విశాఖలో ఏర్పాటైన ఏటీసీ ప్లాంట్‌లో టైర్లను తయారు చేస్తున్న దృశ్యం
(అచ్యుతాపురం సెజ్ నుంచి సాక్షి ప్రతినిధి చంద్రశేఖర్ మైలవరపు): రాష్ట్రంలో మరో భారీ విదేశీ పెట్టుబడి వాస్తవ రూపంలోకి వచ్చింది. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూపునకు చెందిన అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ) విశాఖ సమీపంలోని అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేసిన భారీ హాఫ్ హైవే టైర్ల తయారీ పరిశ్రమ వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైంది. వ్యవసాయం, మైనింగ్, అటవీ, పోర్టు, నిర్మాణ రంగానికి చెందిన భారీ యంత్ర పరికరాలకు వినియోగించే పెద్ద పెద్ద టైర్లు ఇక్కడ తయారవుతాయి.
పూర్తిగా ఎగుమతుల కోసం ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో ఉత్పత్తి అయ్యే టైర్లను 6 ఖండాలకు చెందిన 120కి పైగా దేశాలకు అందిస్తారు. అత్యధికంగా అమెరికా, యూరోప్ దేశాలకు ఎగుమతి కానున్నాయి. రికార్డు సమయంలో పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తికి సిద్ధమైన ఈ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి త్వరలోనే లాంఛనంగా ప్రారంభించనున్నారు. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూపునకు అమెరికా, జపాన్, ఇండియాల్లో ఏడు యూనిట్లు ఉన్నాయి. ఇండియాలో ఇప్పటికే తిరువన్‌వేలి, దహేజ్‌లలో రెండు యూనిట్లు ఉన్నాయి. మూడవ యూనిట్‌ను విశాఖ వద్దఏర్పాటు చేసింది.
రూ.2,352 కోట్ల పెట్టుబడి
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.2,352 కోట్ల (294 మిలియన్ డాలర్లు) పెట్టుబడితో విశాఖలో యూనిట్ ఏర్పాటుకు యకహోమా గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 2019 నవంబర్ లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసింది. కంపెనీ ప్రతిపాదినకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏర్పాటైన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు 2020 నవంబర్‌లో ఆమోదం తెలిపింది. వెంటనే ఏపీఐఐసీ భూమి కేటాయించడం, నిర్మాణం ప్రారంభం చకచకా జరిగిపోయాయి.
2021 ఫిబ్రవరిలో పనులు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. కరోనా సంక్షోభం సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడంతో రికార్డు సమయంలో తొలి దశ పనులు పూర్తి చేసినట్లు ఏటీసీ ప్రతినిధులు తెలిపారు. జూలై నెలలో ఏటీసీ తన తొలి టైరును ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం ఉత్పత్తి పరిశీలన దశలో ఉంది. త్వరలో వాణిజ్యపరంగా ఉత్పత్తికి సిద్ధమవుతోంది. తొలి దశ కింద ఇప్పటివరకు రూ.1,320 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం ఈ యూనిట్ పూర్తిస్థాయి సామర్థ్యం రోజుకు 132 టన్నుల రబ్బరు వినియోగం కాగా, తొలి దశలో రోజుకు 69 టన్నుల రబ్బరును వినియోగించనున్నారు.
స్థానికులకే పెద్ద పీట
తక్కువ మానవ వనరులతో అధిక శాతం రోబోటిక్ విధానంలో నడిచేలా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ముడి సరుకు వచ్చినప్పటి నుంచి టైరు తయారయ్యి నేరుగా గొడౌన్‌లోకి వెళ్లే విధంగా లైన్స్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ పూర్తిస్థాయి సామర్థ్యం అందుబాటులోకి వస్తే 2,000 మందికి ఉపాధి లభిస్తుంది ఇందులో 75 శాతం స్థానికులే ఉంటారు. ఇందుకోసం స్థానిక ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే 400 మందికిపైగా పనిచేస్తుండగా, విస్తరణకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను పెంచుతారు.
ప్రభుత్వ మద్దతుతో..
ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు పూర్తిస్థాయిలో సహకారం అందించాయి. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్, ఏపీఐఐసీ, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధుల వరకు పూర్తిగా సహకరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం వారు చూపించిన తపనతో నిర్దేశించుకున్న లక్ష్యంలోనే ప్రాజెక్టును పూర్తి చేయగలిగాం.
– అనిల్ గుప్తా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఏటీసీ టైర్స్
యకహోమా ఉద్యోగి కావడం ఆనందంగా ఉంది
జపాన్‌కు చెందిన యకహోమా టైర్ల తయారీ యూనిట్‌లో ఉద్యోగిగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. క్యాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగం పొందాను. యకహోమా కుటుంబ సభ్యుడిగా సొంత రాష్ట్రాభివృద్ధికి కృసి చేస్తాను.
లాబాల పవన్ కళ్యాణ్, టైర్ బిల్డింగ్–ప్రొడక్షన్, ఏటీసీ టైర్స్
సొంతూరులో ఉద్యోగం వచ్చింది
నాది అచ్యుతాపురం. యకహామాకు చెందిన ఏటీసీ టైర్స్‌లో ఉద్యోగం వచ్చింది. సొంతూరిలోనే ఉద్యోగం లభించడం చాలా ఆనందంగా ఉంది. ఇదే పట్టుదలతో మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటాను. ఇక్కడ పని వాతావరణం చాలా బాగుంది. పర్యావరణ పరిరక్షణ, భద్రతకు పెద్ద పీట వేస్తున్నారు.
రజనా శ్యామల, టైర్ బిల్డింగ్–ప్రొడక్షన్, ఏటీసీ టైర్స్
Comments
Please login to add a commentAdd a comment