సాక్షి, విశాఖపట్నం: గత ప్రభుత్వ కాలంలోనే కాకుండా.. అంతకుముందు పాలించిన మీ హయాంలోనూ పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయని సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఎఎస్ శర్మ గుర్తుచేశారు. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం దృష్ట్యా భవిష్యత్తులో ఈ తప్పిదాలు జరగకుండా ముఖ్యమంత్రికి పలు సూచనలు చేస్తూ శర్మ శనివారం బహిరంగ లేఖ రాశారు.
ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేసి లాభాలు గడిస్తూ అక్కడి కార్మికులు, స్థానికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యాల మీద ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవట్లేదని ఆయన పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకులకు, పరిశ్రమల యజమానుల మధ్య ఉన్న సంబంధాలే దీనికి కారణమని ఆరోపించారు.
గత ప్రభుత్వ తప్పిదాలవల్లే ప్రమాదాలు జరిగాయన్న చంద్రబాబు వ్యాఖ్యలపై శర్మ స్పందిస్తూ.. 2014లో తమరు అధికారంలో ఉన్న సమయంలోనూ ప్రమాదాలు జరిగిన విషయం గుర్తుచేసుకోవాలని సూచించారు. 2013 నుంచి 2019 మధ్య కాలంలో కేవలం పరవాడ ఫార్మా సెజ్‌లోనే 24 ప్రమాదాలు సంభవించగా 21 మంది ప్రాణాలు కోల్పోయారనీ, 69 మంది గాయాలపాలయ్యారన్నారు. ప్రభుత్వం ఏదైనా ప్రమాదాలు సహజంగా మారిపోయాయని విమర్శించారు.
మీరు వచ్చి వెళ్లగానే మరో ప్రమాదం..
ఎసైన్షియా ప్రమాద బాధితుల్ని పరామర్శించి వెళ్లిన రోజు రాత్రే మరో ప్రమాదం జరిగిన విషయం కూడా చంద్రబాబు గుర్తుచేసుకోవాలని ఈఏఎస్ శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇంతమంది మృత్యువాత పడుతున్నా పరిశ్రమల యజమానులు ఎందుకు ఒక్కరోజైనా జైలుకు వెళ్లడంలేదని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించడం అభినందనీయమే అయినా.. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు పునరావృతం కాకుండా నిబంధలను కఠినతరం చేయాలని ఆయన కోరారు.
పరిశ్రమల్లో ప్రమాదాలను, కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టాలంటే, ప్రభుత్వ విధానాల్లోనూ, వైఖరిలోనూ లోతైన మార్పులు రావాలన్నారు. ఎసైన్షియా యాజమాన్యాన్ని ప్రభుత్వం క్షమించకూడదనీ.. చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల అమలులో ఉదాశీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులపైనా చర్యలు తీసుకోవాలంటూ శర్మ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment