కేజీహెచ్‌లో సీఎం చంద్రబాబును నిలదీసిన ఫార్మా బాధిత కుటుంబాలు
మంచినీళ్లు కూడా ఇవ్వలేని స్థితిలో మీ ప్రభుత్వం ఉందా?
బాధితుల ఆక్రోశంతో వెనక్కి వచ్చిన చంద్రబాబు
కేజీహెచ్‌లో మృతుల కుటుంబాల్ని పరామర్శించిన సీఎం
గంటలో రూ.కోటి పరిహారం ఇస్తానని ప్రకటన
సీఎం వెళ్లిపోగానే మాట మార్చిన అధికారులు
ప్రభుత్వంపై మండిపడ్డ బాధిత కుటుంబాలు
ఎట్టకేలకు సాయంత్రం ప్రొసీడింగ్స్ విడుదల చేసిన అనకాపల్లి కలెక్టర్
12 మృతదేహాలకు రాత్రి 7 గంటలకు పోస్ట్‌మార్టం పూర్తి
‘ఫొటోలు తీయించుకునేందుకు వచ్చేస్తున్నారు..! డబ్బులు మాకేం వద్దు..! మావాళ్లను బతికించి తీసుకురావయ్యా..! కనీసం మంచినీళ్లు.. వాటర్ ప్యాకెట్‌లైనా మీ ప్రభుత్వం ఇచ్చిందా? ఒక్కొక్కడూ వచ్చి ఫొటోలు నొక్కించేసుకుంటున్నారంతే! ఆ డాక్టర్ వచ్చారు..! చూసుకోవయ్యా మీ బాడీని అన్నారు. చూసుకున్నాం.. ఎవరూ కనీసం పట్టించుకోలేదు. ఆ కంపెనీవోడ్ని మా ముందుకు తెస్తే సచ్చిపోయినోడు బతికినట్టే..!’
– విశాఖ కేజీహెచ్‌లో సీఎం చంద్రబాబుని నిలదీసిన ఎస్.రాయవరం మండలానికి చెందిన మృతుడి మేనమామ తంబయ్య
సాక్షి, విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన సీఎం చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వ అలసత్వంపై బాధిత కుటుంబాలు నేరుగా నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేశాయి. గురువారం విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబు మెడికవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించిన అనంతరం కేజీహెచ్‌కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఒకచోట నిలబెట్టి వారితో సీఎం మాట్లాడేలా ఏర్పాట్లు చేశారు. తమ బాధలు చెబుతున్న కుటుంబ సభ్యుల్ని సీఎం ఓదార్చి అంతా నేను చూసుకుంటానంటూ వెళ్లిపోయేందుకు యత్నించారు. అయితే బాధితులు చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. ప్రమాదం జరిగి 20 గంటలు గడుస్తున్నా.. బాధిత కుటుంబాల్ని కనీసం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక చంద్రబాబు తిరిగి వారి దగ్గరికి వచ్చి మాట్లాడారు.
మావాళ్లు చేసింది తప్పే...
మాకు కనీసం సమాచారం ఎవరూ ఇవ్వలేదు.. ఎవర్ని అడగాలో తెలియక రాత్రి నుంచి అటు ఇటు తిరుగుతున్నాం. ఒక్కరూ పట్టించుకోలేదు. టీవీల్లోనూ, యూట్యూబ్‌లోనూ చూసి ప్రమాదం జరిగిందని తెలుసుకొని పరుగున వచ్చాం. అయితే అధికారులెవరూ మాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ బాధిత కుటుంబాలు సీఎం వద్ద ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. మా ప్రభుత్వాధికారులు సమాచారం ఇవ్వకపోవడం.. కనీస సౌకర్యాలు కల్పించకపోవడం తప్పేనంటూ ఒప్పుకున్నారు.
బొత్స ప్రశ్నించడంతో..
వాస్తవానికి చంద్రబాబు టూర్ షెడ్యూల్‌లో కేజీహెచ్ లేదు. మృతదేహాల్ని బుధవారం రాత్రి కేజీహెచ్‌కు తరలించినా కూటమి పార్టీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే గానీ స్థానిక ఎంపీ గానీ పరామర్శించలేదు. గురువారం ఉదయం మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కేజీహెచ్‌కు చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చారు.
కుటుంబ సభ్యుల్ని కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న వారిని పరామర్శించేందుకు సీఎం ఎందుకు రావడం లేదని నిలదీశారు. కనీసం స్థానిక ఎమ్మెల్యేలు కూడా రాకపోవడం గర్హనీయమన్నారు. ఈ విషయాన్ని స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు షెడ్యూల్‌లో మార్పు చేసుకుని కేజీహెచ్‌కు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment