ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో గంటన్నరకుపైగా కలియదిరిగి భరోసా
ప్రతి ఒక్కరినీ పేరుతో పరామర్శిస్తూ ఆరోగ్యం జాగ్రత్తని సూచన
ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికీ పరిహారం అందేవరకు మేం పోరాడతామని హామీ
ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పార్టీ నేతల దృష్టికి తేవాలని విజ్ఞప్తి
ఆత్మీయ పలకరింపుతో క్షతగాత్రుల్లో ఆత్మస్థైర్యం
ఎసైన్షియా ఫార్మా ప్రమాద బాధితులందరికీ న్యాయం చేయాలి. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రుల్లో ప్రతి ఒక్కరికీ పరిహారం అందించే వరకు బాధితుల తరపున పోరాడుతాం. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే వైఎస్సార్‌సీపీ ధర్నాకు దిగుతుంది. – వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, విశాఖపట్నం/తుమ్మపాల/అనకాపల్లి: ఒకవైపు కాలిన గాయాలు.. మరోవైపు సర్కారు నిర్లక్ష్యంతో కుమిలిపోతున్న అచ్యుతాపురం ఎసైన్షియా ఫార్మా ప్రమాద బాధితులను అండగా నేనున్నానంటూ ఓదార్చారు. తృటిలో ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో తల్లడిల్లుతున్న క్షతగాత్రుల్ని ఊరడించి కన్నీళ్లు తుడిచారు.
ఆత్మీయ స్పర్శతో కొత్త ఊపిరి అందించారు. విశాఖ అచ్యుతాపురం సెజ్ ప్రమాదం జరిగి మూడు రోజులు కావస్తున్నా ప్రభుత్వం అందించలేని ప్రేమ పూర్వక భరోసాని వైఎస్ జగన్ అందించారు. ఎవరూ అధైర్యపడొద్దు.. మీరంతా క్షేమంగా ఇంటికి చేరుకుంటారు.. నిబ్బరంగా ఉండాలంటూ ధైర్యం చెప్పారు. ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. చికిత్స అనంతరం అందరూ ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం ప్రతి ఒక్కరికీ అందేలా మేం అండగా నిలిచి పోరాడతామని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని భరోసానిచ్చారు. ఎవరికి, ఎలాంటి సమస్య ఎదురైనా మా పార్టీ నాయకులు అందుబాటులో ఉంటారని, వెంటనే వారి దృష్టికి తేవాలని సూచించారు.
ఆస్పత్రి అంతా కలియతిరిగి..
విశాఖ ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డవారిని పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం 10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో అనకాపల్లి వచ్చారు. ఉషా ప్రైమ్ హాస్పిటల్‌కు 11 గంటలకు చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ చికిత్స పొందుతున్న 19 మంది క్షతగాత్రుల్ని పరామర్శించారు.
సుమారు గంటన్నరకుపైగా ఆస్పత్రిలో గడిపారు. మూడు ఫ్లోర్లలో ఐసీయూ, ఇతర వార్డుల్లో కలియతిరిగి చికిత్స పొందుతున్న వారి దగ్గరకు వెళ్లారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా సంభవించింది..? వైద్యం ఎలా అందుతోందని ఆరా తీశారు. ఆస్పత్రిలో ప్రతి ఒక్కరి బాధని తెలుసుకుంటూ.. సమస్యలను వింటూ సావధానంగా ఆలకించారు.
ఐసీయూలో చికిత్స పొందుతున్న ఐదుగురు క్షతగాత్రులను పలకరించారు. ప్రతి ఒక్కరినీ పేరుతో పలుకరిస్తూ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని వాకబు చేశారు. క్షతగాత్రులంతా 22 నుంచి 45 ఏళ్లు లోపు వారే ఉన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో పరిహారం వచ్చే వరకూ పోరాడతామని, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా కల్పించారు.
రెండో ఫ్లోర్‌లో క్షతగాత్రుడు జె.వర్థన్‌ను వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరించారు. మీ భరోసాతో గాయాలు మానిపోయినట్లుగా ఉందని వర్థన్ ఆత్మస్థైర్యంతో చెప్పాడు.
» అన్నా.. ఎలా ఉంది ఆరోగ్యం ఇప్పుడు.?
» ఇప్పుడు ఫర్వాలేదు సర్. కాస్త బాగుంది.
» ప్రమాదం ఎలా జరిగిందన్నా..?
» ఏమో సర్.. అంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. నేను ‘ఏ’ షిఫ్ట్‌లో పని చేస్తున్నా. మధ్యాహ్నం భోజనానికి వెళ్లి వస్తున్న టైమ్‌లో పెద్ద పేలుడు శబ్ధం వచ్చింది. నేను పడిపోయా. తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. కాలిన గాయాలు, దెబ్బలతో నరకం చూశా. ఇప్పుడు కాస్త కోలుకున్నా.
» ఏం భయం లేదన్నా.. ఆరోగ్యం జాగ్రత్త. ధైర్యంగా ఉంటే త్వరగా నయమవుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉంటే.. ఇంత ఘోరం జరిగేది కాదు. మీకు రావాల్సిన పరిహారం వచ్చేలా మేం చూస్తాం. జాగ్రత్తన్నా.
అనంతరం పక్కనే చికిత్స పొందుతున్న వెంకటాపురం గ్రామానికి చెందిన జి.రాజారావు దగ్గరకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని వైఎస్ జగన్ ఆరా తీశారు.
» ఇప్పుడెలా ఉందన్నా..? ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు.?
» సార్.. మీరు బాగున్నారా సర్. ఇప్పుడు కొంత ఫర్వాలేదు సర్. నిన్నటిమీద కొంచెం మెరుగుపడింది. నేనప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నా. బ్లాస్ట్ అయిన వెంటనే భయంతో అక్కడి నుంచి దూకేశా. కాలు విరిగిపోయింది. కదల్లేకపోయా. నా పక్కనే ఉన్న మరో ఇద్దరు మాత్రం ప్రమాదంలో చనిపోయారు (విలపిస్తూ).
» వైఎస్ జగన్ ఆయన్ను ఓదారుస్తూ ధైర్యంగా ఉండాలని, మీకు తోడుగా మేం ఉంటామంటూ భరోసా ఇచ్చారు.
మరో వార్డులో చికిత్స పొందుతున్న సోమలింగపాలెం ప్రాంతానికి చెందిన కె.రామ్‌మెహర్‌బాబుని పరామర్శించిన వైఎస్ జగన్ యోగక్షేమాలు తెలుసుకున్నారు.
» అన్నా.. ట్రీట్‌మెంట్ బాగా జరుగుతోందా? ఇప్పుడెలా ఉందన్నా?
» జగనన్నా.. నమస్తే.. దేవుడి దయతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డా. పెద్ద శబ్దంతో పేలుడు జరిగింది. ఏమైందో తెలుసుకునే లోపు గాయాలపాలయ్యా. తల, మెడ, కాలికి దెబ్బలు తగిలాయి. డాక్టర్లు బాగానే చూసుకుంటున్నారు.
» మీరేం దిగులు పడకండన్నా. అమ్మా..! రామ్‌మెహర్ బాబుని జాగ్రత్తగా చూసుకోండి. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా మేం పోరాడతాం... అంటూ బాధితుడి భార్యకు జగన్ భరోసానిచ్చారు.
అక్కడి నుంచి మూడో ఫ్లోర్‌లో చికిత్స పొందుతున్న యలమంచిలికి చెందిన డి.అప్పారావును వైఎస్ జగన్ పలకరించారు.
» అన్నా ఎలా ఉన్నారు? వైద్యం బాగా అందుతోందా?
» నమస్తే జగనన్నా.. ఇప్పుడు బాగానే ఉంది. వైద్యం బాగానే అందుతోంది.
» ప్రమాదం ఎలా జరిగిందన్నా.? అప్పుడు మీరు ఏం చేస్తున్నారు..?
» అన్నా.. కంపెనీలో నేను ‘బీ’ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లా. నేను పైకి వెళ్తున్న సమయంలో ఏ–షిఫ్ట్ వాళ్లంతా కిందకి వస్తున్నారు. ఇంతలో పెద్ద శబ్ధం వచ్చిందన్నా.. అద్దాలు పగిలిపోయాయి. అందరం కిందపడిపోయాం. నా తలకు బలంగా ఓ అద్దం ముక్క తగిలింది. కాసేపటికి కొందరు వచ్చి నన్ను హాస్పిటల్‌కు తీసుకొచ్చారు.
» అయ్యో.. జాగ్రత్తన్నా.. ప్రభుత్వం నుంచి ఏమైనా సాయమందిందా..?
» ఇంకా లేదన్నా.. ఇస్తామని చెప్పారు. నా భార్య సత్యవతి, మా ఇద్దరు పాపలు నా జీతం మీదే ఆధారపడి బతుకుతున్నారు. నేను ఉద్యోగానికి వెళ్లకపోతే ఇల్లు గడవదన్నా.
» మరేం ఫర్వాలేదన్నా.. మీరు ధైర్యంగా ఉండండి. మీకు రావాల్సిన పరిహారం వచ్చేలా మేం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం.
పక్కనే చికిత్స పొందుతున్న యలమంచిలికి చెందిన ఎ.పరమేశ్‌ని వైఎస్ జగన్ పరామర్శించారు.
» అన్నా.. ఎలా ఉంది ఆరోగ్యం..?
» నమస్తే అన్నా.. ఏదో బయటపడ్డాం అన్నా. ప్రమాదం జరిగిన క్షణాల్లో తల, చెవి, చేయి కాలిపోయింది. ఆస్పత్రికి వచ్చి ట్రీట్‌మెంట్ అందేవరకూ కాలిన గాయాలతో నరకం చూశా. నా కుటుంబం దగ్గరకు చేరుకుంటానా లేదా అనే ఆందోళనే నాలో ఎక్కువైపోయిందన్నా..
» బాధ పడొద్దన్నా.. మీరు త్వరగా కోలుకుంటారు. జాగ్రత్త అంటూ ఆత్మీయంగా పరామర్శించారు.
దేశ పాత్రుని పాలెం ప్రాంతానికి చెందిన కె.షణ్ముఖరాజుని జగన్ పరామర్శించారు.
» అన్నా.. కంటికి గాయమైందా.? ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ పనిచేస్తున్నారన్నా.?
» నమస్తే సర్.. నేను ప్రొడక్షన్‌లో పనిచేస్తున్నా. ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉన్నా. ఆ శబ్దానికి తూలిపోయి కిందపడ్డా. కంటిమీద, మొహం మీద బాగా దెబ్బలు తగిలాయి. ఇప్పుడు బాగానే ఉంది కానీ పైనుంచి పడిపోవడం వల్ల.. ఒళ్లంతా నొప్పిగా ఉందన్నా.. కదల్లేకపోతున్నా.
» తగ్గిపోతుందన్నా.. మీరు ధైర్యంగా ఉండండి. ట్రీట్‌మెంట్‌కు సహకరిస్తే.. అంతా మంచే జరుగుతుంది. పరిహారం కచ్చితంగా అందేలా నేను చూసుకుంటానంటూ ధైర్యాన్నిచ్చారు.
బాధితుడు ప్రభాత్ యాదవ్ వద్దకు వచ్చిన వైఎస్ జగన్ ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.
» అన్నా.. ఎలా ఉంది ఇప్పుడు..? కంపెనీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు.?
» నాది హైదరాబాద్ బ్రాంచ్. నెల రోజుల ట్రైనింగ్ కోసం ఇక్కడికి ఈ నెల 18న వచ్చా. ఆ రోజు నాతోపాటు ఇక్కడే పనిచేస్తున్న మరో ఇద్దరు కలిసి మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళ్తున్నాం. ఇంతలో భారీ శబ్దం వచ్చింది. తర్వాత ఏమీ కనిపించలేదు. కాసేపటి తర్వాత చూసే సరికి.. ముగ్గురం రక్తాలు కారుతూ వేర్వేరు చోట్ల పడి ఉన్నాం. నా పక్కన ఉన్న వాళ్లిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు.
» అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నా. మీరు జాగ్రత్తగా ఉండండి... మీకు పరిహారం అందేలా చూస్తామంటూ జగన్ భరోసా ఇచ్చారు.
మరో వార్డులో చికిత్స పొందుతున్న ఉమ్మలాడకు చెందిన యామినిని వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరించారు.
» తల్లీ ఎలా ఉంది ఇప్పుడు.? ఎంతకాలం నుంచి అక్కడ పనిచేస్తున్నావు?
» నమస్తే జగనన్నా.. నేను ఏడాది క్రితం నుంచి ఎసైన్షియాలో కెమిస్ట్రీ ల్యాబ్‌లో పనిచేస్తున్నా.
» ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉన్నావా తల్లీ.?
» అవునన్నా.. కంపెనీ డిపో పక్కనే ఉన్న ల్యాబ్‌లో పనిచేస్తున్నా. ఇంతలో పెద్ద బాంబు పేలినట్లుగా శబ్దం వచ్చింది. పై నుంచి కిందకు పడిపోయా. ఇద్దరు వ్యక్తులు వచ్చి నన్ను తీసుకెళ్లడం గుర్తుంది. తలకు దెబ్బతగిలింది. తుంటి ఎముక విరిగిపోయింది.
» భయపడొద్దు తల్లీ.. ఆరోగ్యం జాగ్రత్త. పాప క్షేమంగా ఇంటికి వస్తుంది. మీరేం కంగారు పడకండమ్మా.. అంటూ యామిని తల్లిదండ్రులకు జగన్ భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment