
బాధితులు ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి.. సర్కారుకు వైఎస్ జగన్ అల్టిమేటం
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇకనైనా మేలుకోండి.. మేం తెచ్చిన ప్రొటోకాల్స్ పక్కాగా అమలు చేస్తే దుర్ఘటనలు జరిగేవి కావు
బాధితుల పట్ల ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించాలి.. ఈ సర్కారుకు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే లేదు
సూపర్ సిక్స్ హామీలపైనా పట్టింపు లేదు
కక్షలు తీర్చుకునేందుకు కొట్టడం, చంపడం.. ఇదీ వీరి రెడ్‌బుక్ పాలన
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా ప్రమాద బాధితులందరికీ న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతులతోపాటు క్షతగాత్రుల్లో ప్రతి ఒక్కరికీ పరిహారం అందించే వరకు బాధితుల తరపున తాము పోరాడతామని ప్రకటించారు. ప్రభుత్వానికి 2–3 వారాల సమయం ఇస్తున్నామని, బాధితులందరికీ నష్ట పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగుతుందని, అవసరమైతే తాను కూడా స్వయంగా వచ్చి ధర్నాలో పాల్గొంటానని స్పష్టం చేశారు.
దుర్ఘటనలు జరిగినప్పుడు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వేగంగా స్పందించాలని, నష్ట పరిహారం అందించే విషయంలో సానుభూతితో, మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సేఫ్టీ ప్రొటోకాల్స్‌ను పక్కాగా పర్యవేక్షిస్తూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఎవరెవరు ఏం చేయాలి? ప్రొటోకాల్ ప్రకారం జరుగుతోందా? లేదా? అని పర్యవేక్షిస్తే ఫ్యాక్టరీల పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈ రోజు ఇంతమంది ఇలా చనిపోయి ఉండేవారు కాదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటనలో గాయపడి ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ జగన్ శుక్రవారం పరామర్శించారు. ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి దుర్ఘటన ఎలా జరిగింది? ఆరోగ్యం ఎలా ఉంది? బాగా చూసుకుంటున్నారా? అని వాకబు చేశారు. ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ న్యాయం జరిగే వరకు పోరాడతామని, తాము అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు.
స్పందించకూడదన్న ధోరణిలో సర్కారు..
అచ్యుతాపురం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు, స్పందన ఏమాత్రం సరిగా లేదు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే దీనిపై స్పందించకూడదన్న ఉద్దేశమే ప్రభుత్వంలో ఎక్కువగా కనిపిస్తోంది. 17 మంది చనిపోతే.. సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బాధితులకు భరోసా కల్పించేందుకు అనకాపల్లి వెళుతున్నానన్న మాటే నోటి నుంచి రాలేదు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌ను పర్యవేక్షించే కార్మికశాఖ మంత్రి కూడా ప్రెస్‌మీట్‌లో ఎంత మంది చనిపోయారో వివరాలు లేవని మాట్లాడారు.
ఆయన కూడా హుటాహుటిన అక్కడకు వెళ్లాలనే ఉద్దేశం చూపించలేదు. ఘటన జరిగిన తర్వాత ఆ స్థలానికి కలెక్టర్ ఎప్పుడు వెళ్లారు? అధికారులు, కమిషనర్ ఎప్పుడు వెళ్లారనే అంశాలను గమనిస్తే బాధ కలుగుతోంది. ఇక అధికారపార్టీ నాయకులు ఎప్పుడు వెళ్లారని గమనిస్తే ఎంతో బాధ కలిగిస్తోంది. ఘటన జరిగితే కనీసం అంబులెన్సులు కూడా సమీకరించలేని పరిస్థితి నెలకొంది. బాధితులను కంపెనీ బస్సుల్లోనే తరలించాల్సిన దుస్థితి.
అప్పటికి... ఇప్పటికి తేడా ఇదీ..
ఇలాంటి ఘటనే మా ప్రభుత్వ హయాంలో కూడా ఒకసారి జరిగింది. కోవిడ్ మహమ్మారి సమయంలో మే 2020లో ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. కానీ కోవిడ్ ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎలా స్పందించిందన్నది తేడా ఒకసారి గమనించాలి. ఆ ఘటన తెల్లవారుజామున 3.40 గంటల సమయంలో జరిగితే 5 గంటల కల్లా కలెక్టర్, కమిషనర్ ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే అంబులెన్సులన్నీ పెద్ద ఎత్తున మోహరించాయి. ప్రతి బాధితుడికి తోడుగా నిలుస్తూ ఉదయం 6 గంటలకల్లా వైఎస్సార్ సీపీకి చెందిన సీనియర్ నాయకులందరూ ఘటనా స్థలానికి వెళ్లారు.
అదే రోజు 11 గంటల కల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే స్పాటు వద్దకు వెళ్లా. బాధితులకు 24 గంటల్లోనే ఏకంగా కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎన్నడూ జరగలేదు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకుని బాధితుల పట్ల ఇంతగా సానుభూతితో వ్యవహరించిన సంఘటనలు గతంలో లేవు. మొట్టమొదటిసారిగా నష్ట పరిహారం కోటి రూపాయలు ఇచ్చింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే.. మన ప్రభుత్వమే.. జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని గర్వంగా చెప్పగలుగుతున్నా.
24 గంటల్లోనే ఏకంగా రూ.30 కోట్లు అక్కడకు పంపించి బాధితులకు తోడుగా నిలిచాం. బాధితులను వెంటనే ఆస్పత్రిలో చేర్పించడంతోపాటు 3 రోజులు ఆస్పత్రిలో ఉంటే రూ.10 లక్షలు, ఒక రోజు ఉంటే రూ.3 లక్షలు, చిన్న చిన్న గాయాలైన వారికి రూ.25 వేలు చొప్పున ఇప్పించాం. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాల్లో 15 వేల జనాభా ఉండగా ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు ఇచ్చి తోడుగా నిలిచిన పరిస్థితులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.. ఒక సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించే తీరు ఎలా ఉండాలనేది చాలా ముఖ్యం.
సానుభూతి చూపాలి.. బాధ్యత తీసుకోవాలి
చంద్రబాబు ఇక్కడకు వచ్చినప్పుడు నిర్వహించిన ప్రెస్‌మీట్ చూసి ఆశ్చర్యపోయా. జగన్ హయాంలోనూ ఘటనలు జరిగాయంటూ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 2014–19 మధ్యలో ప్రమాదాలు జరగలేదా? ఎవరున్నా ఇటువంటి ఘటనలు జరుగుతాయి. కానీ అలా జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ముఖ్యమైన విషయం. ప్రభుత్వం ఇటువంటి ఘటనల సమయంలో ప్రజల పట్ల, బాధితుల పట్ల సానుభూతి చూపించాలి. రెండోది ఏమిటంటే.. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకుంది.
ఇవాళ చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆధ్వర్యంలోనే ఒక హై లెవల్ కమిటీని నియమించి ఫ్యాక్టరీ సెక్యూరిటీ, పొల్యూషన్ కంట్రోల్ అంశాలను జోడించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తేవాల్సిన సంస్కరణలపై సిఫారసులు చేయాలని కమిటీని నాడు మా ప్రభుత్వం కోరింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆగస్టు 2020లో ఒక జీవో కూడా జారీ చేశాం. దీనిపై పక్కాగా ప్రొటోకాల్ కూడా తీసుకొచ్చాం. ఫ్యాక్టరీ భద్రత ప్రొటోకాల్, కాలుష్య నియంత్రణ ప్రొటోకాల్.. అన్నింటినీ కలిపి ఒకే ప్రొటోకాల్ తెచ్చాం.
ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రతి కంపెనీ సెల్ఫ్ కంప్లయిన్స్ రిపోర్టు ఇవ్వాలి. తయారు చేసే నైపుణ్యం ఆ కంపెనీకి సొంతంగా లేకపోతే గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ద్వారా తీసుకుని కచ్చితంగా ఇవ్వాలి. ఆ నివేదిక ఆధారంగా నిజంగానే అన్నీ సరిగ్గా ఉన్నాయా? ఇంకా ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? అనే విషయాన్ని అన్ని విభాగాల అధికారులతో కూడిన కమిటీ పరిశీలించి నెల రోజుల తర్వాత తనిఖీలు నిర్వహిస్తుంది.
ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే సరిదిద్దుకునేందుకు కంపెనీకి 15 రోజుల సమయం ఇస్తుంది. గడువులోగా అది పూర్తయ్యేలా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షించాలని ప్రొటోకాల్‌లో ఉంది. ఇది ఇప్పటికే అమల్లో ఉంది. అదొక సంస్కరణ కింద తెచ్చాం. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వీటిని తు.చ. తప్పకుండా అమలు చేసేలా పర్యవేక్షించి ఉంటే ఇటువంటి ఘటనలు పునరావృతమయ్యేవి కాదు.
లోతైన విచారణ జరగాల్సిందే..
ఇవాళ చంద్రబాబుకు ఒకటే మాట చెబుతున్నా. నష్టపరిహారం అన్నది సానుభూతితో ఇవ్వాలి. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇంత మంది ఆస్పత్రిలో ఉన్నారు. వారికి ఇస్తామన్న డబ్బులు వెంటనే ఇప్పించే ఏర్పాట్లు చేయండి. ఫ్యాక్టరీలలో భద్రతా చర్యలపై తెచ్చిన ప్రొటోకాల్‌ను కనీసం ఇప్పటి నుంచైనా పర్యవేక్షించే దిశగా అడుగులు వేయాలి. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి.
ఆ ఫ్యాక్టరీకి సంబంధించి వాస్తవంగా ఏం జరిగిందో విచారణ చేయండి. యాజమాన్యం ఎవరైనా కానీ.. ఎందుకు తప్పు జరిగిందో విచారణ జరగాలి. సేఫ్టీ పారామీటర్స్ అమలైతే ఇటువంటి ఘటనలు నివారించవచ్చు. ఇవన్నీ కచ్చితంగా అమలు చేసేందుకు 2–3 వారాల సమయం ఇస్తాం. చనిపోయిన వారందరికీ నష్టపరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే బాధితుల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగుతుంది. అవసరమైతే నేను కూడా స్వయంగా వచ్చి ధర్నాలో పాల్గొంటా.
ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎంపీ తనూజ రాణి, మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్, పేర్ని నాని, కృష్ణదాస్, ఎమ్మెల్యేలు మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మేయర్ హరి వెంకటకుమారి, జడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర తదితరులు పాల్గొన్నారు.
పాలన ఇలాగేనా?
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏ రకంగా అమలు జరిగిందో మీరంతా చూశారు. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యాదీవెన డబ్బులు ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేవి. ఇప్పటికే రెండు త్రైమాసికాలు అయిపోయాయి. మూడోది కూడా ముగిసేందుకు దగ్గర పడుతున్నా ఇంతవరకు పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో, అసలు ఇస్తుందో లేదో కూడా తెలియదు.
ఒకవైపు పిల్లలను ఫీజులు కట్టాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫీజులు చెల్లించకుంటే సర్టిఫికెట్లు ఇవ్వబోమంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరి పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20 వేలు ఎప్పుడిస్తారని రైతులు అడుగుతున్నారు. గతంలో రైతు భరోసా కింద వారికి ఏటా రూ.13 వేలు చొప్పున అందించాం. ఇప్పుడు ఇంతవరకు రూపాయి రాలేదు.
ఇక ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. బీమా సొమ్ము అందని పరిస్థితుల్లో రైతన్న ఉన్నాడు. ఇవాళ విత్తనాలు, ఎరువులు కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. గడప వద్దకు వచ్చే పింఛను, రేషన్ ఆగిపోయింది. ఈ రోజు ప్రతి వ్యవస్థలో అవినీతి, వివక్ష పెరిగిపోయింది. టీడీపీ నాయకుల చుట్టూ తిరిగితే కానీ ఏవీ రావనే సందేశాన్ని పంపిస్తున్నారు.
వీళ్ల ధ్యాసంతా రెడ్ బుక్‌పైనే
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలలుగా ఏం జరుగుతోంది? వీరికి పాలన మీద ధ్యాస లేదు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, సూపర్ టెన్‌ల మీద ధ్యాస లేదు. వీళ్ల ధ్యాసంతా రెడ్ బుక్ తెరవడం.. ఎవరెవరిపై కక్షలు ఉన్నాయో వాటిని తీర్చుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపైనే! కక్షలు తీర్చుకోవడానికి రోజూ కొట్టడం, చంపడం, ఆస్తులను ధ్వంసం చేస్తున్న ఘటనలే కనిపిస్తున్నాయి.
కూటమి పాలనలో ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన, తాపత్రయం కనిపించని అధ్వాన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. వీళ్లు పరిపాలన మీద దృష్టి పెట్టి ఉంటే ఇంగ్లిష్ మీడియంతో మన స్కూల్స్ బాగుపడి ఉండేవి. 3వ తరగతిలోనే టోఫెల్ క్లాసులు, నాడు–నేడు కొనసాగి ఉండేవి. గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ నాశనమైపోయాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లులు ఇవ్వకపోవడంతో పేదలకు వైద్యం అందని దుస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment