ఎలాంటి సమస్య ఎదురైనా మా పార్టీ నాయకులు అందుబాటులో ఉంటారని, వెంటనే వారి దృష్టికి తేవాలని సూచించారు. ఆస్పత్రి అంతా కలియతిరిగి..విశాఖ ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డవారిని పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో అనకాపల్లి వచ్చారు. ఉషా ప్రైమ్ హాస్పిటల్‌కు 11 గంటలకు చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ చికిత్స పొందుతున్న 19 మంది క్షతగాత్రుల్ని పరామర్శించారు. సుమారు గంటన్నరకుపైగా ఆస్పత్రిలో గడిపారు. మూడు ఫ్లోర్లలో ఐసీయూ, ఇతర వార్డుల్లో కలియతిరిగి చికిత్స పొందుతున్న వారి దగ్గరకు వెళ్లారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా సంభవించింది..? వైద్యం ఎలా అందుతోందని ఆరా తీశారు. ఆస్పత్రిలో ప్రతి ఒక్కరి బాధని తెలుసుకుంటూ.. సమస్యలను వింటూ సావధానంగా ఆలకించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఐదుగురు క్షతగాత్రులను పలకరించారు. ప్రతి ఒక్కరినీ పేరుతో పలుకరిస్తూ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని వాకబు చేశారు. క్షతగాత్రులంతా 22 నుంచి 45 ఏళ్లు లోపు వారే ఉన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో పరిహారం వచ్చే వరకూ పోరాడతామని, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా కల్పించారు. రెండో ఫ్లోర్లో క్షతగాత్రుడు జె.వర్థన్‌ను వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరించారు. మీ భరోసాతో గాయాలు మానిపోయినట్లుగా ఉందని వర్థన్ ఆత్మస్థైర్యంతో చెప్పాడు.» అన్నా.. ఎలా ఉంది ఆరోగ్యం ఇప్పుడు.? » ఇప్పుడు ఫర్వాలేదు సర్. కాస్త బాగుంది.» ప్రమాదం ఎలా జరిగిందన్నా..?» ఏమో సర్.. అంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. నేను ‘ఏ’ షిఫ్ట్‌లో పని చేస్తున్నా. మధ్యాహ్నం భోజనానికి వెళ్లి వస్తున్న టైమ్‌లో పెద్ద పేలుడు శబ్ధం వచ్చింది. నేను పడిపోయా. తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. కాలిన గాయాలు, దెబ్బలతో నరకం చూశా. ఇప్పుడు కాస్త కోలుకున్నా.» ఏం భయం లేదన్నా.. ఆరోగ్యం జాగ్రత్త. ధైర్యంగా ఉంటే త్వరగా నయమవుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉంటే.. ఇంత ఘోరం జరిగేది కాదు. మీకు రావాల్సిన పరిహారం వచ్చేలా మేం చూస్తాం. జాగ్రత్తన్నా. అనంతరం పక్కనే చికిత్స పొందుతున్న వెంకటాపురం గ్రామానికి చెందిన జి.రాజారావు దగ్గరకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని వైఎస్ జగన్ ఆరా తీశారు.» ఇప్పుడెలా ఉందన్నా..? ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు.?» సార్.. మీరు బాగున్నారా సర్. ఇప్పుడు కొంత ఫర్వాలేదు సర్. నిన్నటిమీద కొంచెం మెరుగుపడింది. నేనప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా. బ్లాస్ట్ అయిన వెంటనే భయంతో అక్కడి నుంచి దూకేశా. కాలు విరిగిపోయింది. కదల్లేకపోయా. నా పక్కనే ఉన్న మరో ఇద్దరు మాత్రం ప్రమాదంలో చనిపోయారు (విలపిస్తూ).» వైఎస్ జగన్ ఆయన్ను ఓదారుస్తూ ధైర్యంగా ఉండాలని, మీకు తోడుగా మేం ఉంటామంటూ భరోసా ఇచ్చారు.మరో వార్డులో చికిత్స పొందుతున్న సోమలింగపాలెం ప్రాంతానికి చెందిన కె.రామ్మెహర్బాబుని పరామర్శించిన వైఎస్ జగన్ యోగక్షేమాలు తెలుసుకున్నారు.» అన్నా.. ట్రీట్మెంట్ బాగా జరుగుతోందా? ఇప్పుడెలా ఉందన్నా?» జగనన్నా.. నమస్తే.. దేవుడి దయతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డా. పెద్ద శబ్దంతో పేలుడు జరిగింది. ఏమైందో తెలుసుకునే లోపు గాయాలపాలయ్యా. తల, మెడ, కాలికి దెబ్బలు తగిలాయి. డాక్టర్లు బాగానే చూసుకుంటున్నారు.» మీరేం దిగులు పడకండన్నా. అమ్మా..! రామ్‌మెహర్ బాబుని జాగ్రత్తగా చూసుకోండి. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా మేం పోరాడతాం... అంటూ బాధితుడి భార్యకు జగన్ భరోసానిచ్చారు.అక్కడి నుంచి మూడో ఫ్లోర్లో చికిత్స పొందుతున్న యలమంచిలికి చెందిన డి.అప్పారావును వైఎస్ జగన్ పలకరించారు.» అన్నా ఎలా ఉన్నారు? వైద్యం బాగా అందుతోందా?» నమస్తే జగనన్నా.. ఇప్పుడు బాగానే ఉంది. వైద్యం బాగానే అందుతోంది.» ప్రమాదం ఎలా జరిగిందన్నా.? అప్పుడు మీరు ఏం చేస్తున్నారు..?» అన్నా.. కంపెనీలో నేను ‘బీ’ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లా. నేను పైకి వెళ్తున్న సమయంలో ఏ–షిఫ్ట్ వాళ్లంతా కిందకి వస్తున్నారు. ఇంతలో పెద్ద శబ్ధం వచ్చిందన్నా.. అద్దాలు పగిలిపోయాయి. అందరం కిందపడిపోయాం. నా తలకు బలంగా ఓ అద్దం ముక్క తగిలింది. కాసేపటికి కొందరు వచ్చి నన్ను హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. » అయ్యో.. జాగ్రత్తన్నా.. ప్రభుత్వం నుంచి ఏమైనా సాయమందిందా..?» ఇంకా లేదన్నా.. ఇస్తామని చెప్పారు. నా భార్య సత్యవతి, మా ఇద్దరు పాపలు నా జీతం మీదే ఆధారపడి బతుకుతున్నారు. నేను ఉద్యోగానికి వెళ్లకపోతే ఇల్లు గడవదన్నా.» మరేం ఫర్వాలేదన్నా.. మీరు ధైర్యంగా ఉండండి. మీకు రావాల్సిన పరిహారం వచ్చేలా మేం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం.పక్కనే చికిత్స పొందుతున్న యలమంచిలికి చెందిన ఎ.పరమేశ్ని వైఎస్ జగన్ పరామర్శించారు. » అన్నా.. ఎలా ఉంది ఆరోగ్యం..?» నమస్తే అన్నా.. ఏదో బయటపడ్డాం అన్నా. ప్రమాదం జరిగిన క్షణాల్లో తల, చెవి, చేయి కాలిపోయింది. ఆస్పత్రికి వచ్చి ట్రీట్మెంట్ అందేవరకూ కాలిన గాయాలతో నరకం చూశా. నా కుటుంబం దగ్గరకు చేరుకుంటానా లేదా అనే ఆందోళనే నాలో ఎక్కువైపోయిందన్నా..» బాధ పడొద్దన్నా.. మీరు త్వరగా కోలుకుంటారు. జాగ్రత్త అంటూ ఆత్మీయంగా పరామర్శించారు.దేశ పాత్రుని పాలెం ప్రాంతానికి చెందిన కె.షణ్ముఖరాజుని జగన్ పరామర్శించారు.» అన్నా.. కంటికి గాయమైందా.? ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ పనిచేస్తున్నారన్నా.?» నమస్తే సర్.. నేను ప్రొడక్షన్లో పనిచేస్తున్నా. ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉన్నా. ఆ శబ్దానికి తూలిపోయి కిందపడ్డా. కంటిమీద, మొహం మీద బాగా దెబ్బలు తగిలాయి. ఇప్పుడు బాగానే ఉంది కానీ పైనుంచి పడిపోవడం వల్ల.. ఒళ్లంతా నొప్పిగా ఉందన్నా.. కదల్లేకపోతున్నా.» తగ్గిపోతుందన్నా.. మీరు ధైర్యంగా ఉండండి. ట్రీట్మెంట్కు సహకరిస్తే.. అంతా మంచే జరుగుతుంది. పరిహారం కచ్చితంగా అందేలా నేను చూసుకుంటానంటూ ధైర్యాన్నిచ్చారు.బాధితుడు ప్రభాత్ యాదవ్ వద్దకు వచ్చిన వైఎస్ జగన్ ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.» అన్నా.. ఎలా ఉంది ఇప్పుడు..? కంపెనీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు.?» నాది హైదరాబాద్ బ్రాంచ్. నెల రోజుల ట్రైనింగ్ కోసం ఇక్కడికి ఈ నెల 18న వచ్చా. ఆ రోజు నాతోపాటు ఇక్కడే పనిచేస్తున్న మరో ఇద్దరు కలిసి మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళ్తున్నాం. ఇంతలో భారీ శబ్దం వచ్చింది. తర్వాత ఏమీ కనిపించలేదు. కాసేపటి తర్వాత చూసే సరికి.. ముగ్గురం రక్తాలు కారుతూ వేర్వేరు చోట్ల పడి ఉన్నాం. నా పక్కన ఉన్న వాళ్లిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. » అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నా. మీరు జాగ్రత్తగా ఉండండి... మీకు పరిహారం అందేలా చూస్తామంటూ జగన్ భరోసా ఇచ్చారు.మరో వార్డులో చికిత్స పొందుతున్న ఉమ్మలాడకు చెందిన యామినిని వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరించారు.» తల్లీ ఎలా ఉంది ఇప్పుడు.? ఎంతకాలం నుంచి అక్కడ పనిచేస్తున్నావు?» నమస్తే జగనన్నా.. నేను ఏడాది క్రితం నుంచి ఎసైన్షియాలో కెమిస్ట్రీ ల్యాబ్‌లో పనిచేస్తున్నా. » ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉన్నావా తల్లీ.?» అవునన్నా.. కంపెనీ డిపో పక్కనే ఉన్న ల్యాబ్‌లో పనిచేస్తున్నా. ఇంతలో పెద్ద బాంబు పేలినట్లుగా శబ్దం వచ్చింది. పై నుంచి కిందకు పడిపోయా. ఇద్దరు వ్యక్తులు వచ్చి నన్ను తీసుకెళ్లడం గుర్తుంది. తలకు దెబ్బతగిలింది. తుంటి ఎముక విరిగిపోయింది.» భయపడొద్దు తల్లీ.. ఆరోగ్యం జాగ్రత్త. పాప క్షేమంగా ఇంటికి వస్తుంది. మీరేం కంగారు పడకండమ్మా.. అంటూ యామిని తల్లిదండ్రులకు జగన్ భరోసా ఇచ్చారు. -
న్యాయం జరగకుంటే ధర్నా చేస్తాం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా ప్రమాద బాధితులందరికీ న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతులతోపాటు క్షతగాత్రుల్లో ప్రతి ఒక్కరికీ పరిహారం అందించే వరకు బాధితుల తరపున తాము పోరాడతామని ప్రకటించారు. ప్రభుత్వానికి 2–3 వారాల సమయం ఇస్తున్నామని, బాధితులందరికీ నష్ట పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగుతుందని, అవసరమైతే తాను కూడా స్వయంగా వచ్చి ధర్నాలో పాల్గొంటానని స్పష్టం చేశారు. దుర్ఘటనలు జరిగినప్పుడు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వేగంగా స్పందించాలని, నష్ట పరిహారం అందించే విషయంలో సానుభూతితో, మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సేఫ్టీ ప్రొటోకాల్స్‌ను పక్కాగా పర్యవేక్షిస్తూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఎవరెవరు ఏం చేయాలి? ప్రొటోకాల్ ప్రకారం జరుగుతోందా? లేదా? అని పర్యవేక్షిస్తే ఫ్యాక్టరీల పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈ రోజు ఇంతమంది ఇలా చనిపోయి ఉండేవారు కాదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటనలో గాయపడి ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ జగన్ శుక్రవారం పరామర్శించారు. ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి దుర్ఘటన ఎలా జరిగింది? ఆరోగ్యం ఎలా ఉంది? బాగా చూసుకుంటున్నారా? అని వాకబు చేశారు. ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ న్యాయం జరిగే వరకు పోరాడతామని, తాము అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. స్పందించకూడదన్న ధోరణిలో సర్కారు.. అచ్యుతాపురం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు, స్పందన ఏమాత్రం సరిగా లేదు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే దీనిపై స్పందించకూడదన్న ఉద్దేశమే ప్రభుత్వంలో ఎక్కువగా కనిపిస్తోంది. 17 మంది చనిపోతే.. సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి నిర్వహించిన ప్రెస్మీట్లో బాధితులకు భరోసా కల్పించేందుకు అనకాపల్లి వెళుతున్నానన్న మాటే నోటి నుంచి రాలేదు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ను పర్యవేక్షించే కార్మికశాఖ మంత్రి కూడా ప్రెస్మీట్లో ఎంత మంది చనిపోయారో వివరాలు లేవని మాట్లాడారు. ఆయన కూడా హుటాహుటిన అక్కడకు వెళ్లాలనే ఉద్దేశం చూపించలేదు. ఘటన జరిగిన తర్వాత ఆ స్థలానికి కలెక్టర్ ఎప్పుడు వెళ్లారు? అధికారులు, కమిషనర్ ఎప్పుడు వెళ్లారనే అంశాలను గమనిస్తే బాధ కలుగుతోంది. ఇక అధికారపార్టీ నాయకులు ఎప్పుడు వెళ్లారని గమనిస్తే ఎంతో బాధ కలిగిస్తోంది. ఘటన జరిగితే కనీసం అంబులెన్సులు కూడా సమీకరించలేని పరిస్థితి నెలకొంది. బాధితులను కంపెనీ బస్సుల్లోనే తరలించాల్సిన దుస్థితి. అప్పటికి... ఇప్పటికి తేడా ఇదీ.. ఇలాంటి ఘటనే మా ప్రభుత్వ హయాంలో కూడా ఒకసారి జరిగింది. కోవిడ్ మహమ్మారి సమయంలో మే 2020లో ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. కానీ కోవిడ్ ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎలా స్పందించిందన్నది తేడా ఒకసారి గమనించాలి. ఆ ఘటన తెల్లవారుజామున 3.40 గంటల సమయంలో జరిగితే 5 గంటల కల్లా కలెక్టర్, కమిషనర్ ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే అంబులెన్సులన్నీ పెద్ద ఎత్తున మోహరించాయి. ప్రతి బాధితుడికి తోడుగా నిలుస్తూ ఉదయం 6 గంటలకల్లా వైఎస్సార్ సీపీకి చెందిన సీనియర్ నాయకులందరూ ఘటనా స్థలానికి వెళ్లారు. అదే రోజు 11 గంటల కల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే స్పాటు వద్దకు వెళ్లా. బాధితులకు 24 గంటల్లోనే ఏకంగా కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎన్నడూ జరగలేదు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకుని బాధితుల పట్ల ఇంతగా సానుభూతితో వ్యవహరించిన సంఘటనలు గతంలో లేవు. మొట్టమొదటిసారిగా నష్ట పరిహారం కోటి రూపాయలు ఇచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. మన ప్రభుత్వమే.. జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని గర్వంగా చెప్పగలుగుతున్నా. 24 గంటల్లోనే ఏకంగా రూ.30 కోట్లు అక్కడకు పంపించి బాధితులకు తోడుగా నిలిచాం. బాధితులను వెంటనే ఆస్పత్రిలో చేర్పించడంతోపాటు 3 రోజులు ఆస్పత్రిలో ఉంటే రూ.10 లక్షలు, ఒక రోజు ఉంటే రూ.3 లక్షలు, చిన్న చిన్న గాయాలైన వారికి రూ.25 వేలు చొప్పున ఇప్పించాం. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాల్లో 15 వేల జనాభా ఉండగా ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు ఇచ్చి తోడుగా నిలిచిన పరిస్థితులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.. ఒక సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించే తీరు ఎలా ఉండాలనేది చాలా ముఖ్యం. సానుభూతి చూపాలి.. బాధ్యత తీసుకోవాలి చంద్రబాబు ఇక్కడకు వచ్చినప్పుడు నిర్వహించిన ప్రెస్‌మీట్ చూసి ఆశ్చర్యపోయా. జగన్ హయాంలోనూ ఘటనలు జరిగాయంటూ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 2014–19 మధ్యలో ప్రమాదాలు జరగలేదా? ఎవరున్నా ఇటువంటి ఘటనలు జరుగుతాయి. కానీ అలా జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ముఖ్యమైన విషయం. ప్రభుత్వం ఇటువంటి ఘటనల సమయంలో ప్రజల పట్ల, బాధితుల పట్ల సానుభూతి చూపించాలి. రెండోది ఏమిటంటే.. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకుంది.ఇవాళ చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆధ్వర్యంలోనే ఒక హై లెవల్ కమిటీని నియమించి ఫ్యాక్టరీ సెక్యూరిటీ, పొల్యూషన్ కంట్రోల్ అంశాలను జోడించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తేవాల్సిన సంస్కరణలపై సిఫారసులు చేయాలని కమిటీని నాడు మా ప్రభుత్వం కోరింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆగస్టు 2020లో ఒక జీవో కూడా జారీ చేశాం. దీనిపై పక్కాగా ప్రొటోకాల్ కూడా తీసుకొచ్చాం. ఫ్యాక్టరీ భద్రత ప్రొటోకాల్, కాలుష్య నియంత్రణ ప్రొటోకాల్.. అన్నింటినీ కలిపి ఒకే ప్రొటోకాల్ తెచ్చాం. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రతి కంపెనీ సెల్ఫ్ కంప్లయిన్స్ రిపోర్టు ఇవ్వాలి. తయారు చేసే నైపుణ్యం ఆ కంపెనీకి సొంతంగా లేకపోతే గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ద్వారా తీసుకుని కచ్చితంగా ఇవ్వాలి. ఆ నివేదిక ఆధారంగా నిజంగానే అన్నీ సరిగ్గా ఉన్నాయా? ఇంకా ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? అనే విషయాన్ని అన్ని విభాగాల అధికారులతో కూడిన కమిటీ పరిశీలించి నెల రోజుల తర్వాత తనిఖీలు నిర్వహిస్తుంది. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే సరిదిద్దుకునేందుకు కంపెనీకి 15 రోజుల సమయం ఇస్తుంది. గడువులోగా అది పూర్తయ్యేలా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షించాలని ప్రొటోకాల్‌లో ఉంది. ఇది ఇప్పటికే అమల్లో ఉంది. అదొక సంస్కరణ కింద తెచ్చాం. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వీటిని తు.చ. తప్పకుండా అమలు చేసేలా పర్యవేక్షించి ఉంటే ఇటువంటి ఘటనలు పునరావృతమయ్యేవి కాదు. లోతైన విచారణ జరగాల్సిందే.. ఇవాళ చంద్రబాబుకు ఒకటే మాట చెబుతున్నా. నష్టపరిహారం అన్నది సానుభూతితో ఇవ్వాలి. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇంత మంది ఆస్పత్రిలో ఉన్నారు. వారికి ఇస్తామన్న డబ్బులు వెంటనే ఇప్పించే ఏర్పాట్లు చేయండి. ఫ్యాక్టరీలలో భద్రతా చర్యలపై తెచ్చిన ప్రొటోకాల్‌ను కనీసం ఇప్పటి నుంచైనా పర్యవేక్షించే దిశగా అడుగులు వేయాలి. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి వాస్తవంగా ఏం జరిగిందో విచారణ చేయండి. యాజమాన్యం ఎవరైనా కానీ.. ఎందుకు తప్పు జరిగిందో విచారణ జరగాలి. సేఫ్టీ పారామీటర్స్ అమలైతే ఇటువంటి ఘటనలు నివారించవచ్చు. ఇవన్నీ కచ్చితంగా అమలు చేసేందుకు 2–3 వారాల సమయం ఇస్తాం. చనిపోయిన వారందరికీ నష్టపరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే బాధితుల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగుతుంది. అవసరమైతే నేను కూడా స్వయంగా వచ్చి ధర్నాలో పాల్గొంటా. ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎంపీ తనూజ రాణి, మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, కృష్ణదాస్, ఎమ్మెల్యేలు మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మేయర్ హరి వెంకటకుమారి, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర తదితరులు పాల్గొన్నారు.పాలన ఇలాగేనా? వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఏ రకంగా అమలు జరిగిందో మీరంతా చూశారు. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యాదీవెన డబ్బులు ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేవి. ఇప్పటికే రెండు త్రైమాసికాలు అయిపోయాయి. మూడోది కూడా ముగిసేందుకు దగ్గర పడుతున్నా ఇంతవరకు పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో, అసలు ఇస్తుందో లేదో కూడా తెలియదు. ఒకవైపు పిల్లలను ఫీజులు కట్టాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫీజులు చెల్లించకుంటే సర్టిఫికెట్లు ఇవ్వబోమంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరి పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20 వేలు ఎప్పుడిస్తారని రైతులు అడుగుతున్నారు. గతంలో రైతు భరోసా కింద వారికి ఏటా రూ.13 వేలు చొప్పున అందించాం. ఇప్పుడు ఇంతవరకు రూపాయి రాలేదు. ఇక ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. బీమా సొమ్ము అందని పరిస్థితుల్లో రైతన్న ఉన్నాడు. ఇవాళ విత్తనాలు, ఎరువులు కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. గడప వద్దకు వచ్చే పింఛను, రేషన్ ఆగిపోయింది. ఈ రోజు ప్రతి వ్యవస్థలో అవినీతి, వివక్ష పెరిగిపోయింది. టీడీపీ నాయకుల చుట్టూ తిరిగితే కానీ ఏవీ రావనే సందేశాన్ని పంపిస్తున్నారు. వీళ్ల ధ్యాసంతా రెడ్ బుక్‌పైనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలలుగా ఏం జరుగుతోంది? వీరికి పాలన మీద ధ్యాస లేదు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, సూపర్ టెన్ల మీద ధ్యాస లేదు. వీళ్ల ధ్యాసంతా రెడ్ బుక్ తెరవడం.. ఎవరెవరిపై కక్షలు ఉన్నాయో వాటిని తీర్చుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపైనే! కక్షలు తీర్చుకోవడానికి రోజూ కొట్టడం, చంపడం, ఆస్తులను ధ్వంసం చేస్తున్న ఘటనలే కనిపిస్తున్నాయి. కూటమి పాలనలో ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన, తాపత్రయం కనిపించని అధ్వాన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. వీళ్లు పరిపాలన మీద దృష్టి పెట్టి ఉంటే ఇంగ్లిష్ మీడియంతో మన స్కూల్స్ బాగుపడి ఉండేవి. 3వ తరగతిలోనే టోఫెల్ క్లాసులు, నాడు–నేడు కొనసాగి ఉండేవి. గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ నాశనమైపోయాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు ఇవ్వకపోవడంతో పేదలకు వైద్యం అందని దుస్థితి నెలకొంది. -
బాధితుల ఆక్రోశం.. ఫొటోలు దిగేందుకు వచ్చారా?
‘ఫొటోలు తీయించుకునేందుకు వచ్చేస్తున్నారు..! డబ్బులు మాకేం వద్దు..! మావాళ్లను బతికించి తీసుకురావయ్యా..! కనీసం మంచినీళ్లు.. వాటర్ ప్యాకెట్లైనా మీ ప్రభుత్వం ఇచ్చిందా? ఒక్కొక్కడూ వచ్చి ఫొటోలు నొక్కించేసుకుంటున్నారంతే! ఆ డాక్టర్ వచ్చారు..! చూసుకోవయ్యా మీ బాడీని అన్నారు. చూసుకున్నాం.. ఎవరూ కనీసం పట్టించుకోలేదు. ఆ కంపెనీవోడ్ని మా ముందుకు తెస్తే సచ్చిపోయినోడు బతికినట్టే..!’ – విశాఖ కేజీహెచ్‌లో సీఎం చంద్రబాబుని నిలదీసిన ఎస్.రాయవరం మండలానికి చెందిన మృతుడి మేనమామ తంబయ్యసాక్షి, విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన సీఎం చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వ అలసత్వంపై బాధిత కుటుంబాలు నేరుగా నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేశాయి. గురువారం విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబు మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించిన అనంతరం కేజీహెచ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఒకచోట నిలబెట్టి వారితో సీఎం మాట్లాడేలా ఏర్పాట్లు చేశారు. తమ బాధలు చెబుతున్న కుటుంబ సభ్యుల్ని సీఎం ఓదార్చి అంతా నేను చూసుకుంటానంటూ వెళ్లిపోయేందుకు యత్నించారు. అయితే బాధితులు చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. ప్రమాదం జరిగి 20 గంటలు గడుస్తున్నా.. బాధిత కుటుంబాల్ని కనీసం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక చంద్రబాబు తిరిగి వారి దగ్గరికి వచ్చి మాట్లాడారు.మావాళ్లు చేసింది తప్పే...మాకు కనీసం సమాచారం ఎవరూ ఇవ్వలేదు.. ఎవర్ని అడగాలో తెలియక రాత్రి నుంచి అటు ఇటు తిరుగుతున్నాం. ఒక్కరూ పట్టించుకోలేదు. టీవీల్లోనూ, యూట్యూబ్‌లోనూ చూసి ప్రమాదం జరిగిందని తెలుసుకొని పరుగున వచ్చాం. అయితే అధికారులెవరూ మాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ బాధిత కుటుంబాలు సీఎం వద్ద ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. మా ప్రభుత్వాధికారులు సమాచారం ఇవ్వకపోవడం.. కనీస సౌకర్యాలు కల్పించకపోవడం తప్పేనంటూ ఒప్పుకున్నారు.బొత్స ప్రశ్నించడంతో..వాస్తవానికి చంద్రబాబు టూర్ షెడ్యూల్లో కేజీహెచ్ లేదు. మృతదేహాల్ని బుధవారం రాత్రి కేజీహెచ్‌కు తరలించినా కూటమి పార్టీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే గానీ స్థానిక ఎంపీ గానీ పరామర్శించలేదు. గురువారం ఉదయం మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కేజీహెచ్‌కు చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యుల్ని కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న వారిని పరామర్శించేందుకు సీఎం ఎందుకు రావడం లేదని నిలదీశారు. కనీసం స్థానిక ఎమ్మెల్యేలు కూడా రాకపోవడం గర్హనీయమన్నారు. ఈ విషయాన్ని స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు షెడ్యూల్లో మార్పు చేసుకుని కేజీహెచ్‌కు వచ్చారు. -
నేడు ఫార్మా బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి/విశాఖ సిటీ: మాజీ సీఎం జగన్ శుక్రవారం అనకాపల్లిలో పర్యటించనున్నారు. అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలిన ఘటనలో గాయపడి అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఉదయం 11 గంటలకు పరామర్శించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10 గంటలకు విశాఖ చేరుకుంటారు. -
నిలువెల్లా నిర్లక్ష్యం.. అచ్యుతాపురం ఘటనలో సర్కారు అలసత్వం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలోని అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రియాక్టర్ పేలిపోయిన ఘటనలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అడుగడుగునా తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరిచింది. దుర్ఘటన తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాధితులను హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం తరలించకపోవడం... వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం... శాఖల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేయకపోవడం.. ఇలా ప్రతి విషయంలోనూ అలసత్వం ప్రదర్శించింది. ఏదైనా దుర్ఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకున్న సమయాల్లో బాధిత కుటుంబాలకు సమాచారం అందించి భరోసా కల్పించేందుకు హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చి సహాయక చర్యలు, ఇతర ముఖ్య సమాచారాన్ని అందిపుచ్చుకునే వ్యవస్థను తేవడం పరిపాటి. అయితే తాజా ఘటనలో అలాంటి చర్యలేవీ లేకపోగా కూటమి సర్కారు స్పందించిన తీరు విస్మయం కలిగిస్తోంది. ఇలాంటి విషాద సమయాల్లో ప్రజాప్రతినిధులు తక్షణం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తోడుగా నిలవడం కనీస బాధ్యత. అయితే అధికార పార్టీ నేతలెవరూ అటువైపు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. సీఎం చంద్రబాబుతోపాటు పర్యటనలో పాల్గొనడం, ఆయనతో పాటే కేజీహెచ్‌కు చేరుకుని తూతూమంత్రంగా కలవడం మినహా అధికార పార్టీ నేతలెవరూ బాధిత కుటుంబాలకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఘటన జరగగా మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూటమి పార్టీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ, మంత్రి గానీ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వారి తీరుకు నిదర్శనం.తనిఖీలకు తిలోదకాలు..పరిశ్రమల నుంచి మామూళ్ల వసూళ్లకు అలవాటుపడ్డ కూటమి నేతలు అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అన్ని విభాగాల అధికారులు కలసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఆడిట్ రిపోర్టు సమర్పించేవారు. ఈమేరకు ప్రత్యేకంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇందుకు అనుగుణంగా ఆయా కంపెనీలు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తనిఖీలకు తిలోదకాలు ఇవ్వడంతో పరిశ్రమల్లో నిర్లక్ష్యం పొడచూపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎసైన్షియా కంపెనీ ముందు మృతులు, క్షతగాత్రుల కుటుంబసభ్యుల పడిగాపులు ‘20 పాయింట్ ఫార్ములా’ విస్మరించడంతో..విశాఖలో 2020లో ఎల్జీ పాలీమర్స్ ప్రమాద ఘటన తరువాత నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిశ్రమల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించేందుకు ‘20 పాయింట్ ఫార్ములా’ అమలులోకి తెచ్చింది. 20 పాయింట్లకు గాను 16 కన్నా తక్కువ వస్తే ఆ సంస్థ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పరిగణించారు. కనీసం పది పాయింట్లు కూడా రాకపోతే సంస్థ కార్యకలాపాలను నిలిపి వేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి 20 పాయింట్ ఫార్ములా అమలుపై పర్యవేక్షణ కొరవడటంతోపాటు తనిఖీలు నిర్వహించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అంచనాలకు అందని అసమర్థతవిశాఖ ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాద తీవ్రతను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు స్పష్టమవుతోంది. రెడ్ కేటగిరీలో ఉన్న రసాయన పరిశ్రమల్లో ప్రమాదం జరిగితే తక్షణమే స్పందించాల్సి ఉండగా, రెండు గంటల తర్వాత కానీ కలెక్టర్, ఎస్పీ అందుబాటులోకి రాలేదనే విమర్శలున్నాయి. మృతుల విషయంలో తొలుత ఇద్దరు ముగ్గురేనని చెబుతూ వచ్చిన అధికారులు రాత్రి 8 గంటల సమయంలో 14 అని తేల్చారు. చివరకు 17 మంది మరణించినట్లు ప్రకటించారు. ఇది అతి పెద్ద ప్రమాదమనే విషయాన్ని పసిగట్టడంలో యంత్రాంగం విఫలమైంది. దీంతో అంబులెన్సులు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోలేదు. కాలిన శరీరాలతో కంపెనీ బస్సుల్లోనే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాల్సి వచ్చింది. ఆందోళనకు దిగితేగానీ ఆలకించలేదు..తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే విషయం స్పష్టంగా తెలుస్తున్నా తొలుత అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. బాధితులను వెంటనే విశాఖకు తరలించాలని వారి కుటుంబ సభ్యులు, బంధువులు వేడుకున్నా పట్టించుకోలేదు. చివరకు సహనం నశించిన బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగితేగానీ రాత్రికి విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించలేదు. రాత్రంతా వర్షంలోనే బాధిత కుటుంబాలు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. పట్టించుకునే దిక్కులేక..విపత్తులు, దుర్ఘటనల సమయాల్లో వివిధ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలి. తాజా ఘటనలో మాత్రం అది ఎక్కడా కానరాలేదు. మృతదేహాలు తరలించిన అంబులెన్సులు పోస్టుమార్టం పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని కేజీహెచ్ సిబ్బంది సూచించగా మిగిలిన భౌతిక కాయాలను తెచ్చేందుకు తాము వెళ్లాలని అంబులెన్స్ డ్రైవర్లు నిస్సహాయత వ్యక్తం చేశారు. సమన్వయం కొరవడటంతో మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చేవారు లేకుండా పోయారు. దీంతో న్యూస్ ఛానళ్లు, సోషల్ మీడియాలో వార్తలను చూస్తూ బాధిత కుటుంబాలు తల్లడిల్లాయి. బాధితుల బంధువులను మానవత్వంతో ఓదార్చేందుకు ఏ ఒక్క అధికారీ అందుబాటులో లేకుండా పోయారు. రాత్రి నుంచి ఆసుపత్రి వద్ద పడిగాపులు కాసిన వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇక ప్రమాదం ఎలా సంభవించిందనే సమాచారాన్ని ప్రభుత్వం ప్రకటించలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తోంది.గంటలో పరిహారం ఇస్తామని చెప్పి..మృతుల కుటుంబ సభ్యులకు గంటలో రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామంటూ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. అయితే, ఆయన వెళ్లిపోగానే అధికారులు మాట మార్చేశారు. మృతదేహాలను తరలించి దహన సంస్కారాలు నిర్వహించాలని, దారి ఖర్చులకు ముందుగా రూ.10 వేలు ఇస్తామనడంతో బాధిత కుటుంబాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమకు నిర్దిష్ట హామీ లభించే వరకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు అంగీకరించబోమని తేల్చిచెప్పారు. దీంతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు కేజీహెచ్ వద్ద విశాఖ కలెక్టర్ ప్రకటించారు. అయితే, ప్రమాదం జరిగిన ప్రదేశం అనకాపల్లి జిల్లాలో ఉండగా విశాఖ కలెక్టర్ మాట ఎలా విశ్వసించాలని బాధిత కుటుంబాలు ప్రశ్నించాయి. అనంతరం అనకాపల్లి జేసీ జోక్యం చేసుకుని పరిహారానికి రెండు, మూడు, రోజులు పడుతుందని చెప్పారు. తమకు ప్రభుత్వంపై నమ్మకంలేదని బాధితులు తేల్చిచెప్పారు. ఆ తర్వాత కేజీహెచ్‌కు మ.1.45 గంటల ప్రాంతంలో సీఎం వచ్చి మరో గంటలో పరిహారాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. కానీ, సా.5 గంటల వరకు ఆ ప్రస్తావనే లేకపోవడంతో బాధితులు మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో అప్పటికప్పుడు రూ.కోటి పరిహారం ఇస్తున్నట్లు ప్రొసీడింగ్స్ కాపీని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. రాత్రి 7 గంటలకు శవ పంచనామాలు పూర్తిచేశారు. -
చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వలనే అచ్యుతాపురం ప్రమాదం: అంబటి
సాక్షి, గుంటూరు: అచ్యుతాపురం ఫార్మా ప్రమాదాన్ని కూడా చంద్రబాబు వైఎస్సార్సీపీపై వేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఘటనను చంద్రబాబు సీరియస్‌గా తీసుకోలేదని ధ్వజమెత్తారు. హోంమంత్రి, డీజీపీ అందరూ సెక్రటేరియట్‌లోనే ఉన్నారు. నాలుగు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్‌ని దూషించటమే పనిగా పెట్టుకున్నారని అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు.‘‘కార్మిక శాఖ మంత్రి ఐదు గంటలకు మీడియా సమావేశం పెట్టి సమాచారం లేకుండా మాట్లాడారు. వ్యవస్థలన్నీ వైఎస్ జగన్‌ని నాశనం చేశారంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు, హోంమంత్రి, కార్మిక మంత్రి ఈ ప్రమాదాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అదే సెజ్‌లో ప్రమాదం జరిగి గతంలో ముగ్గురు చనిపోతే ఎందుకు సేఫ్టీ ఆడిట్ చేయలేదు?. పైగా ఆ ఆడిట్ చేస్తే పరిశ్రమలు వెళ్లిపోతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆడిట్ చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కావు, మనుషుల ప్రాణాలు పోయేవికావు’ అని అంబటి చెప్పారు.‘‘కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగింది. కార్మికుల భద్రత పట్టించుకోని కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?. చంద్రబాబు మీద బాధితుల కుటుంబాలకు నమ్మకం లేదు. బాధిత కుటుంబాలను ఆదుకునే విషయంలో చంద్రబాబు నాన్చుడు వైఖరి అవలంబిస్తున్నారు. బాధితులను వెంటనే విశాఖపట్నం తరలించకుండా అనకాపల్లి ఎందుకు తరలించారు?. 2014 నుండి 2019 వరకు అనేక పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి అనేక మంది మరణించారు. నేరం చేసిన రోజే నేరస్తులకు చివరిరోజు కావాలంటూ చంద్రబాబు కథలు వినిపిస్తున్నారు. మరి తాడిపత్రిలో పోలీసుల సమక్షంలోనే దాడి జరుగుతుంటే ఏం చేశారు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.‘‘పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబుదే. శవాల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకులేదు. పరిశ్రమల్లో కార్మికులను శవాలుగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తోంది. ఇది మానుకుని కార్మికులను కాపాడాలి. సూపర్ సిక్స్‌ని సూపర్ చీట్ గా మార్చారు. ఇచ్చిన హామీలు అమలు చేసిన మొనగాడు జగన్. హామీలను అమలు చేయని మోసగాడు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ గ్రామాల రూపురేఖలను మార్చాలనుకుంటే చంద్రబాబు ఊరుకోడు’’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. -
మృత్యుఘోష.. అచ్యుతాపురం సెజ్‌లో భారీ విస్ఫోటం
సాక్షి, అనకాపల్లి, అచ్యుతాపురం: అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. మధ్యాహ్నం 2.15 గంటలు.. భోజన విరామం.. ఇటు విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్తున్నవారు.. అటు రెండో షిఫ్ట్ కోసం వస్తున్న కార్మికులతో అక్కడంతా కోలాహలంగా ఉంది. అకస్మాత్తుగా భారీ పేలుడు.. ఏడంతస్తుల భవనం చిగురుటాకులా కంపించింది. చుట్టూ కిలోమీటర్ మేర దట్టమైన పొగలు.. ఏం జరిగిందో తెలుసుకునే లోపే నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. పలువురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు.. మాసం ముద్దలు.. ఒలికిన రసాయనాలు.. ఫ్లోరంతా రక్తపు చారికలు, హాహాకారాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. భవనం కిందనున్నవారు చూస్తుండగానే తమ సహచరుల శరీర భాగాలు గాల్లో ఎగురుతూ కనిపించాయి. కొన్ని మృత దేహాలు యంత్రాలకు, చెట్లకు వేలాడుతున్నాయి. దట్టమైన పొగల మధ్య నుంచి బయటకు పరుగులు తీస్తున్న కార్మీకులకు ఊపిరాడని పరిస్థితి నెలకొంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఎసైన్షియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో 17 మంది మరణించారు. సుమారు 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎసైన్షియా కంపెనీ ప్రధాన కార్యాలయంలో రియాక్టర్ పేలిపోవడంతో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా ఎందరున్నారో.. రక్తపు ముద్దలు, శరీర భాగాలు ఎవరివో తెలియని విషాద పరిస్థితి నెలకొంది. పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో హెచ్‌పీసీఎల్ తర్వాత ఆ స్థాయిలో కార్మీకులు/సిబ్బంది ఈ దుర్ఘటనలోనే చనిపోయినట్లు చెబుతున్నారు. పెను విషాదం చోటు చేసుకున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బాధితులను ఓదార్చే ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమవారి సమాచారం కోసం కంపెనీ ముందు ఆతృతగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల బంధువులు పేలుడు ధాటికి తునాతునకలు.. సెజ్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. ఎసైన్షియాలోని మూడో ఫ్లోర్లో 500 కిలోల సామర్ధ్యం గల రియాక్టర్ పేలిపోవటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి మృతదేçహాలు తునాతునకలుగా చెల్లాచెదురయ్యాయి. చెట్ల కొమ్మలపై.. శ్లాబ్ కింద నుజ్జు నుజ్జుగా కనిపించాయి. ప్రమాదం ధాటికి ఫార్మా కంపెనీ పరిసరాల్లో భీతావహ పరిస్థితి కనిపించింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మరణించగా ముగ్గురు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో, ఒకరు ఉషాప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యుఒడికి చేరుకున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రమాద స్థలిని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. భోజన విరామం కావడంతో.. ఎసైన్షియా కంపెనీలో చిక్కుకున్న కార్మీకులను కాపాడేందుకు 14 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో గోడలు పగిలి దూరంగా పడిపోయాయి. ఫ్యాక్టరీలో రెండు షిప్ట్‌లలో 381 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. భోజన విరామం కావడంతో పేలుడు సంభవించినప్పుడు ఉద్యోగులు తక్కువ సంఖ్యలో విధుల్లో ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అగ్ని ప్రమాదంలో 60 మంది కార్మికులు, ఉద్యోగులు చిక్కుకున్నారు. సాల్వెంట్ మిశ్రమంలో రియాక్షన్‌తో.. అచ్యుతాపురం సెజ్‌లో రూ.200 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ కంపెనీ సెజ్‌లోని ప్లాట్ నం 11, 11ఏ, 12, 12ఏలో 40 ఎకరాల్లో విస్తరించి ఉంది. కంపెనీలో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్ధాలు (టానిక్‌లు, డ్రాప్స్), బల్క్ డ్రగ్స్, స్పిరిట్ అండ్ సాల్వెంట్స్ తయారీ, సప్లయింగ్ చేస్తున్నారు. సాల్వెంట్‌లో రియాక్షన్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. రసాయన మిశ్రమం కలిసే రెండో రియాక్టర్లో ఈ పేలుడు సంభవించింది. మృతదేహాలు మూట గట్టి..ముక్కలుగా చెల్లాచెదురైన మృతదేహాలను మూటగట్టి గుట్టు చప్పుడు కాకుండా కేజీహెచ్‌కు సుమారు 15 ప్రైవేట్ అంబులెన్స్‌ల్లో రాత్రి 9 గంటల తరువాత తరలించారు. మీడియా ప్రతినిధులు, బాధితుల కుటుంబ సభ్యులు లోపలకి వెళ్లకుండా సెక్యూరిటీ పెంచారు. గాయపడ్డ వారి వివరాలు తెలుసుకునేందుకు కనీసం అంబులెన్స్‌ల వద్దకు కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకుని పోలీసులను భారీగా మోహరించారు.⇒ మొత్తం మృతులు 17 మంది. 9 మంది ఆచూకీ తెలియడం లేదు.⇒ ప్రమాదం జరిగినప్పుడు అణుబాంబు పేలినంత భారీ శబ్దం వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 10 నిమిషాలపాటు చెవులు గింగుర్లు ఎత్తిపోయాయన్నారు.⇒ పేలుడు కంటే భవనం కూలడంతో శిథిలాల మధ్య చిక్కుకొని ఎక్కువమంది మరణించారు.మా వాళ్లేమయ్యారో..!రాంబిల్లి (యలమంచిలి): అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో ప్రమాదం నేపథ్యంలో పలువురు కార్మీకుల ఆచూకీ తెలియకపోవడంతో కంపెనీ వద్ద వారి బంధువులు ఆందోళనకు దిగారు. తమ వారి వివరాలు చెప్పాలని పోలీసులను, కంపెనీ ప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నా కనీస స్పందన లేదని వాపోతున్నారు. బతికే ఉన్నారో.. చనిపోయారో తెలియక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ దీపిక, డీఐజీ గోపీనాథ్ జెట్టీ తదితరులు బయటకు వెళ్లకుండా మెయిన్ గేట్ వద్ద అడ్డుకుని బైఠాయించారు. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమాద స్థలికి రాత్రి 11 గంటల సమయంలో వస్తారనే సమాచారంతో బాధితుల కుటుంబీకులు, బంధువులు ఆకలి దప్పులు మరిచి అక్కడే కూర్చున్నారు. కంపెనీ వెనుక గేటు నుంచి మృతదేహాలను రహస్యంగా తరలిస్తున్నట్లు తెలియడంతో కొందరు అక్కడకు చేరుకుని బైఠాయించారు. కనీసం మృతదేహాలను కూడా చూపలేదని, అన్నింటినీ మూటకట్టి గుట్టుగా తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పరిహారం ప్రకటించే వరకు మృతదేహాలను తీసుకెళ్లబోమని బంధువులు కేజీహెచ్ ఎదుట అర్ధరాత్రి ఆందోళనకు దిగారు.అమెరికాలో కంపెనీ ఏర్పాటు..ఎసైన్షియా లైఫ్ సైన్సెస్ కంపెనీ 2007లో అమెరికాలోని సౌత్ విండ్సర్‌లో స్థాపించారు. కంపెనీ తన కార్యకలాపాలను అమెరికాతో పాటు హైదరాబాద్, విశాఖపట్నంలో నిర్వహిస్తోంది. యాదగిరి పెండ్రి దీన్ని స్థాపించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో నివాసం ఉంటున్నారు. యాదగిరి పెండ్రి 15 యూఎస్ పేటెంట్స్ పొందారు. ఈ కంపెనీ 2016లో విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లో రిజిస్టర్ అయ్యింది. 2018లో కార్యకలాపాలను ప్రారంభించింది. వివిధ రకాల సిరప్‌లతో పాటు కొత్త ఔషధాల కోసం ప్రయోగాలు నిర్వహిస్తుంటారు.కేజీహెచ్‌కు 13 మృతదేహాలుమహారాణిపేట (విశాఖ): ప్రమాదంలో మరణించిన 13 మంది మృతదేహాలను బుధవారం రాత్రి విశాఖపట్నం కేజీహెచ్ శవాగారానికి తీసుకొచ్చారు. ప్రమాదంలో తునాతునకలైన శరీరభాగాలను మూటలు కట్టారు. దీంతో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. ఎవరిది ఏ కాలో.. ఎవరిది ఏ చెయ్యో తెలియడం లేదు.మృతుల వివరాలు1. నీలపు రామిరెడ్డి (49), అసోసియేట్ జనరల్ మేనేజర్/అసోసియేట్ డైరెక్టర్, కొత్త వెంకోజీపాలెం, విశాఖపట్నం2. హంస ప్రశాంత్ (34), సీనియర్ ఎగ్జిక్యూటివ్, పొందూరు, శ్రీకాకుళం జిల్లా3. మహంతి నారాయణరావు (34), అసిస్టెంట్ మేనేజర్/టీమ్ లీడర్, అర్తమూరు, గరివిడి, విజయనగరం జిల్లా4. కొప్పర్తి గణేష్‌కుమార్ (33), సీనియర్ ఎగ్జిక్యూటివ్, జువ్వలదొడ్డి, బిక్కవోలు, తూర్పుగోదావరి జిల్లా5. చల్లపల్లి హారిక (22), ట్రైనీ ఇంజనీర్, రమణయ్యపేట, కాకినాడ6. పైడి రాజశేఖర్ (23) ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్, వంజంగి, ఆముదాలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా7. మారిశెట్టి సతీశ్ (31), సీనియర్ ఎగ్జిక్యూటివ్, పాశర్లపూడి, తూర్పుగోదావరి జిల్లా8. మొండి నాగబాబు (36), అసిస్టెంట్ మేనేజర్, సామర్లకోట9. నాగేశ్వర రామచంద్రరావు (47), అసిస్టెంట్ మేనేజర్/టీమ్ లీడర్, కూర్మన్నపాలెం, విశాఖ10. వేగి సన్యాసినాయుడు (53), హౌస్ కీపింగ్ బాయ్, అనకాపల్లి11.ఎల్లబిల్లి చిన్నారావు (27), పెయింటర్, అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా12.జవ్వాది పార్థసారధి (27), ఫిట్టర్, పార్వతీపురం13. పూడి మోహన్దుర్గా ప్రసాద్, హౌస్ కీపింగ్ బాయ్, అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా14.జె.చిరంజీవి (25)15.బి.ఆనందరావు (35)16. ఎం. సురేంద్ర, అశ్వారావుపేట, ఖమ్మం 17. పి.వెంకటసాయి (28)అంబులెన్సులేవీ..ఎసైన్షియాలో ప్రమాదం జరిగాక సుమారు గంటన్నర వరకూ కూడా అంబులెన్స్‌లు కూడా రాలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో కంపెనీ బస్సుల్లోనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సకాలంలో అంబులెన్స్ వచ్చి.. సరైన ఆసుపత్రిలో వైద్యం అందించి ఉంటే ఒకరిద్దరైనా బతికే అవకాశం ఉండేది. అలాగే అంబులెన్స్‌లు లేకపోవడంతో విశాఖలోని కేజీహెచ్‌కు కూడా క్షతగాత్రులను తరలించలేని పరిస్థితి ఏర్పడింది. తరువాత వచ్చిన పది అంబులెన్స్‌లు మృతదేహాలను తరలించడానికే పనికొచ్చాయి.ప్రమాదానికి కారణమిదే..రియాక్టర్లలో ఆర్గానిక్ కాంపౌండ్స్లో కర్బన రసాయనాలను కలిపే సమయంలోనే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్థారించారు. రియాక్టర్ నుంచి మరో రియాక్టర్కి మిశ్రమం పంపిస్తున్న సమయంలో వ్యాపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్ జరిగింది. అంటే.. ఒక రియాక్టర్‌లోని మిశ్రమం అక్కడ ఉన్న ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకి చేరుకోవడం వల్ల ఆవిరి తీవ్రత పెరిగింది. ఈ ఆవిరి పరిమాణం రియాక్టర్లో ఎక్కువ కావడంతో ఒత్తిడి తారస్థాయికి చేరుకుని ఒక్కసారిగా పేలుడు సంభవించిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే.. ప్రమాదానికి అసలు కారణాలపై లోతైన దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.నాతో ఉన్న ముగ్గురు చనిపోయారు భోజనం చేసి బ్లాక్‌లోకి వచ్చాను. అప్పుడే భారీ శబ్దం వినిపించింది. ఆ ధాటికి తూలిపోయి కింద పడిపోయాను. లేచి చూస్తే చుట్టూ పొగ.. కష్టంతో కళ్లు తెరిచి చూస్తే నాతోపాటు ఉన్న ముగ్గురు చనిపోయారు. – బి.రాజారావు, వెంకటాపురంఫ్యామిలీకి చెప్పలేదు మాది హనుమకొండ. కంపెనీ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా మూడు నెలల కిందట ఇక్కడికి వచ్చా. పేలుడుతో ఏమైందో తెలుసుకునే లోపే శ్లాబ్ పెచ్చులు వేగంగా వచ్చి తలకు తగిలి కుడి వైపు గాయాలయ్యాయి. కంగారు పడతారని కుటుంబ సభ్యులకు ఇంకా ఏమీ చెప్పలేదు.– ప్రభాత్మా అన్నయ్య మృతదేహాన్ని చూపట్లేదుమా అన్నయ్య బీఎన్ రామచంద్రరావు (48) ఇక్కడే పనిచేస్తున్నాడు. ప్రమాదం విషయం తెలిసి వెంటనే కంపెనీ దగ్గరికి వచ్చా.. అన్నయ్య జాడ తెలియట్లేదు. కంపెనీలో అడిగితే చనిపోయాడని, ఆస్పత్రికి పంపించామని చెబుతున్నారు. కనీసం మృతదేహాన్ని కూడా చూపట్లేదు.– వెంకటలక్ష్మి, అచ్యుతాపురం కళ్లకు ఏమైందో.. మాది విజయనగరం జిల్లా ఎస్.సీతారామపురం. కంపెనీలో నిర్వహణ పనులు చేస్తుంటా. రోజులానే ఈ రోజూ కంపెనీకి వచ్చా. ప్రమాదంలో కళ్లలో ఏదో లిక్విడ్ పడి, రెండు కళ్లూ కనిపించట్లేదు. ముఖమంతా గాయాలతో రక్తపు మరకలయ్యాయి. కళ్లు కనిపిస్తాయో, లేదో కూడా తెలియట్లేదు. – కలిశెట్టి చంద్రశేఖర్సరైన వైద్యం అందట్లేదుచాలా మంది తలకు, కళ్లకు దెబ్బలు తగిలాయి. మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో చేర్చి చాలా గంటలైనా.. వైద్యం మాత్రం సరిగా అందట్లేదు. ఎక్కువ మంది క్షతగాత్రులందరినీ ఒకే ఆస్పత్రిలో చేర్చడంతో ఆ స్థాయిలో వైద్య సిబ్బంది లేరు. – కె.నారాయణరావు, అసిస్టెంట్ మేనేజర్ -
'అచ్యుతాపురం సెజ్' బాధితులకు అండగా నిలవాలి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలుడు ప్రమాదంపై స్థానిక నాయకులతో వైఎస్ జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని ఇప్పటికే వారిని ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని జగన్ డిమాండ్ చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనాస్థలాన్ని శుక్రవారం వైఎస్ జగన్ సందర్శించనున్నారు. గురువారం ప్రమాదస్థలానికి ముఖ్యమంత్రి వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో జగన్ శుక్రవారం ఘటనాస్థలికి వెళ్లనున్నట్టు వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం సాక్షి, అమరావతి: అనకాపల్లి ఫార్మాసెజ్ పేలుడు ఘటనలో క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేíÙయా అందించడంపై సదరు కంపెనీతో కలెక్టర్, ఇతర అధికారులు చర్చించామన్నారు. -
మరింత పర్యావరణహితంగా అచ్యుతాపురం సెజ్
సాక్షి, అమరావతి: ఫార్మా, రసాయనాలు తదితర రెడ్ కేటగిరీ యూనిట్లకు ప్రధాన ఆకర్షణగా ఉన్న అచ్యుతాపురం సెజ్‌ను మరింత పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్నది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద 5,595.47 ఎకరాల్లో విస్తరించిన ఉన్న ఏపీ సెజ్‌లో ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫార్మా, రసాయన యూనిట్లు ఏర్పాటు కావడమే కాకుండా.. మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుండడంతో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రసాయన వ్యర్థాలను శుద్ధి చేసే మౌలికవసతులను భారీస్థాయిలో కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.540 కోట్లతో డిజైన్ బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ విధానంలో (డీబీఎఫ్‌వోటీ) కామన్ ఇఫ్లుయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌తో (సీఈటీపీ) పాటు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థలను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తున్నది. ప్రస్తుతం అచ్యుతాపురం వద్ద 825కేఎల్డీ సామర్థ్యంతో సీఈటీపీని ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ ఉన్న పరిశ్రమలకు పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు. ఇందుకోసం కొత్తగా 5 ఎంఎల్డీ సీఈటీపీని ఏర్పాటు చేయడంతో పాటు.. ప్రస్తుతం ఉన్న 850 కేఎల్‌డీని 2000 కేఎల్డీ సామర్థ్యానికి చేరేలా ఆధునికీకరించాలని నిర్ణయించారు. సీఈటీపీ ద్వారా శుద్ధి చేసిన నీటిలో కనీసం 50 శాతం పరిశ్రమలు తిరిగి కొనుగోలు చేసి వినియోగించుకోవాలని కంపెనీలను కోరుతున్నది. దీంతోపాటు 10 ఎంఎల్డీ కెపాసీటీతో నీటి శుద్ధి యూనిట్‌ను, ఘన వ్యర్థాలను నిర్వహించే యాజమాన్య వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. డీబీఎఫ్‌వోటీ విధానంలో రూ.540 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ యూనిట్‌ను 33 ఏళ్లపాటు లీజు విధానంలో నిర్వహించడానికి ప్రవేటు సంస్థకు పారదర్శక విధానంలో అప్పగించాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ బిడ్లను న్యాయపరిశీలన కోసం జ్యుడీషియల్ ప్రివ్యూకు ఏపీఐఐసీ పంపించింది. అచ్యుతాపురం సెజ్‌తో పాటు రాష్ట్రంలోని మరో నాలుగు పారిశ్రామిక పార్కులు విశాఖ, విజయవాడ, గుంటూరు ఆటోనగర్లు, ఒంగోలు గ్రోత్ సెంటర్లలోమౌలికవసతుల అభివృద్ధికి ఏపీఐఐసీ ప్రాధాన్యత ఇస్తున్నది. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ ఆధునికీకరణలో భాగంగా రెండో దశ పనుల కింద ఏపీసెజ్‌లో పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ యూనిట్‌ను ఏపీఐఐసీ చేపట్టింది. -
3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే: సీఎం జగన్
సాక్షి, అచ్యుతాపురం(అనకాపల్లి జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లిజిల్లా అచ్యుతాపురంలో ఏపీ ఎస్ఈజెడ్లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ఫేజ్‌ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం మరో 8 కంపెనీలకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 15 నెలల కాలంలోనే ఫ్యాక్టరీలో ఉత్పత్తి.. ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దేవుడి దయతో ఒక పరిశ్రమను ప్రారంభోత్సవం చేసుకోవడంతోపాటు, రెండో దశ ప్లాంట్ విస్తరణ పనులకూ శంకుస్ధాపన చేశాం. యోకహోమా జపనీస్ టైర్ల తయారీ పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ.. కంపెనీ గురించి చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమంగా మొదటి 5–6 స్ధానాల్లో తమ కంపెనీ ఉందని, రాబోయే రోజుల్లో టాప్ 3లోకి పోబోతున్నామని చెప్పారు. అలాంటి కంపెనీ మన రాష్ట్రానికి రావడం సంతోషకరం. 2020 సెప్టెంబరులో మన దగ్గరకు వచ్చారు. అక్కడనుంచి చకచకా అన్ని రకాలుగా మద్ధతు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఫిబ్రవరి 2021లో పనులు ప్రారంభించి కేవలం 15 నెలల కాలంలోనే ఫ్యాక్టరీ ఉత్పత్తిలోకి వచ్చింది. మనమిచ్చే ప్రోత్సాహంతో రెండో దశకూ శ్రీకారం.. మనమిచ్చే ప్రోత్సాహం, మద్దతు వారిని ఆకట్టుకుంది. అందుకే రెండోదశకు కూడా నాందిపలుకుతున్నారు. ఒకవైపు తొలిదశ ప్రాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంటే.. మరోవైపు సెకెండ్ ఫేజ్‌కు శంకుస్ధాపన కార్యక్రమం జరుగుతుంది. ఈ రెండో దశ కూడా సరిగ్గా 12 నెలల్లోనే ఆగష్టు 2023లోగా పూర్తి చేస్తామని చెప్తున్నారు. తొలిదశలో రూ.1250 కోట్ల రూపాయలతో దాదాపు 1200 మందికి ఉద్యోగాలు ఇక్కడే కల్పించారు. ఇవాళ మొదలయ్యే రెండోదశలో మరో రూ.850 కోట్లతో పనులు చేపట్టడంతో పాటు మరో 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొత్తంగా 2000 మందికి ఉపాధి ఇక్కడే.. మన పిల్లలకే అందుబాటులోకి వస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెపుతున్నానంటే.. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, బాగుపడాలన్నా ఆ ప్రాంతంలో మన పిల్లలకు మెరుగైన ఉద్యోగాలు అందడం చాలా అవసరం. అలా ఆ ప్రాంతంలో చదువుకున్న మన పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇక్కడే మనం ఇప్పించగలిగితే.. పేదరికం నుంచి మన పిల్లలు బయటపడే పరిస్థితులు ఇంకా మెరుగవుతాయి. దీనికోసం ప్రభుత్వం పరంగా మనం చేయాల్సినవి అన్నీ కూడా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. చదవండి: (ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇంటికి సీఎం జగన్) ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్– ఏపీ.. ఇవాళ రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక రంగంలో అడుగులు పడుతున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మనం ఈరోజు గత మూడు సంవత్సరాలుగా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మనమే అవార్డు తీసుకుంటున్నాం. మొట్టమొదటి సారిగా ఈ సారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్టిఫికేషన్ చేసేముందు దాని తీరును కూడా మార్చారు. మొట్టమొదటిసారిగా ఆ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వ్యక్తులతో వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వాటికి అనుకూలంగానే ఈజ్ఆఫ్ డూయింగ్‌బిజినెస్ ర్యాంకింగ్ ఇస్తున్నారు. అలా రూల్స్ మార్చిన నేపథ్యంలో వరుసగా మూడేళ్లుగా ఏపీ నంబర్ 1 ర్యాంకు సాధిస్తోంది. ఇవాళ ప్రతి అడుగులో కూడా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. గతంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చేవారు కాదు. ఏళ్ల తరబడి పరిశ్రమల ప్రోత్సాహాకాలు పేరుకుపోయాయి. ఆ నేపథ్యంలో చిన్నా చితకా పరిశ్రమలు నడవలేక మూతబడుతున్న పరిస్థితులు. దాదాపు లక్షకుపైగా ఎంఎస్ఎంఈలు రాష్ట్రంలో ఉన్నాయి. పదిలక్షల మందికి పైగా ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకంగా.. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సహం ఇచ్చే కార్యక్రమం గత ప్రభుత్వాలు ఎప్పుడో మర్చిపోయిన సందర్భంలో... మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా గుర్తు పెట్టుకుని పాత బకాయిలను క్లియర్ చేస్తూనే, మరోవైపు ఎలాంటి బకాయిలు లేకుండా ప్రతి సంవత్సరం వారికి రావాల్సిన ఇన్సెంటివ్‌లు అందిస్తున్నాం. వాళ్లను చేయిపట్టుకుని నడిపిస్తూ ప్రోత్సహిస్తూ ఈ మూడు సంవత్సరాల కాలంలో రూ.1463 కోట్లు ఎంఎస్ఎంఈలకు ఇచ్చాం. ఈ రకంగా ప్రభుత్వం ప్రతి దశలోనే ప్రోత్సహిస్తూ.. అడుగులు ముందుకు వేస్తుంది కాబట్టే ఈ రోజు.. 2021–22 చూస్తే ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ గ్రోత్‌రేట్ 11.43 శాతం సాధించాం. దేశంలో చూస్తే అది కేవలం 8.9శాతమే. దేశంతో పోలిస్తే.. రాష్ట్రం వేగంగా అడుగులు ముందుకేస్తోంది. ఎగుమతుల్లోనూ.. ఎగుమతుల్లో చూస్తే.. ఇప్పటికే మన రాష్ట్రంలో ఆరు పోర్టులుంటే.. ఈ 3 ఏళ్లకాలంలో వేగంగా మరో 4 పోర్టులు కట్టేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నాం. ఒకవైపు పోర్టులు కొత్తవి నిర్మించడంతో పాటు 9 ఫిషింగ్ హార్బర్లుకూడా నిర్మిస్తున్నాం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్ కాని, ఒక పోర్టునుకాని అందుబాటులోకి తెస్తున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు ఆంధ్రరాష్ట్రంలో 2021–22 ఆర్ధిక సంవత్సరంలో ఎక్స్‌పోర్టెడ్ గూడ్స్ 19.3 బిలియన్ డాలర్లు అంటే ఇది మొత్తం దేశం ఎగుమతుల్లో 4.58 శాతం. ఈ పోర్టులు పూర్తయిన తర్వాత ఏపీ నుంచే 10శాతం ఎగుమతులు తీసుకొచ్చే విధంగా అడుగులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇండస్ట్రియల్ కారిడార్లు.. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏపీలో మాత్రమే ఉన్నాయి. విశాఖ – చెన్నై, చెన్నై – బెంగుళూరు, హైదరాబాద్ – బెంగుళూరు కారిడర్లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే. గతంలో మన రాష్ట్రంవైపు చూడని వారు కూడా ఇప్పుడు మన వైపు చూస్తున్నారు. మన రాష్ట్రంలోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో సెంచరీ ప్లై వుడ్ భజంకాలు పేరు విన్నారా ? ఈ రోజు భజాంకాలు వైయస్సార్ జిల్లా బద్వేలులో సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. గతంలో బంగర్‌ల పేర్లు ఎప్పుడైనా విన్నారా ? గతంలో ఎప్పడూ రాష్ట్రంవైపు చూడని వాళ్లు శ్రీ సిమెంట్స్.. ఇవాళ ఆంధ్రరాష్ట్రంలో ఫ్యాక్టరీ పెడుతున్నారు. గతంలో ఆదిత్యా బిర్లా ఏపీకి వచ్చి, సీఎంతో కలిసి వారి ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న విషయం మీరు చూశారా ? ఈ రోజు ఆదిత్య బిర్లా కూడా ఆంధ్రరాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రితో సహా వెళ్లి వాళ్ల ప్లాంట్ ప్రారంభిస్తున్నారు. గతంలో అదానీ, అదానీ అని పేరుకు మాత్రమే అనేవారు. కానీ ఆదానీ అనే సంస్ధ గతంలో ఏపీలో ఎప్పుడూ అడుగులు ముందుకు వేయలేదు. కేవలం జగన్ సీఎం అయిన తర్వాతనే అదానీలు ముందడుగు వేశారు. ప్రతి పెద్ద పరిశ్రమకు చెందిన వారందరూ కూడా ఏపీ వైపు చూసేట్టుగా అడుగులు పడుతున్నాయి. పారిశ్రామిక వేత్తలకు తోడుగా.. పారిశ్రామిక వేత్తలందరికీ ఒకటే మాట చెప్తున్నాం. మీరు పరిశ్రమ పెట్టండి.. అన్నిరకాలుగా సహాయ, సహకారాలిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది. అదానీ డేటా సెంటర్‌కు కూడా బహుశా వచ్చే నెలలో విశాఖలో శ్రీకారం చుడుతున్నాం. ఇక్కడ మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. ఒకవైపు వాళ్లను ప్రోత్సహిస్తూ.. అడుగులు ముందుకు వేయిస్తూ తీసుకొస్తున్నాం. మీ తరపున కూడా సహాయ, సహకారాలు.. మరోవైపున మీ తరఫు నుంచి కూడా అంతే సహాయ సహకారాలు అందాలి. ఏకంగా 75శాతం కచ్చితంగా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టంచేశాం. మన మీద కూడా బాధ్యత ఉందనే విషయం మరిచిపోకూడదు. ఎవరైనా ఏపీకి రావడానికి సంతోషపడాలి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తే.. ఎలా పరిష్కరించుకోవాలి, ఏరకంగా గొడవ పడకుండా పరిష్కరించాలనుకోవాలన్నదానిపైన మనం అడుగులు వేయాలి. అప్పుడే ఆ పారిశ్రామిక వేత్తలకూ నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు వాళ్లు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు. అప్పుడు మన పిల్లలకు పుష్కలంగా ఉద్యోగాలు వస్తాయి. మన వాళ్లు చాలా మంచి వాళ్లు, బాగా కష్టపడి పనిచేసేవాళ్లు, ఎటువంటి సమస్యలు సృష్టించరు అని వాళ్లు ఎప్పుడు అనుకుంటారో... అప్పుడు మన రాష్ట్రంలోకి ఇంకా పెట్టుబడులు వస్తాయి. ఆ బాధ్యత మన భుజాల మీద ఉందని... సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలువురు ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ చేతుల మీదుగా ‘ఏటీసీ టైర్స్’ ప్రారంభం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ యకహోమా గ్రూప్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో నెలకొల్పిన అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ) యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. సుమారు రూ.2,200 కోట్ల పెట్టుబడి అంచనాతో రెండు దశల్లో ఇది ఏర్పాటు కానుంది. తొలిదశలో రూ.1,384 కోట్లతో హఫ్ హైవే టైర్ల తయారీ యూనిట్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా టైర్ల ఉత్పత్తిని పరిశీలించిన ఏటీసీ నేటి నుంచి వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కంపెనీ ఆరు ఖండాల్లో 120కిపైగా దేశాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తమిళనాడులోని తిరునల్వేలి, గుజరాత్‌లోని దహేజ్‌లో ఇప్పటికే మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను నెలకొల్పింది, అచ్యుతాపురం యూనిట్ మూడోది. తొలి దశ యూనిట్లో ఉత్పత్తిని ప్రారంభించిన అనంతరం రూ.816 కోట్లతో చేపట్టే రెండో దశ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ నిర్వహించనున్నారు. మొత్తం రెండు దశల్లో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. 8 యూనిట్లు.. మరో రూ.వెయ్యి కోట్లకుపైగా పెట్టుబడులు ఏటీసీ రెండో దశ విస్తరణతో పాటు మరో 8 యూనిట్ల నిర్మాణ పనులకు సంబంధించి కూడా సీఎం జగన్ భూమి పూజ నిర్వహించనున్నారు. ఇందులో ఏడు అచ్యుతాపురం సెజ్‌లోనే ఏర్పాటు కానుండగా ఒకటి పరవాడ ఫార్మాసిటీలో ఏర్పాటవుతోంది. మొత్తం ఎనిమిది యూనిట్ల ద్వారా రూ.1,002.53 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానుండగా 2,664 మందికి ఉపాధి లభించనుంది. వీటికి ప్రభుత్వం 250 ఎకరాలు కేటాయించింది. ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే హైదరాబాద్, పరవాడలలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేసిన ఈ సంస్థ పరవాడలో రూ.125 కోట్ల పెట్టుబడితో మరో యూనిట్ స్థాపనకు ముందుకొచ్చింది. 8 కంపెనీల వివరాలు ఇవీ పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రత్యేక రసాయనాల ఉత్పత్తిలో పేరొందిన పిడిలైట్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో రూ.202 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేస్తోంది. వాటర్ ప్రూఫింగ్ ఉత్పత్తుల తయారీ, కోటింగ్, సీలెంట్స్ తదితర ఉత్పత్తులను అచ్యుతాపురం సెజ్‌లో తయారు చేయనున్నారు. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా 380 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మేఘ ఫ్రూట్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కార్బొనేటెడ్ ఫ్రూట్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, ఫ్రూట్ జ్యూస్‌ల టెట్రా ప్యాకింగ్, పెట్ బాటిల్స్ తదితర ఉత్పత్తుల బెవరేజెస్ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పనున్నారు. ఇప్పటికే మంగుళూరు, సంగారెడ్డిలో యూనిట్లు ఉన్న ఈ కంపెనీ అచ్యుతాపురం సెజ్‌లో రూ.185.25 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందులో దాదాపు 700 మందికి ఉద్యోగాలను కల్పించనున్నారు. ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ తయారీలో పేరొందిన ఈ సంస్థ దేశంలో ఇప్పటికే 38 తయారీ యూనిట్లను నెలకొల్పింది. రూ.145 కోట్ల పెట్టుబడితో లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆర్గాన్ తదితరాలను ఇక్కడ తయారు చేయనున్నారు. విన్ విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ లిమిటెడ్ అత్యాధునిక సాంకేతికతతో కూడిన వోల్టేజ్ సిరామిక్ ఇన్సులేటర్స్, పాలిమెరిక్ ఇన్సులేటర్ల తయారీలో పేరుగాంచిన ఈ కంపెనీ దాదాపు రూ.107.70 కోట్ల పెట్టుబడితో అచ్యుతాపురం సెజ్‌లో యూనిట్ ఏర్పాటు చేయనుంది. సైనాప్టిక్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియట్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ దాదాపు రూ. 81.75 కోట్ల పెట్టుబడితో అచ్యుతాపురం సెజ్‌లో యూనిట్ ఏర్పాటుకు సిద్ధమైంది. స్టైరాక్స్ లైఫ్‌సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియట్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ దాదాపు రూ. 87.77 కోట్ల పెట్టుబడితో అచ్యుతాపురం సెజ్‌లో యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇషా రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కోక్, కోల్ స్క్రీనింగ్ కొరకు ఈ సంస్థ రూ.68.06 కోట్ల పెట్టుబడితో అచ్యుతాపురం సెజ్‌లో యూనిట్ నెలకొల్పనుంది. విశాఖపట్నం పెదగంట్యాడలో ఇప్పటికే కోక్, కోల్ స్క్రీనింగ్, గ్రేడింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది. -
విశాఖ అభివృద్ధికి యకహోమాతో ప్రయోజనం
అచ్యుతాపురం (అనకాపల్లి): అత్యంత ప్రతిష్టాత్మకమైన యకహోమా టైర్ల కంపెనీ అచ్యుతాపురం సెజ్‌కు రావడంతో విశాఖ జిల్లాకు ఎంతో ప్రయోజనం దక్కుతుందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈ నెల 16న అచ్యుతాపురం సెజ్‌లో ఈ కంపెనీని ప్రారంభించి, మరో ఎనిమిది కంపెనీలకు శంకుస్థాపన చేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్న నేపథ్యంలో సీఎం పర్యటించనున్న ప్రాంతాలు, హెలిప్యాడ్‌ను శుక్రవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, మైనింగ్‌కు ఉపయోగించే వాహనాలకు అవసరమైన టైర్లను ఈ కంపెనీలో ఉత్పత్తి చేస్తారని చెప్పారు. వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.1,500 కోట్లతో ఈ కంపెనీ నిర్మాణం పూర్తయిందని, ఈ కంపెనీ వల్ల స్థానికంగా ఉద్యోగావకాశాలు పెరిగాయని తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత భూములు కేటాయించి, పూర్తయిన కంపెనీల్లో ఇదొకటన్నారు. విశాఖ పారిశ్రామిక అభివృద్ధికి, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి యకహోమా నాంది పలుకుతుందని చెప్పారు. ఈ కర్మాగారం విస్తరణకు మరో రూ.వెయ్యికోట్లు కేటాయించనున్నారని, తద్వారా మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు, కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి, సీఈవో ప్రహ్లాదరెడ్డి పాల్గొన్నారు. -
విశాఖ నుంచి 120 దేశాలకు అలయన్స్ టైర్లు
(అచ్యుతాపురం సెజ్ నుంచి సాక్షి ప్రతినిధి చంద్రశేఖర్ మైలవరపు): రాష్ట్రంలో మరో భారీ విదేశీ పెట్టుబడి వాస్తవ రూపంలోకి వచ్చింది. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూపునకు చెందిన అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ) విశాఖ సమీపంలోని అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేసిన భారీ హాఫ్ హైవే టైర్ల తయారీ పరిశ్రమ వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైంది. వ్యవసాయం, మైనింగ్, అటవీ, పోర్టు, నిర్మాణ రంగానికి చెందిన భారీ యంత్ర పరికరాలకు వినియోగించే పెద్ద పెద్ద టైర్లు ఇక్కడ తయారవుతాయి. పూర్తిగా ఎగుమతుల కోసం ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో ఉత్పత్తి అయ్యే టైర్లను 6 ఖండాలకు చెందిన 120కి పైగా దేశాలకు అందిస్తారు. అత్యధికంగా అమెరికా, యూరోప్ దేశాలకు ఎగుమతి కానున్నాయి. రికార్డు సమయంలో పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తికి సిద్ధమైన ఈ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే లాంఛనంగా ప్రారంభించనున్నారు. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూపునకు అమెరికా, జపాన్, ఇండియాల్లో ఏడు యూనిట్లు ఉన్నాయి. ఇండియాలో ఇప్పటికే తిరువన్వేలి, దహేజ్‌లలో రెండు యూనిట్లు ఉన్నాయి. మూడవ యూనిట్‌ను విశాఖ వద్దఏర్పాటు చేసింది. రూ.2,352 కోట్ల పెట్టుబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.2,352 కోట్ల (294 మిలియన్ డాలర్లు) పెట్టుబడితో విశాఖలో యూనిట్ ఏర్పాటుకు యకహోమా గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 2019 నవంబర్ లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసింది. కంపెనీ ప్రతిపాదినకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏర్పాటైన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 2020 నవంబర్‌లో ఆమోదం తెలిపింది. వెంటనే ఏపీఐఐసీ భూమి కేటాయించడం, నిర్మాణం ప్రారంభం చకచకా జరిగిపోయాయి. 2021 ఫిబ్రవరిలో పనులు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. కరోనా సంక్షోభం సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడంతో రికార్డు సమయంలో తొలి దశ పనులు పూర్తి చేసినట్లు ఏటీసీ ప్రతినిధులు తెలిపారు. జూలై నెలలో ఏటీసీ తన తొలి టైరును ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం ఉత్పత్తి పరిశీలన దశలో ఉంది. త్వరలో వాణిజ్యపరంగా ఉత్పత్తికి సిద్ధమవుతోంది. తొలి దశ కింద ఇప్పటివరకు రూ.1,320 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం ఈ యూనిట్ పూర్తిస్థాయి సామర్థ్యం రోజుకు 132 టన్నుల రబ్బరు వినియోగం కాగా, తొలి దశలో రోజుకు 69 టన్నుల రబ్బరును వినియోగించనున్నారు. స్థానికులకే పెద్ద పీట తక్కువ మానవ వనరులతో అధిక శాతం రోబోటిక్ విధానంలో నడిచేలా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ముడి సరుకు వచ్చినప్పటి నుంచి టైరు తయారయ్యి నేరుగా గొడౌన్‌లోకి వెళ్లే విధంగా లైన్స్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ పూర్తిస్థాయి సామర్థ్యం అందుబాటులోకి వస్తే 2,000 మందికి ఉపాధి లభిస్తుంది ఇందులో 75 శాతం స్థానికులే ఉంటారు. ఇందుకోసం స్థానిక ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే 400 మందికిపైగా పనిచేస్తుండగా, విస్తరణకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను పెంచుతారు. ప్రభుత్వ మద్దతుతో.. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు పూర్తిస్థాయిలో సహకారం అందించాయి. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్, ఏపీఐఐసీ, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధుల వరకు పూర్తిగా సహకరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం వారు చూపించిన తపనతో నిర్దేశించుకున్న లక్ష్యంలోనే ప్రాజెక్టును పూర్తి చేయగలిగాం. – అనిల్ గుప్తా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఏటీసీ టైర్స్ యకహోమా ఉద్యోగి కావడం ఆనందంగా ఉంది జపాన్‌కు చెందిన యకహోమా టైర్ల తయారీ యూనిట్లో ఉద్యోగిగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం పొందాను. యకహోమా కుటుంబ సభ్యుడిగా సొంత రాష్ట్రాభివృద్ధికి కృసి చేస్తాను. లాబాల పవన్ కళ్యాణ్, టైర్ బిల్డింగ్–ప్రొడక్షన్, ఏటీసీ టైర్స్ సొంతూరులో ఉద్యోగం వచ్చింది నాది అచ్యుతాపురం. యకహామాకు చెందిన ఏటీసీ టైర్స్‌లో ఉద్యోగం వచ్చింది. సొంతూరిలోనే ఉద్యోగం లభించడం చాలా ఆనందంగా ఉంది. ఇదే పట్టుదలతో మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటాను. ఇక్కడ పని వాతావరణం చాలా బాగుంది. పర్యావరణ పరిరక్షణ, భద్రతకు పెద్ద పీట వేస్తున్నారు. రజనా శ్యామల, టైర్ బిల్డింగ్–ప్రొడక్షన్, ఏటీసీ టైర్స్ -
విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో అగ్నిప్రమాదం
విశాఖపట్నం: విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. యూనిపార్ట్ప్ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కార్మికులకు తృటిలో ప్రమాదం తప్పింది.