సీఎం జగన్‌ చేతుల మీదుగా ‘ఏటీసీ టైర్స్‌’ ప్రారంభం | Alliance Tires Company Tires Launch By CM Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ చేతుల మీదుగా ‘ఏటీసీ టైర్స్‌’ ప్రారంభం

Published Tue, Aug 16 2022 4:06 AM | Last Updated on Tue, Aug 16 2022 8:04 AM

Alliance Tires Company Tires Launch By CM Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ యకహోమా గ్రూప్‌ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో నెలకొల్పిన అలయన్స్‌ టైర్స్‌ కంపెనీ (ఏటీసీ) యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. సుమారు రూ.2,200 కోట్ల పెట్టుబడి అంచనాతో రెండు దశల్లో ఇది ఏర్పాటు కానుంది. తొలిదశలో రూ.1,384 కోట్లతో హఫ్‌ హైవే టైర్ల తయారీ యూనిట్‌లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా టైర్ల ఉత్పత్తిని పరిశీలించిన ఏటీసీ నేటి నుంచి వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది.

100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కంపెనీ ఆరు ఖండాల్లో 120కిపైగా దేశాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తమిళనాడులోని తిరునల్వేలి, గుజరాత్‌లోని దహేజ్‌లో ఇప్పటికే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్లను నెలకొల్పింది, అచ్యుతాపురం యూనిట్‌ మూడోది. తొలి దశ యూనిట్‌లో ఉత్పత్తిని ప్రారంభించిన అనంతరం రూ.816 కోట్లతో చేపట్టే రెండో దశ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి జగన్‌ భూమి పూజ నిర్వహించనున్నారు. మొత్తం రెండు దశల్లో ఏర్పాటయ్యే ఈ యూనిట్‌ ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. 

8 యూనిట్లు.. మరో రూ.వెయ్యి కోట్లకుపైగా పెట్టుబడులు 
ఏటీసీ రెండో దశ విస్తరణతో పాటు మరో 8 యూనిట్ల నిర్మాణ పనులకు సంబంధించి కూడా సీఎం జగన్‌ భూమి పూజ నిర్వహించనున్నారు. ఇందులో ఏడు అచ్యుతాపురం సెజ్‌లోనే ఏర్పాటు కానుండగా ఒకటి పరవాడ ఫార్మాసిటీలో ఏర్పాటవుతోంది. మొత్తం ఎనిమిది యూనిట్ల ద్వారా రూ.1,002.53 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానుండగా 2,664 మందికి ఉపాధి లభించనుంది. వీటికి ప్రభుత్వం 250 ఎకరాలు కేటాయించింది.

ఆప్టిమస్‌ డ్రగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
ఇప్పటికే హైదరాబాద్, పరవాడలలో మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసిన ఈ సంస్థ పరవాడలో రూ.125 కోట్ల పెట్టుబడితో మరో యూనిట్‌ స్థాపనకు ముందుకొచ్చింది.

8 కంపెనీల వివరాలు ఇవీ
పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ప్రత్యేక రసాయనాల ఉత్పత్తిలో పేరొందిన పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ రాష్ట్రంలో రూ.202 కోట్లతో యూనిట్‌ ఏర్పాటు చేస్తోంది. వాటర్‌ ప్రూఫింగ్‌ ఉత్పత్తుల తయారీ, కోటింగ్, సీలెంట్స్‌ తదితర ఉత్పత్తులను అచ్యుతాపురం సెజ్‌లో తయారు చేయనున్నారు. ఈ యూనిట్‌ ఏర్పాటు ద్వారా 380 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

మేఘ ఫ్రూట్‌ ప్రాసెసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 
కార్బొనేటెడ్‌ ఫ్రూట్‌ డ్రింక్స్, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్, ఫ్రూట్‌ జ్యూస్‌ల టెట్రా ప్యాకింగ్, పెట్‌ బాటిల్స్‌ తదితర ఉత్పత్తుల బెవరేజెస్‌ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పనున్నారు. ఇప్పటికే మంగుళూరు, సంగారెడ్డిలో యూనిట్లు ఉన్న ఈ కంపెనీ అచ్యుతాపురం సెజ్‌లో రూ.185.25 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందులో దాదాపు 700 మందికి ఉద్యోగాలను కల్పించనున్నారు.

ఐనాక్స్‌ ఎయిర్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  
ఇండస్ట్రియల్‌ గ్యాసెస్‌ తయారీలో పేరొందిన ఈ సంస్థ దేశంలో ఇప్పటికే 38 తయారీ యూనిట్లను నెలకొల్పింది. రూ.145 కోట్ల పెట్టుబడితో లిక్విడ్‌ ఆక్సిజన్, లిక్విడ్‌ నైట్రోజన్, లిక్విడ్‌ ఆర్గాన్‌ తదితరాలను ఇక్కడ తయారు చేయనున్నారు.

విన్‌ విన్‌ స్పెషాలిటీ ఇన్సులేటర్స్‌ లిమిటెడ్‌  
అత్యాధునిక సాంకేతికతతో కూడిన వోల్టేజ్‌ సిరామిక్‌ ఇన్సులేటర్స్, పాలిమెరిక్‌ ఇన్సులేటర్ల తయారీలో పేరుగాంచిన ఈ కంపెనీ దాదాపు రూ.107.70 కోట్ల పెట్టుబడితో అచ్యుతాపురం సెజ్‌లో యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. 

సైనాప్టిక్స్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  
బల్క్‌ డ్రగ్స్, ఇంటర్మీడియట్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ దాదాపు రూ. 81.75 కోట్ల పెట్టుబడితో అచ్యుతాపురం సెజ్‌లో యూనిట్‌ ఏర్పాటుకు సిద్ధమైంది.  

స్టైరాక్స్‌ లైఫ్‌సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
బల్క్‌ డ్రగ్స్, ఇంటర్మీడియట్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ దాదాపు రూ. 87.77 కోట్ల పెట్టుబడితో అచ్యుతాపురం సెజ్‌లో యూనిట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది.

ఇషా రిసోర్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 
కోక్, కోల్‌ స్క్రీనింగ్‌ కొరకు ఈ సంస్థ రూ.68.06 కోట్ల పెట్టుబడితో అచ్యుతాపురం సెజ్‌లో యూనిట్‌ నెలకొల్పనుంది. విశాఖపట్నం పెదగంట్యాడలో ఇప్పటికే కోక్, కోల్‌ స్క్రీనింగ్, గ్రేడింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement