వీటి నివారణకు ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను పరిశీలిస్తున్నాం
త్వరలో ప్రభుత్వానికి మంచి నివేదిక ఇస్తాం
మీడియాతో హైలెవల్ కమిటీ చైర్‌పర్సన్ వసుధా మిశ్రా
సాక్షి, విశాఖపట్నం: చిన్నచిన్న మానవ తప్పిదాలవల్లే ఫార్మా కంపెనీల్లో పెద్దపెద్ద ప్రమాదాలు సంభవిస్తున్నాయని హైలెవల్ కమిటీ చైర్‌పర్సన్ వసుధా మిశ్రా స్పష్టంచేశారు. పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై, అనుసరించాల్సిన విధానాలపై, ప్రమాదాల అనంతరం చేపట్టాల్సిన సహాయక చర్యలపై శుక్రవారం విశాఖలోని ఓ హోటల్‌లో జరిగిన ఉన్నతస్థాయి కమిటీ తొలిభేటీలో మేథోమథన చర్చ జరిగింది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, పరవాడ పారిశ్రామికవాడలో ఇటీవల జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఏర్పడిన కమిటీ తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన చైర్‌పర్సన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి వసుధా మిశ్రా వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వానికి అందించాల్సిన నివేదికలో పొందుపరచాల్సిన అంశాలపై, భవిష్యత్తు కార్యాచరణపై ఈ భేటీలో చర్చించారు.
కార్మిక శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు ఎంఎన్ హరేంధిర ప్రసాద్, విజయ్‌కృష్ణన్.. చెన్నై, తిరుపతి ఐఐటీల ప్రొఫెస ర్లు, ఇతర సభ్యులు సూచనలు ఇచ్చారు. అనంతరం మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ‘ఎసైన్షియా’ వంటి ప్రమాదాలు జరగకుండా సాంకేతిక సహాయంతో ప్రపంచస్థాయి ఉత్తమ విధానాలను అవలంభించాల్సి ఉందన్నారు.
ప్రమాదాలు జరగకుండా స్టాండర్డ్ ప్రోటోకాల్స్..
ఇక ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా స్టాండర్డ్ ప్రోటోకాల్స్ పెట్టాలని సూచించినట్లు వసుధా మిశ్రా తెలిపారు. వివిధ రాష్ట్రాల్లోనూ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని వివరించారు. ఇటీవల జరిగిన ఎసైన్షియా ప్రమాదంలో పూర్తిగా మానవ తప్పిదం ఉందన్నది తమ పరిశీలనలో స్పష్టమైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment