ప్రమాదం నుంచి పరిహారం దాకా సర్కారు తీవ్ర అలసత్వం
బాధిత కుటుంబాలకు కనీస సమాచారం ఇవ్వలేని అసమర్థత
మీడియాలో చూసి తమవారి కోసం తల్లడిల్లిన దైన్యం
హెల్ప్‌లైన్ లేదు.. కంట్రోల్ రూం ఊసే పట్టదు
క్షతగాత్రులను తరలించేందుకు అంబులెన్సులు కరువు
కాలిన శరీరాలతో కంపెనీ బస్సుల్లోనే తరలింపు
అటువైపు కనీసం కన్నెత్తి చూడని అధికారపార్టీ నేతలు
రాత్రంతా వర్షంలోనే బాధిత కుటుంబాల పడిగాపులు
పరిహారంపై స్పష్టమైన హామీ లేక సాయంత్రం వరకు నిలిచిన పోస్టుమార్టం
కూటమి సర్కారు కొలువుదీరాక పరిశ్రమల్లో తనిఖీలు బంద్
కాసుల కోసం కంపెనీల వద్ద సాగిలపడ్డ కూటమి నేతలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలోని అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రియాక్టర్ పేలిపోయిన ఘటనలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అడుగడుగునా తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరిచింది. దుర్ఘటన తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాధితులను హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం తరలించకపోవడం... వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం... శాఖల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేయకపోవడం.. ఇలా ప్రతి విషయంలోనూ అలసత్వం ప్రదర్శించింది.
ఏదైనా దుర్ఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకున్న సమయాల్లో బాధిత కుటుంబాలకు సమాచారం అందించి భరోసా కల్పించేందుకు హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చి సహాయక చర్యలు, ఇతర ముఖ్య సమాచారాన్ని అందిపుచ్చుకునే వ్యవస్థను తేవడం పరిపాటి. అయితే తాజా ఘటనలో అలాంటి చర్యలేవీ లేకపోగా కూటమి సర్కారు స్పందించిన తీరు విస్మయం కలిగిస్తోంది.
ఇలాంటి విషాద సమయాల్లో ప్రజాప్రతినిధులు తక్షణం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తోడుగా నిలవడం కనీస బాధ్యత. అయితే అధికార పార్టీ నేతలెవరూ అటువైపు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. సీఎం చంద్రబాబుతోపాటు పర్యటనలో పాల్గొనడం, ఆయనతో పాటే కేజీహెచ్‌కు చేరుకుని తూతూమంత్రంగా కలవడం మినహా అధికార పార్టీ నేతలెవరూ బాధిత కుటుంబాలకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఘటన జరగగా మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూటమి పార్టీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ, మంత్రి గానీ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వారి తీరుకు నిదర్శనం.
తనిఖీలకు తిలోదకాలు..
పరిశ్రమల నుంచి మామూళ్ల వసూళ్లకు అలవాటుపడ్డ కూటమి నేతలు అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అన్ని విభాగాల అధికారులు కలసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఆడిట్ రిపోర్టు సమర్పించేవారు.
ఈమేరకు ప్రత్యేకంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇందుకు అనుగుణంగా ఆయా కంపెనీలు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తనిఖీలకు తిలోదకాలు ఇవ్వడంతో పరిశ్రమల్లో నిర్లక్ష్యం పొడచూపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎసైన్షియా కంపెనీ ముందు మృతులు, క్షతగాత్రుల కుటుంబసభ్యుల పడిగాపులు
‘20 పాయింట్ ఫార్ములా’ విస్మరించడంతో..
విశాఖలో 2020లో ఎల్జీ పాలీమర్స్ ప్రమాద ఘటన తరువాత నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిశ్రమల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించేందుకు ‘20 పాయింట్ ఫార్ములా’ అమలులోకి తెచ్చింది. 20 పాయింట్లకు గాను 16 కన్నా తక్కువ వస్తే ఆ సంస్థ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పరిగణించారు. కనీసం పది పాయింట్లు కూడా రాకపోతే సంస్థ కార్యకలాపాలను నిలిపి వేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి 20 పాయింట్ ఫార్ములా అమలుపై పర్యవేక్షణ కొరవడటంతోపాటు తనిఖీలు నిర్వహించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అంచనాలకు అందని అసమర్థత
విశాఖ ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాద తీవ్రతను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు స్పష్టమవుతోంది. రెడ్ కేటగిరీలో ఉన్న రసాయన పరిశ్రమల్లో ప్రమాదం జరిగితే తక్షణమే స్పందించాల్సి ఉండగా, రెండు గంటల తర్వాత కానీ కలెక్టర్, ఎస్పీ అందుబాటులోకి రాలేదనే విమర్శలున్నాయి. మృతుల విషయంలో తొలుత ఇద్దరు ముగ్గురేనని చెబుతూ వచ్చిన అధికారులు రాత్రి 8 గంటల సమయంలో 14 అని తేల్చారు.
చివరకు 17 మంది మరణించినట్లు ప్రకటించారు. ఇది అతి పెద్ద ప్రమాదమనే విషయాన్ని పసిగట్టడంలో యంత్రాంగం విఫలమైంది. దీంతో అంబులెన్సులు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోలేదు. కాలిన శరీరాలతో కంపెనీ బస్సుల్లోనే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాల్సి వచ్చింది.
ఆందోళనకు దిగితేగానీ ఆలకించలేదు..
తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే విషయం స్పష్టంగా తెలుస్తున్నా తొలుత అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. బాధితులను వెంటనే విశాఖకు తరలించాలని వారి కుటుంబ సభ్యులు, బంధువులు వేడుకున్నా పట్టించుకోలేదు. చివరకు సహనం నశించిన బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగితేగానీ రాత్రికి విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించలేదు. రాత్రంతా వర్షంలోనే బాధిత కుటుంబాలు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.
పట్టించుకునే దిక్కులేక..
విపత్తులు, దుర్ఘటనల సమయాల్లో వివిధ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలి. తాజా ఘటనలో మాత్రం అది ఎక్కడా కానరాలేదు. మృతదేహాలు తరలించిన అంబులెన్సులు పోస్టుమార్టం పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని కేజీహెచ్ సిబ్బంది సూచించగా మిగిలిన భౌతిక కాయాలను తెచ్చేందుకు తాము వెళ్లాలని అంబులెన్స్ డ్రైవర్లు నిస్సహాయత వ్యక్తం చేశారు. సమన్వయం కొరవడటంతో మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చేవారు లేకుండా పోయారు.
దీంతో న్యూస్ ఛానళ్లు, సోషల్ మీడియాలో వార్తలను చూస్తూ బాధిత కుటుంబాలు తల్లడిల్లాయి. బాధితుల బంధువులను మానవత్వంతో ఓదార్చేందుకు ఏ ఒక్క అధికారీ అందుబాటులో లేకుండా పోయారు. రాత్రి నుంచి ఆసుపత్రి వద్ద పడిగాపులు కాసిన వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇక ప్రమాదం ఎలా సంభవించిందనే సమాచారాన్ని ప్రభుత్వం ప్రకటించలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తోంది.
గంటలో పరిహారం ఇస్తామని చెప్పి..
మృతుల కుటుంబ సభ్యులకు గంటలో రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామంటూ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. అయితే, ఆయన వెళ్లిపోగానే అధికారులు మాట మార్చేశారు. మృతదేహాలను తరలించి దహన సంస్కారాలు నిర్వహించాలని, దారి ఖర్చులకు ముందుగా రూ.10 వేలు ఇస్తామనడంతో బాధిత కుటుంబాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
తమకు నిర్దిష్ట హామీ లభించే వరకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు అంగీకరించబోమని తేల్చిచెప్పారు. దీంతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు కేజీహెచ్ వద్ద విశాఖ కలెక్టర్ ప్రకటించారు. అయితే, ప్రమాదం జరిగిన ప్రదేశం అనకాపల్లి జిల్లాలో ఉండగా విశాఖ కలెక్టర్ మాట ఎలా విశ్వసించాలని బాధిత కుటుంబాలు ప్రశ్నించాయి.
అనంతరం అనకాపల్లి జేసీ జోక్యం చేసుకుని పరిహారానికి రెండు, మూడు, రోజులు పడుతుందని చెప్పారు. తమకు ప్రభుత్వంపై నమ్మకంలేదని బాధితులు తేల్చిచెప్పారు. ఆ తర్వాత కేజీహెచ్‌కు మ.1.45 గంటల ప్రాంతంలో సీఎం వచ్చి మరో గంటలో పరిహారాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు.
కానీ, సా.5 గంటల వరకు ఆ ప్రస్తావనే లేకపోవడంతో బాధితులు మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో అప్పటికప్పుడు రూ.కోటి పరిహారం ఇస్తున్నట్లు ప్రొసీడింగ్స్ కాపీని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. రాత్రి 7 గంటలకు శవ పంచనామాలు పూర్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment