పరవాడ జేఎన్ ఫార్మా సిటీలోని సినర్జిన్ ఫార్మాలో లీకైన రసాయనాలు
మంటలు వ్యాపించడంతో నలుగురు కాకులకు తీవ్ర గాయాలు
సాక్షి, అనకాపల్లి/పరవాడ: ‘అచ్యుతాపురం–పరవాడ’ సెజ్‌లో వరుస ప్రమాదాలు కార్మికులు, వారి కుటుంబాలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలో జరిగిన ఏడు ప్రమాదాల్లో 22 మంది మృతిచెందారు. రెండు రోజుల కిందట అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో 17 మంది మరణించిన దుర్ఘటన మరువక ముందే... పరవాడ సెజ్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది.
పరవాడ సమీపంలోని జేఎన్ ఫార్మాసిటీలో సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్–3 యూనిట్‌లో గురువారం అర్ధరాత్రి రియాక్టరు నుంచి రసాయనాలు వెలువడి పొగతో కూడిన మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు, విజయనగరం జిల్లాకు చెందిన ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన విశాఖపట్నంలోని ఇండస్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రమాదం జరిగింది ఇలా...
సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్–3 యూనిట్‌లో గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్టు కార్మికులు రొయా ఆర్జీ, లాల్‌సింగ్, ఆయూ ఖాన్, విజయనగరానికి చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ కలిసి 6 కేఎల్ సామర్థ్యం ఉన్న రియాక్టర్‌ను చార్జ్ చేస్తున్నారు. రసాయనాలు కలిపేటప్పుడు రియాక్షన్ ఏర్పడి పొగతోపాటు మంటలు వ్యాప్తిచెందాయి.
కొద్ది క్షణాల్లోనే మ్యాన్‌హోల్ నుంచి కూడా రసాయనాల రియాక్షన్ సంభవించి మంటలు మరింత వ్యాపించాయి. దీంతో అక్కడే ఉన్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన హెల్పర్లు ఓఏ కోరా(24), లాల్‌సింగ్ పుర్తీ(22), రోయాన్ అంజీరియా(22), విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ కెమిస్ట్ సూర్యనారాయణ(34)కు తీవ్ర గాయాలయ్యాయి. ఫార్మా కంపెనీ యాజమాన్యం వెంటనే ప్రొడక్షన్ నిలిపివేసింది. తక్షణమే క్షతగాత్రులను ఇండస్ ఆస్పత్రికి ఎయిర్ బస్సులో తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓఏ కోరాకు 75 శాతం, లాల్‌సింగ్ పుర్తీ, రోయాన్ అంజీరియా(22)లకు 60 శాతానికి పైగా శరీరాలు కాలిపోవడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. సూర్యనారాయణ(34)కు కాలిన గాయాలు తక్కువగా ఉన్నప్పటికీ రసాయనాలు పీల్చడంతో పొట్ట ఉబ్బిపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన కూటమి నేతలు, అధికారులు
సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్–3 యూనిట్‌లో ప్రమాదం గురించి తెలుసుకున్న కూటమి నేతలు శుక్రవారం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎంపీ సీఎం రమే‹Ù, స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ దీపిక పాటిల్, ఆర్డీవో మురళీకృష్ణ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. ఇండస్ ఆస్పత్రిలో క్షతగాత్రులను హోంమంత్రి అనిత పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపట్టాలని పరిశ్రమ యాజమాన్యాన్ని ఆదేశించారు.
రెండు ఘటనలపై కేసులు నమోదు
అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మాలో ప్రమాదానికి కంపెనీ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా సినర్జిన్ ఫార్మాలో ప్రమాదానికి కూడా కంపెనీ నిర్లక్ష్యమే కారణమని సెక్షన్ 125, 289 బీఎన్‌ఎస్ కింద పరవాడ సీఐ ఎస్.బాలసూర్యరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment