CM YS Jagan Started ATC Tires Industry in Anakapalle District - Sakshi
Sakshi News home page

3 ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే: సీఎం జగన్‌

Published Tue, Aug 16 2022 4:12 PM | Last Updated on Tue, Aug 16 2022 5:49 PM

CM YS Jagan Started ATC Tires Industry in Anakapalle District - Sakshi

సాక్షి, అచ్యుతాపురం(అనకాపల్లి జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనకాపల్లిజిల్లా అచ్యుతాపురంలో ఏపీ ఎస్‌ఈజెడ్‌లో ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫస్ట్‌ ఫేజ్‌ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం మరో 8 కంపెనీలకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..

15 నెలల కాలంలోనే ఫ్యాక్టరీలో ఉత్పత్తి..
ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దేవుడి దయతో ఒక పరిశ్రమను ప్రారంభోత్సవం చేసుకోవడంతోపాటు,  రెండో దశ ప్లాంట్‌ విస్తరణ పనులకూ శంకుస్ధాపన చేశాం. యోకహోమా జపనీస్‌ టైర్ల తయారీ పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ.. కంపెనీ గురించి చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమంగా మొదటి 5–6 స్ధానాల్లో తమ కంపెనీ ఉందని, రాబోయే రోజుల్లో టాప్‌ 3లోకి పోబోతున్నామని చెప్పారు. అలాంటి కంపెనీ మన రాష్ట్రానికి రావడం సంతోషకరం. 2020 సెప్టెంబరులో మన దగ్గరకు వచ్చారు. అక్కడనుంచి చకచకా అన్ని రకాలుగా మద్ధతు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఫిబ్రవరి 2021లో పనులు ప్రారంభించి కేవలం 15 నెలల కాలంలోనే ఫ్యాక్టరీ ఉత్పత్తిలోకి వచ్చింది.

మనమిచ్చే ప్రోత్సాహంతో రెండో దశకూ శ్రీకారం..
మనమిచ్చే ప్రోత్సాహం, మద్దతు వారిని ఆకట్టుకుంది. అందుకే రెండోదశకు కూడా నాందిపలుకుతున్నారు. ఒకవైపు తొలిదశ ప్రాంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంటే.. మరోవైపు సెకెండ్‌ ఫేజ్‌కు శంకుస్ధాపన కార్యక్రమం జరుగుతుంది. ఈ రెండో దశ కూడా సరిగ్గా 12 నెలల్లోనే ఆగష్టు 2023లోగా పూర్తి చేస్తామని చెప్తున్నారు. తొలిదశలో రూ.1250 కోట్ల రూపాయలతో దాదాపు 1200 మందికి ఉద్యోగాలు ఇక్కడే కల్పించారు. ఇవాళ మొదలయ్యే రెండోదశలో మరో రూ.850 కోట్లతో పనులు చేపట్టడంతో పాటు మరో 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొత్తంగా 2000 మందికి ఉపాధి ఇక్కడే.. మన పిల్లలకే అందుబాటులోకి వస్తుంది.

ఇవన్నీ కూడా ఎందుకు చెపుతున్నానంటే.. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, బాగుపడాలన్నా ఆ ప్రాంతంలో మన పిల్లలకు మెరుగైన ఉద్యోగాలు అందడం చాలా అవసరం. అలా ఆ ప్రాంతంలో చదువుకున్న మన పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇక్కడే మనం ఇప్పించగలిగితే.. పేదరికం నుంచి మన పిల్లలు బయటపడే పరిస్థితులు ఇంకా మెరుగవుతాయి. దీనికోసం ప్రభుత్వం పరంగా మనం చేయాల్సినవి అన్నీ కూడా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. 

చదవండి: (ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ ఇంటికి సీఎం​ జగన్‌)

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌– ఏపీ..
ఇవాళ రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక రంగంలో అడుగులు పడుతున్నాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మనం ఈరోజు గత మూడు సంవత్సరాలుగా దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా మనమే అవార్డు తీసుకుంటున్నాం. మొట్టమొదటి సారిగా ఈ సారి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌  సర్టిఫికేషన్‌ చేసేముందు దాని తీరును కూడా మార్చారు. 

మొట్టమొదటిసారిగా ఆ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వ్యక్తులతో వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వాటికి అనుకూలంగానే ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌బిజినెస్‌ ర్యాంకింగ్‌ ఇస్తున్నారు. అలా రూల్స్‌ మార్చిన నేపథ్యంలో వరుసగా మూడేళ్లుగా ఏపీ నంబర్‌ 1 ర్యాంకు సాధిస్తోంది. ఇవాళ ప్రతి అడుగులో కూడా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం.

గతంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చేవారు కాదు. ఏళ్ల తరబడి పరిశ్రమల ప్రోత్సాహాకాలు పేరుకుపోయాయి. ఆ నేపథ్యంలో చిన్నా చితకా పరిశ్రమలు నడవలేక మూతబడుతున్న పరిస్థితులు. దాదాపు లక్షకుపైగా ఎంఎస్‌ఎంఈలు రాష్ట్రంలో ఉన్నాయి. పదిలక్షల మందికి పైగా ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారు. 

ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకంగా..
ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సహం ఇచ్చే కార్యక్రమం గత ప్రభుత్వాలు ఎప్పుడో మర్చిపోయిన సందర్భంలో... మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా గుర్తు పెట్టుకుని పాత బకాయిలను క్లియర్‌ చేస్తూనే, మరోవైపు ఎలాంటి బకాయిలు లేకుండా ప్రతి సంవత్సరం వారికి రావాల్సిన ఇన్సెంటివ్‌లు అందిస్తున్నాం. వాళ్లను చేయిపట్టుకుని నడిపిస్తూ ప్రోత్సహిస్తూ ఈ మూడు సంవత్సరాల కాలంలో రూ.1463 కోట్లు ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చాం. ఈ రకంగా ప్రభుత్వం ప్రతి దశలోనే ప్రోత్సహిస్తూ.. అడుగులు ముందుకు వేస్తుంది కాబట్టే ఈ రోజు.. 2021–22 చూస్తే ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌డీపీ గ్రోత్‌రేట్‌ 11.43 శాతం సాధించాం. దేశంలో చూస్తే అది కేవలం 8.9శాతమే. దేశంతో పోలిస్తే.. రాష్ట్రం వేగంగా అడుగులు ముందుకేస్తోంది.

ఎగుమతుల్లోనూ..
ఎగుమతుల్లో చూస్తే.. ఇప్పటికే మన రాష్ట్రంలో ఆరు పోర్టులుంటే.. ఈ 3 ఏళ్లకాలంలో వేగంగా మరో 4 పోర్టులు కట్టేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నాం. ఒకవైపు పోర్టులు కొత్తవి నిర్మించడంతో పాటు 9 ఫిషింగ్‌ హార్బర్లుకూడా నిర్మిస్తున్నాం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్‌ కాని, ఒక పోర్టునుకాని అందుబాటులోకి తెస్తున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు ఆంధ్రరాష్ట్రంలో 2021–22 ఆర్ధిక సంవత్సరంలో ఎక్స్‌పోర్టెడ్‌ గూడ్స్‌ 19.3 బిలియన్‌ డాలర్లు అంటే ఇది మొత్తం దేశం ఎగుమతుల్లో 4.58 శాతం. ఈ పోర్టులు పూర్తయిన తర్వాత ఏపీ నుంచే 10శాతం ఎగుమతులు తీసుకొచ్చే విధంగా అడుగులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.  

ఇండస్ట్రియల్‌ కారిడార్లు..
3 ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఏపీలో మాత్రమే ఉన్నాయి. విశాఖ – చెన్నై, చెన్నై – బెంగుళూరు, హైదరాబాద్‌ – బెంగుళూరు కారిడర్‌లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే. గతంలో మన రాష్ట్రంవైపు చూడని వారు కూడా ఇప్పుడు మన వైపు చూస్తున్నారు. మన రాష్ట్రంలోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో సెంచరీ ప్లై వుడ్‌ భజంకాలు పేరు విన్నారా ? ఈ రోజు భజాంకాలు వైయస్సార్‌ జిల్లా బద్వేలులో సెంచరీ ప్లైవుడ్‌  ఫ్యాక్టరీ పెడుతున్నారు. గతంలో బంగర్‌ల పేర్లు ఎప్పుడైనా విన్నారా ? గతంలో ఎప్పడూ రాష్ట్రంవైపు చూడని వాళ్లు శ్రీ సిమెంట్స్‌.. ఇవాళ ఆంధ్రరాష్ట్రంలో ఫ్యాక్టరీ పెడుతున్నారు. 

గతంలో ఆదిత్యా బిర్లా ఏపీకి వచ్చి, సీఎంతో కలిసి వారి ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న విషయం మీరు చూశారా ? ఈ రోజు ఆదిత్య బిర్లా కూడా ఆంధ్రరాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రితో సహా వెళ్లి వాళ్ల ప్లాంట్‌ ప్రారంభిస్తున్నారు. గతంలో అదానీ, అదానీ అని పేరుకు మాత్రమే అనేవారు. కానీ ఆదానీ అనే సంస్ధ గతంలో ఏపీలో ఎప్పుడూ అడుగులు ముందుకు వేయలేదు. కేవలం జగన్‌ సీఎం అయిన తర్వాతనే అదానీలు ముందడుగు వేశారు. ప్రతి పెద్ద పరిశ్రమకు చెందిన వారందరూ కూడా ఏపీ వైపు చూసేట్టుగా అడుగులు పడుతున్నాయి. 

పారిశ్రామిక వేత్తలకు తోడుగా..
పారిశ్రామిక వేత్తలందరికీ ఒకటే మాట చెప్తున్నాం. మీరు పరిశ్రమ పెట్టండి.. అన్నిరకాలుగా సహాయ, సహకారాలిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది. అదానీ డేటా సెంటర్‌కు కూడా బహుశా వచ్చే నెలలో విశాఖలో శ్రీకారం చుడుతున్నాం. ఇక్కడ మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. ఒకవైపు వాళ్లను ప్రోత్సహిస్తూ.. అడుగులు ముందుకు వేయిస్తూ తీసుకొస్తున్నాం.

మీ తరపున కూడా సహాయ, సహకారాలు..
మరోవైపున మీ తరఫు నుంచి కూడా అంతే సహాయ సహకారాలు అందాలి. ఏకంగా 75శాతం కచ్చితంగా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టంచేశాం. మన మీద కూడా బాధ్యత ఉందనే విషయం మరిచిపోకూడదు. ఎవరైనా ఏపీకి రావడానికి సంతోషపడాలి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తే.. ఎలా పరిష్కరించుకోవాలి, ఏరకంగా గొడవ పడకుండా పరిష్కరించాలనుకోవాలన్నదానిపైన మనం అడుగులు వేయాలి. అప్పుడే ఆ పారిశ్రామిక వేత్తలకూ నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది.

అప్పుడు వాళ్లు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు. అప్పుడు మన పిల్లలకు పుష్కలంగా ఉద్యోగాలు వస్తాయి. మన వాళ్లు చాలా మంచి వాళ్లు, బాగా కష్టపడి పనిచేసేవాళ్లు, ఎటువంటి సమస్యలు సృష్టించరు అని వాళ్లు ఎప్పుడు అనుకుంటారో... అప్పుడు మన రాష్ట్రంలోకి ఇంకా పెట్టుబడులు వస్తాయి. ఆ బాధ్యత మన భుజాల మీద ఉందని... సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,  పలువురు ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement