
వైఎస్సార్‌సీపీ నేతలకు వైఎస్ జగన్ ఆదేశాలు
మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలి
రేపు ఘటనాస్థలానికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలుడు ప్రమాదంపై స్థానిక నాయకులతో వైఎస్ జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని ఇప్పటికే వారిని ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని జగన్ డిమాండ్ చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనాస్థలాన్ని శుక్రవారం వైఎస్ జగన్ సందర్శించనున్నారు. గురువారం ప్రమాదస్థలానికి ముఖ్యమంత్రి వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో జగన్ శుక్రవారం ఘటనాస్థలికి వెళ్లనున్నట్టు వైఎస్సార్‌సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.
బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం
సాక్షి, అమరావతి: అనకాపల్లి ఫార్మాసెజ్ పేలుడు ఘటనలో క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేíÙయా అందించడంపై సదరు కంపెనీతో కలెక్టర్, ఇతర అధికారులు చర్చించామన్నారు.

Comments
Please login to add a commentAdd a comment