reactor blast
-
పరవాడ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం.. ముగ్గురికి గాయాలు
సాక్షి,అనకాపల్లి : అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. మెట్రో కమ్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిని గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తెచ్చారు. -
అచ్యుతాపురం ఘటన రోజే మరో ఘటన.. ముగ్గురు మృతి, స్పందించని ప్రభుత్వం
-
నిలువెల్లా నిర్లక్ష్యం.. అచ్యుతాపురం ఘటనలో సర్కారు అలసత్వం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలోని అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రియాక్టర్ పేలిపోయిన ఘటనలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అడుగడుగునా తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరిచింది. దుర్ఘటన తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాధితులను హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం తరలించకపోవడం... వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం... శాఖల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేయకపోవడం.. ఇలా ప్రతి విషయంలోనూ అలసత్వం ప్రదర్శించింది. ఏదైనా దుర్ఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకున్న సమయాల్లో బాధిత కుటుంబాలకు సమాచారం అందించి భరోసా కల్పించేందుకు హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చి సహాయక చర్యలు, ఇతర ముఖ్య సమాచారాన్ని అందిపుచ్చుకునే వ్యవస్థను తేవడం పరిపాటి. అయితే తాజా ఘటనలో అలాంటి చర్యలేవీ లేకపోగా కూటమి సర్కారు స్పందించిన తీరు విస్మయం కలిగిస్తోంది. ఇలాంటి విషాద సమయాల్లో ప్రజాప్రతినిధులు తక్షణం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తోడుగా నిలవడం కనీస బాధ్యత. అయితే అధికార పార్టీ నేతలెవరూ అటువైపు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. సీఎం చంద్రబాబుతోపాటు పర్యటనలో పాల్గొనడం, ఆయనతో పాటే కేజీహెచ్‌కు చేరుకుని తూతూమంత్రంగా కలవడం మినహా అధికార పార్టీ నేతలెవరూ బాధిత కుటుంబాలకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఘటన జరగగా మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూటమి పార్టీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ, మంత్రి గానీ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వారి తీరుకు నిదర్శనం.తనిఖీలకు తిలోదకాలు..పరిశ్రమల నుంచి మామూళ్ల వసూళ్లకు అలవాటుపడ్డ కూటమి నేతలు అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అన్ని విభాగాల అధికారులు కలసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఆడిట్ రిపోర్టు సమర్పించేవారు. ఈమేరకు ప్రత్యేకంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇందుకు అనుగుణంగా ఆయా కంపెనీలు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తనిఖీలకు తిలోదకాలు ఇవ్వడంతో పరిశ్రమల్లో నిర్లక్ష్యం పొడచూపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎసైన్షియా కంపెనీ ముందు మృతులు, క్షతగాత్రుల కుటుంబసభ్యుల పడిగాపులు ‘20 పాయింట్ ఫార్ములా’ విస్మరించడంతో..విశాఖలో 2020లో ఎల్జీ పాలీమర్స్ ప్రమాద ఘటన తరువాత నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిశ్రమల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించేందుకు ‘20 పాయింట్ ఫార్ములా’ అమలులోకి తెచ్చింది. 20 పాయింట్లకు గాను 16 కన్నా తక్కువ వస్తే ఆ సంస్థ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పరిగణించారు. కనీసం పది పాయింట్లు కూడా రాకపోతే సంస్థ కార్యకలాపాలను నిలిపి వేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి 20 పాయింట్ ఫార్ములా అమలుపై పర్యవేక్షణ కొరవడటంతోపాటు తనిఖీలు నిర్వహించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అంచనాలకు అందని అసమర్థతవిశాఖ ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాద తీవ్రతను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు స్పష్టమవుతోంది. రెడ్ కేటగిరీలో ఉన్న రసాయన పరిశ్రమల్లో ప్రమాదం జరిగితే తక్షణమే స్పందించాల్సి ఉండగా, రెండు గంటల తర్వాత కానీ కలెక్టర్, ఎస్పీ అందుబాటులోకి రాలేదనే విమర్శలున్నాయి. మృతుల విషయంలో తొలుత ఇద్దరు ముగ్గురేనని చెబుతూ వచ్చిన అధికారులు రాత్రి 8 గంటల సమయంలో 14 అని తేల్చారు. చివరకు 17 మంది మరణించినట్లు ప్రకటించారు. ఇది అతి పెద్ద ప్రమాదమనే విషయాన్ని పసిగట్టడంలో యంత్రాంగం విఫలమైంది. దీంతో అంబులెన్సులు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోలేదు. కాలిన శరీరాలతో కంపెనీ బస్సుల్లోనే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాల్సి వచ్చింది. ఆందోళనకు దిగితేగానీ ఆలకించలేదు..తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే విషయం స్పష్టంగా తెలుస్తున్నా తొలుత అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. బాధితులను వెంటనే విశాఖకు తరలించాలని వారి కుటుంబ సభ్యులు, బంధువులు వేడుకున్నా పట్టించుకోలేదు. చివరకు సహనం నశించిన బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగితేగానీ రాత్రికి విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించలేదు. రాత్రంతా వర్షంలోనే బాధిత కుటుంబాలు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. పట్టించుకునే దిక్కులేక..విపత్తులు, దుర్ఘటనల సమయాల్లో వివిధ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలి. తాజా ఘటనలో మాత్రం అది ఎక్కడా కానరాలేదు. మృతదేహాలు తరలించిన అంబులెన్సులు పోస్టుమార్టం పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని కేజీహెచ్ సిబ్బంది సూచించగా మిగిలిన భౌతిక కాయాలను తెచ్చేందుకు తాము వెళ్లాలని అంబులెన్స్ డ్రైవర్లు నిస్సహాయత వ్యక్తం చేశారు. సమన్వయం కొరవడటంతో మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చేవారు లేకుండా పోయారు. దీంతో న్యూస్ ఛానళ్లు, సోషల్ మీడియాలో వార్తలను చూస్తూ బాధిత కుటుంబాలు తల్లడిల్లాయి. బాధితుల బంధువులను మానవత్వంతో ఓదార్చేందుకు ఏ ఒక్క అధికారీ అందుబాటులో లేకుండా పోయారు. రాత్రి నుంచి ఆసుపత్రి వద్ద పడిగాపులు కాసిన వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇక ప్రమాదం ఎలా సంభవించిందనే సమాచారాన్ని ప్రభుత్వం ప్రకటించలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తోంది.గంటలో పరిహారం ఇస్తామని చెప్పి..మృతుల కుటుంబ సభ్యులకు గంటలో రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామంటూ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. అయితే, ఆయన వెళ్లిపోగానే అధికారులు మాట మార్చేశారు. మృతదేహాలను తరలించి దహన సంస్కారాలు నిర్వహించాలని, దారి ఖర్చులకు ముందుగా రూ.10 వేలు ఇస్తామనడంతో బాధిత కుటుంబాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమకు నిర్దిష్ట హామీ లభించే వరకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు అంగీకరించబోమని తేల్చిచెప్పారు. దీంతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు కేజీహెచ్ వద్ద విశాఖ కలెక్టర్ ప్రకటించారు. అయితే, ప్రమాదం జరిగిన ప్రదేశం అనకాపల్లి జిల్లాలో ఉండగా విశాఖ కలెక్టర్ మాట ఎలా విశ్వసించాలని బాధిత కుటుంబాలు ప్రశ్నించాయి. అనంతరం అనకాపల్లి జేసీ జోక్యం చేసుకుని పరిహారానికి రెండు, మూడు, రోజులు పడుతుందని చెప్పారు. తమకు ప్రభుత్వంపై నమ్మకంలేదని బాధితులు తేల్చిచెప్పారు. ఆ తర్వాత కేజీహెచ్‌కు మ.1.45 గంటల ప్రాంతంలో సీఎం వచ్చి మరో గంటలో పరిహారాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. కానీ, సా.5 గంటల వరకు ఆ ప్రస్తావనే లేకపోవడంతో బాధితులు మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో అప్పటికప్పుడు రూ.కోటి పరిహారం ఇస్తున్నట్లు ప్రొసీడింగ్స్ కాపీని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. రాత్రి 7 గంటలకు శవ పంచనామాలు పూర్తిచేశారు. -
రేపు ‘అచ్యుతాపురం సెజ్' బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి,అనకాపల్లి : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ బాధితులను రేపు (శుక్రవారం) వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నారు.బుధవారం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రేపు ఉదయం 11 గంటలకు పరామర్శించి, వారి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం తిరుగు పయనమవుతారువైఎస్ జగన్ దిగ్భ్రాంతి అంతకు ముందు అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలుడు ప్రమాదంపై స్థానిక నాయకులతో వైఎస్ జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని ఇప్పటికే వారిని ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని,సానుభూతిని తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 21, 2024 -
కాటేసిన కార్ఖానా
కుప్పకూలిన శిథిలాల్లో నలిగిన ప్రాణాలు... ఎగసిపడుతున్న మంటలు...పొగచూరిన పరిసరాలు శ్వాస ఆడక.. మాట రాక.. పగిలిన గుండెలు రసాయన మంటల్లో మసైపోయిన బతుకులు... తునాతునకలైన దేహాలు... రక్తాన్ని చెమటగా మార్చే కష్టజీవులు.. యంత్రాలకు చెట్లకు వేలాడే నెత్తుటి ముద్దలై... అక్కడంతా బీభత్సం...మాటలకందని విషాదం.. ఎవరిది కాలో...ఎవరిది చేయో...తెలియని హృదయ విదారక స్థితిలో.. ముక్కలైన దేహాలను మూటకట్టి విసిరేసిన దుర్మార్గం.. తమ వాళ్లకేమైందో...జాడ తెలియక...బతికున్నారో లేదో అంటూ లబలబలాడిన గుండెలతో పరిశ్రమ గేటు వద్దకు పరుగులు తీసిన వారికి సమాధానం చెప్పే నాథుడు లేక... అంతులేని నిర్లక్ష్యానికి, అనంత శోకానికి నిదర్శనంగా.. సెజ్‌లోని ఎసైన్షియా పరిశ్రమలో బుధవారం జరిగిన ప్రమాదం పెను విషాదం నింపింది. జిల్లాలో ప్రకంపనలు రేపింది..విశాఖ సిటీ/అచ్యుతాపురం/రాంబిల్లి (యలమంచిలి)/అనకాపల్లి/తుమ్మపాల: బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలు.. కొంత మంది భోజనానికి వెళ్లారు. మరికొంత మంది వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఒక్కసారిగా అణుబాంబు పేలినట్టు భారీ విస్ఫోటనం.. భూమి కంపించింది.. అచ్యుతాపురం సెజ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. 500 కిలోల సామర్ధ్యం గల రియాక్టర్ పేలడంతో ఆ ధాటికి ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భవనం కుప్పికూలిపోయింది. దాని నుంచి దట్టమైన పొగ క్షణాల్లోనే కిలోమీటర్ వరకు వ్యాపించింది. ఏం జరిగిందో ఎవరికీ అంతుచిక్కలేదు. ఎసైన్షియా కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఆ ప్రాంతం శవాల దిబ్బగా మారింది. పేలుడు ధాటికి కారి్మకుల శరీర భాగాలు వందల మీటర్ల వరకు చెల్లాచెదురయ్యాయి. చెట్లపైకి కాళ్లు, చేతులు ఎగిరిపడ్డాయి. మూడో అంతస్తులో రియాక్టర్ పేలడంతో ఆ భవనం నేలమట్టమైంది. కింద అంతస్తులో ఉన్న కారి్మకులపై శ్లాబ్ కుప్పకూలడంతో సజీవ సమాధి అయిపోయారు. కొందరి మృతదేహాలు పూర్తిగా చికితిపోయి మాంసపు ముద్దగా మారిపోయాయి. 17మంది దుర్మరణం పాలవ్వగా 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు పాతికేళ్ల క్రితం హెచ్‌పీసీఎల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం తరువాత అతిపెద్ద పారిశ్రామిక విషాదంగా ఈ దుర్ఘటన నిలవనుంది.రక్తసిక్తంగా ఘటనా స్థలం కొంత ఆలస్యంగా సహాయక చర్యలు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సెజ్.. పేలుడు ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల కంపెనీల్లో పనిచేసే కారి్మకులు భయంతో పరుగులు పెట్టారు. సుమారు 15 నిమిషాల వరకు ఎసైన్షియా కంపెనీ వైపు వెళ్లడానికే భయపడిపోయారు. ఈ క్రమంలో ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది. అధికారులు రావడానికి కూడా 30 నిమిషాలకు పైగా సమయం పట్టింది. అప్పటి వరకు కనీసం ప్రమాదంలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ముందుగా స్థానిక అధికారులతో పాటు అగ్ని మాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుంది. ఒకవైపు మంటలను అదుపు చేస్తూనే.. మరోవైపు భవనంపై చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. మూడో అంతస్తులో చిక్కుకున్న కారి్మకులను క్రేన్ సాయంతో కిందకు దించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు ఎక్కువగా సమయం పట్టింది. మిన్నంటిన రోదనలు కొద్ది నిమిషాలకు అన్ని శాఖల అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. అయితే పేలుడు ధాటికి భవన శకలాలు, ఇతర సామగ్రి ఎగిరి అక్కడ పనిచేస్తున్న కారి్మకులకు బలంగా తగలడంతో అనేక మంది గాయపడ్డారు. అలాగే పేలుడు కారణంగా వెలువడిన రసాయనాలు పడి కొందరు క్షతగాత్రులయ్యారు. వీరందరినీ సహాయక బృందాలు బయటకు తీసుకువచ్చాయి. అయితే క్షతగాత్రుల రోదనలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో కారి్మకులకు గాయాలవడంతో వారిని అక్కడి నుంచి తరలించడానికి అధిక సమయం పట్టింది. దీంతో వారు ఆ గాయాల నొప్పిని భరించలేక చేసిన రోదనలు మిన్నంటాయి. అంబులెన్సులు లేకపోవడంతో.. ప్రమాదం జరిగిన గంటన్నర అయినా అంబులెన్సులు సంఘటన స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం. దీంతో క్షతగాత్రులను కంపెనీ బస్సుల్లోనే ఆస్పత్రులకు తరలించారు. ఆ తరువాత రెండు అంబులెన్సులు వచ్చినప్పటికీ.. అవి సరిపోలేక అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడి నుంచి 30, 40 కిలోమీటర్ల మేర ఆ నొప్పితోనే ప్రయాణించాల్సి వచ్చింది. మృతులు, క్షతగాత్రుల్లో ఉత్తరాంధ్రవారే ఎక్కువ ఈ ప్రమాదంలో 17 మంది కారి్మకులు మృత్యువాత పడ్డారు. వీరిలో భవనం శ్లాబ్ పడి చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నారు. శిథిలాల కింద మరో 9 మంది వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కొంతమంది మృతదేహాలు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాయి. సంఘటనా స్థలం నుంచి మృతదేహాలను బయటకు తీయడానికి సహాయ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అనేక మంది శరీర భాగాలు ఎగిరిపడడంతో వాటిని ఏరుకోవాల్సి వచ్చింది. కొన్ని ఏకంగా ఛిద్రమై మాంసపు ముద్దలా మారిపోయాయి. వాటన్నింటినీ మూటల్లో చుట్టి ఉంచారు. మృతుల్లో ఎక్కువ మంది ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారుగా తెలుస్తోంది. కేజీహెచ్‌కు మాంసపు ముద్దలుఘటనా స్థలం నుంచి 13 మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. ఇందులో మాంసపు ముద్దలే వచ్చాయి. ఎవరి కాలు, ఎవరి చేయి, ఎవరిది శరీరమో గుర్తించలేని పరిస్థితి ఉంది. శరీర భాగాలను మూటలు కట్టుకొని తీసుకువచ్చారు. హృదయ విదారకరమైన ఈ సంఘటన చూసిన వారంతా చలించిపోయారు. అంతా యువకులే...ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడినవారంతా యువకులే ఉండటం విషాదకరం. వివిధ జిల్లాల నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చారు. నైపుణ్యం లేకపోయినా దాదాపు ఫార్మా కంపెనీల్లోనే ఎక్కువగా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. ఈ కారణంగానే యువకులు ఎక్కువ శాతం మంది ఫార్మా పరిశ్రమల్లో చేరుతున్నారు. ఎసైన్షియా ఫార్మా పరిశ్రమలో దాదాపు 70 శాతం మంది 40 ఏళ్లలోపు యువతే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృత్యు ఒడికి చేరిన వారిలో ఎక్కువ మంది 40 సంవత్సరాల్లోపు ఉన్న వారే కావడంతో అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరిలో కొందరికి వివాహం కాలేదని తెలుస్తోంది. మరికొందరికి చిన్న చిన్న పిల్లలున్నట్లు బంధువులు చెబుతున్నారు. నేడు సీఎం చంద్రబాబు రాక సాక్షి, విశాఖపట్నం: ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాద బాధితులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబునాయుడు గురువారం విశాఖ రానున్నారు. ఉదయం 10.50 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్లో కోస్టల్ బ్యాటరీకి రానున్నారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో మెడికవర్ హాస్పిటల్‌కు చేరుకొని అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించనున్నారు. అనంతరం కోస్టల్ బ్యాటరీకి చేరుకొని హెలికాఫ్టర్‌లో అచ్యుతాపురం సెజ్‌కి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం హెలికాఫ్టర్‌లో ఎయిర్‌పోర్టుకు చేరుకొని మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ తిరుగు ప్రయాణం కానున్నారు. కేజీహెచ్‌కు మృతదేహాలుమహారాణిపేట(విశాఖ): ఎసైన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో మరణించిన 13 మంది ఉద్యోగుల మృతదేహాలను బుధవారం రాత్రి కేజీహెచ్‌కు మార్చురీకి తీసుకొచ్చారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్, డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు, కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్, ఏఎంసీ ప్రిన్సిపాల్ బుచ్చిరాజు, విశాఖ ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, సీతమ్మధార తహసీల్దార్ రమేష్ స్వయంగా పర్యవేక్షించారు. పలువురు క్షతగాత్రులను సెవెన్ హిల్స్, మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. కేజీహెచ్‌కు తీసుకొచ్చిన మృతదేహాలు నీలపు రామిరెడ్డి, మహంతి నారాయణరావు, మొండి నాగబాబు, చల్లపల్లి హారిక, మారిశెట్టి సతీ‹Ù, యళ్లబిల్లి చిన్నారావు, పైడి రాజశేఖర్, మోహనరావు, బొడ్డు నాగేశ్వర రామచంద్రరావు మృతదేహాలను తీసుకొచ్చారు. నాలుగు మృతదేహాల వివరాలు తెలియలేదు.మార్చురీ వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన మహారాణిపేట : తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబ సభ్యులు, వారి బంధువులు కేజీహెచ్ మార్చురీ వద్ద బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున, యాజమాన్యం తరఫున కనీస స్పందన లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పంచనామాకు సంతకాలు పెట్టేదిలేదని భీషి్మంచుకుకూర్చున్నారు. సీఎం చంద్రబాబు గురువారం విశాఖ పర్యటనలో పరిహారం ప్రకటిస్తారని సంతకాలు చేయాలని అధికారులు కోరినా వారు వినలేదు. తమకు న్యాయం చేయకుండా పంచానామా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మెట్లు ఎక్కుతుండగా ప్రమాదం రెండో షిఫ్ట్ డ్యూటీలో చేరేందుకు కంపెనీ మెట్లు ఎక్కుతున్నా. అదే సమయంలో ఢాం అని సౌండ్ వచ్చింది. బిల్డింగ్ ఊగిపోయింది. దీంతో నేను కూడా తూలి కింద పడిపోయాను. నా మీద నుంచి రాళ్లు, శ్లాబ్ పెచ్చులు వెళ్లాయి. – బి.సూరిబాబు, వై.లోవ, రాంబిల్లిచుట్టూ చెల్లాచెదురు ఏడాదిగా పనిచేస్తున్నా. నేనుండేది ఇక్కడే సెజ్ కాలనీలో. ఈ రోజు మధ్యాహ్నం డ్యూటీకి వచ్చిన అరగంటలోనే ఈ ప్రమాదం జరిగింది. భయంకరమైన సౌండ్ వచ్చింది. చుట్టూ అంతా చెల్లాచెదురైంది. నా చేతికి, ముఖంపై గాయాలయ్యాయి. భయంతో తోచిన వైపు పరుగులు తీశా. – జె.వర్ధన్, హెల్పర్ఎవరూ పట్టించుకోవట్లేదు మాది గాజువాకలోని శ్రీనగర్. బి షిఫ్ట్ విధుల్లోకి వచ్చా. ఆఫీస్‌కు వచ్చిన వెంటనే ప్రమాదం జరిగింది. చేతికి గాజు పెంకులు గుచ్చుకున్నాయి. ఆస్పత్రిలో చేర్చి గంటలు గడిచినా ఒక్క డాక్టరూ వచ్చి చూడలేదు. అడిగినా ఎవరూ పట్టించుకోవట్లేదు. – సీహెచ్ బంగారునాయుడు, కెమిస్ట్ఇక్కడ చేరి రెండు నెలలే.. ఉద్యోగం కోసం శ్రీకాకుళం నుంచి 2 నెలల క్రితం రాంబిల్లి వచ్చాను. కంపెనీలో ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్నా. మధ్యాహ్నం ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఏమీ కనిపించలేదు. అంతా పొగతో, మంటల్లో కాలిపోతోంది. నాకు ముఖం, చేతిపైన కాలిపోయింది. – కె.రాంబాబు, క్షతగాత్రుడు -
అచ్యుతాపురం సెజ్ ఘటన.. 15కి చేరిన మృతుల సంఖ్య
సాక్షి, అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ ప్రైమ్ లిమిటెడ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరింది. మధ్యాహ్నం రియాక్టర్ పేలే సమయంలో కంపెనీలో 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక గాయపడిన క్షతగాత్రుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు గాయపడ్డ క్షతగాత్రుల సంఖ్య 50 దాటింది. మరణించిన వారిలో చల్లపల్లి హారిక (24), పూడి మోహన్ (23), దుర్గా ప్రసాద్, చిన్నారావులు,రాజశేఖర్ ఉన్నారు. మిగిలిన మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల వివరాలు1. వి. సన్యాసినాయుడు (50), ప్లాంట్ ఏజీఎం2. రామిరెడ్డి, ల్యాబ్ హెడ్3. హారిక కెమిస్ట్4. పార్థసారథి(23), ప్రొడక్షన్ ఆపరేటర్5. వై. చిన్నారావు, ప్లాంట్ హెల్పర్6.పి.రాజశేఖర్ (22)7. మోహన్, ఆపరేటర్8. గణేష్, ఆపరేటర్9. హెచ్. ప్రశాంత్10. ఎం. నారాయణరావు.. మరో ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులకు అందని మెరుగైన వైద్యం👉 ఎసెన్షియా కంపెనీ ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు అందని మెరుగైన వైద్యం👉 అత్యవసర మెరుగైన వైద్యం అందించకపోతే క్షతగాత్రుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం 👉 వైద్యం అందడం లేదని అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్న క్షతగాత్రులు 👉 అటు ఇటు తిరుగుతూ అధికారులు హడావిడి చేస్తున్నారే తప్ప మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకోవడం లేదని బాధితుల ఆగ్రహం చేతులెత్తేసిన ఫైర్ ఫైటర్స్👉 పెరిగి పోతున్న మృతుల సంఖ్య 👉మృతదేహాల వెలికితీత లో చేతులెత్తిశిన ఫైర్ ఫైటర్స్👉 కైలసపురం నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు👉 గ్యాస్ కట్టర్లతో శిధిలాలను తొలగిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు👉శిధిలాల కింద పదుల సంఖ్యలో మృతదేహాలుఅధికారులు పట్టించుకోవడం లేదు👉ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్సులు రాలేదు👉కంపెనీ బస్సులోనే గాయాలతో మేమంతా ఆసుపత్రికి వచ్చాం👉ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించడం లేదు👉నా చెయ్యి చాలా నొప్పిగా ఉంది అయినా డాక్టర్లు పట్టించుకోవడం లేదు👉అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు👉క్షతగాత్రులు అందరినీ మెరుగైన చికిత్స కోసం వైజాగ్ తరలించవచ్చు కానీ ఆ ప్రక్రియ ఇక్కడ జరగడం లేదు..- నాయుడు, క్షతగాత్రుడు ఏడు అంతస్తుల ఎసెన్షియా కంపెనీలో మూడోఫ్లోర్‌లో 500 కిలో లీటర్ రియాక్టర్ పేలినట్లు అధికారులు గుర్తించారు. పేలుడు దాటికి మూడోఫ్లోర్ గోడలు ధ్వంసం అయ్యాయి. దీంతో స్లాబు కింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. శిధిలాల కింద చిక్కుకున్న కార్మికుల్ని రక్షించేందుకు పొక్లెయిన్ సహాయంతో సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. 300 మంది కార్మికులు పనిచేస్తున్న ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలడంతో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం అనకాపల్లి ఉష ప్రైమ్ ఆసుపత్రికి తరలించి, వారికి చికిత్సను అందిస్తున్నారు. వారిలో చంద్రశేఖర్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక ఘటనా స్థలానికి చేరుకుంది. 15 ఫైరింజన్లతో మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. మరో రియాక్టర్ పేలే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేయడంతో ఫైర్ ఫైటర్స్ రెస్క్యూ ఆపరేషన్‌ను మొదలు పెట్టారు. మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెనుప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. కాగా, ప్రమాదంపై సమాచారం అందుకున్న అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు తక్షణమే చికిత్స అందించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు
బూదవాడ (జగ్గయ్యపేట)/సాక్షి, అమరావతి/ తాడేపల్లి రూరల్/ : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో లైమ్‌స్టోన్ ఐరన్ రెడ్‌సాయిల్ రియాక్టర్లో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కర్మాగారంలోని మూడో ఫ్లోర్లో లైమ్‌స్టోన్ ఐరన్ రెడ్‌సాయిల్ రా మెటీరియల్ మిక్స్ చేయటానికి 1,300 డిగ్రీల ఉష్ణోగ్రతతో హీట్‌చేసే రియాక్టర్ వద్దకు ఉదయం షిఫ్టులో 16 మంది కార్మికులు విధులకు వచ్చారు. వారు విధుల్లో ఉండగా ఒక్కసారిగా రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలింది. అందులోని సిమెంట్ కార్మికులందరిపై పడింది. దీంతో వారి శరీర భాగాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరవింద్ యాదవ్, సుభం సోని, గుడ్డు కుమార్, దినేష్‌కుమార్, నాగేంద్ర, బిహార్‌కు చెందిన బి. సింగ్, పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన బొంతా శ్రీనివాసరావు, బూదవాడ గ్రామానికి చెందిన ధారావతు వెంకటేశ్వరరావు, వేముల సైదులు, గుగులోతు గోపినాయక్, గుగులోతు బాలాజీ, బాణావతు సైదా, బాణావతు స్వామి, పరిటాల అర్జునరావు, బాణావతు సైదా, అవుల వెంకటేష్ గాయపడ్డారు. వీరిలో బాణావతు స్వామి, పరిటాల అర్జునరావు, బాణావతు సైదా, అవుల వెంకటేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రి, తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆవుల వెంకటేష్ (35)కు 80 శాతం కాలిన గాయాలవడంతో మృతిచెందాడు. గాయపడిన వారిలో మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఫర్నిచర్ ధ్వంసం చేసిన గ్రామస్తులు..యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులతో పాటు క్షతగాత్రుల కుటుంబ సభ్యులు కర్మాగారం వద్ద ఆందోళన చేశారు. ప్రమాదం జరిగినా కనీస స్పందనలేదని ఆరోపించారు. సమాధానం చెప్పడానికి కర్మాగారం తర ఫున ఎవరూ లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామ స్తులు, క్షతగాత్రుల బంధువులు కర్మాగారంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సీఐ జానకీరాం, చిల్లకల్లు ఎస్ఐ సతీష్ పరిస్థితిని చక్కదిద్దారు. ఘటనా స్థలాన్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఏసీపీ కె. శ్రీనివాసరావు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు పరిశీలించారు. రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి..ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అలాగే, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. సృజన, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ కూడా పరామర్శించారు. ఇదిలా ఉంటే.. పేలుడు ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.మృతుని కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. మిగిలిన వారికి గాయాల తీవ్రతను బట్టి నష్టపరిహారాన్ని అందించాలన్నారు. అలాగే, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సీఐటీయు నేతలు కూడా బాధితులను పరామర్శించారు. యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని.. గాయపడ్డ ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం, యాజమాన్యం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది..ఇదిలా ఉంటే.. గాయాలైన ఎనిమిది మందిని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు వచ్చారు. 24 గంటలు గడిస్తే తప్ప ఎవరి పరిస్థితి ఏవిధంగా ఉందో చెప్పలేమని తెలియడంతో తమవారికి ఏమవుతుందా అని వారంతా ఆందోళన చెందుతున్నారు. అలాగే, దుర్ఘటనపై ఆదివారం మణిపాల్ ఆస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఉదయం 10.00– 10.30 మధ్య ప్రమాదం జరిగిందని.. తమకు తెలిసేసరికి రెండు గంటలు పట్టిందని, ఆ తర్వాత తాము ఫ్యాక్టరీకి వెళ్లిన రెండు గంటల తరువాతే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారని మండిపడ్డారు. ఇంతగా జాప్యంచేసి కార్మికుల ప్రాణా లంటే లెక్కలేకుండా యాజమాన్యం ప్రవర్తించిందని ఆరోపించారు. తొలుత.. గాయపడిన వారిని బయటకు తెచ్చేందుకు తామంతా ప్రయత్నించగా అక్కడ భద్రతా సిబ్బంది అనుమతించలేదని.. పైగా తమను తోసేసి చేయిచేసుకున్నారని చెప్పారు. అయినా వారిని తోసుకుంటూ వెళ్లగా గాయపడ్డ వారంతా కేకలు పెడుతున్నారని.. మొత్తం 16మందిని తీసుకుని బయటకు వచ్చామన్నారు. అలాగే, మృతుడు ఆవుల వెంకటేష్ తమ్ముడు గోవింద్ మాట్లాడుతూ.. మా అన్నయ్య బూడిదలో కూరుకుపోయాడని, పైకి లేవలేకపోయాడని చెప్పాడు. -
సంగారెడ్డి ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్.. ఏడుగురు కార్మికుల మృతి
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం.. చందాపూర్ గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎస్బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీలో పనిచేసే మేనేజర్ రవితోపాటు ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. రియాక్టర్ పేలుడుతో కార్మికులు వందల మీటర్ల దూరం ఎగిరిపడ్డారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది ఫైరింజన్లతో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దుర్ఘటన జరిగిన సమయంలో కంపెనీలో 50 మంది కార్మికులు పని చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న బాధితులు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే ఒక రియాక్టర్ నుంచి మరో రియాక్టర్‌కు మంటలు వ్యాపించాయి.దీంతో ఇంకో రియాక్టర్ పేలితే ప్రమాదం మరింత త్రీవతరం అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు పరిశ్రమ పరిసరాల నుంచి ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రుల్ని సిబ్బంది అత్యవసర చికిత్స కోసం సంగారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి ఎస్బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్ళి సహాయక చర్యలను పర్యవేక్షించల్సిందిగా ఫైర్ సర్వీసెస్ డి.జి. నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరారు. పరిశ్రమ ప్రమాదంపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందజేయాలని జిల్లా అధికారులకు సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే హరీష్ రావు సానుభూతి సంగారెడ్డి పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. -
జీడిమెట్ల ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను రవీందర్ రెడ్డి, కుమార్‌లుగా గుర్తించారు. -
హైదరాబాద్ బాలానగర్‌లో భారీ పేలుడు
-
పరిశ్రమలో పేలిన రియాక్టర్..
సాక్షి, హైదరాబాద్: బాలానగర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐడీఏ గాంధీ పారిశ్రామిక వాడలోని ఓ ఫార్మా స్యూటికల్ పరిశ్రమలో రియక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో పేలుడు ధాటికి ఫ్యాక్టరీ మొదటి అంతస్తులోని గోడలు పగిలిపోయాయి. ప్రమాదంపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు. -
పరవాడలో భారీ ప్రమాదం
సాక్షి, విశాఖ: విశాఖ జిల్లా పరవాడ మండలంలోని ఓ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కొరియ ఆర్గాన్స్ కంపెనీలో శనివారం రియాక్టర్ పేలింది. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. -
రియాక్టర్ పేలి ఐదుగురికి గాయాలు
-
రియాక్టర్ పేలి ఒకరి మృతి
హైదరాబాద్: ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఓ కార్మకుడు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఓ రియాక్టర్ పేలడంతో అప్పల నాయుడు(35) అనే కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందగా.. జగదీశ్వర్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ అంశంపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు విషయాన్ని గోప్యంగా ఉంచడానికి యత్నిస్తున్నారు. -
రియాక్టర్ పేలుడు: యువకుడు మృతి
కొమురవెల్లి: హైదరాబాద్‌లోని రెడ్డి ల్యాబ్‌లో గ్యాస్ రియాక్టర్ పేలిన ఘటనలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లికి చెందిన సార్ల మహేష్ (20) అనే యువకుడు మృతిచెందాడు. ఈ ల్యాబ్‌లో గ్యాస్ రియాక్టర్ వద్ద మహేష్, మరో ఇద్దరు సోమవారం రాత్రి పనిచేస్తున్న సమయంలో అత్యధిక వేడితో రియాక్టర్ పేలింది. దీంతో అతని ముఖం కాలిపోయి తీవ్రంగా గాయపడగా.. ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మహేష్ కుటుంబీకులు, బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలి వచ్చారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అందజేసినట్లు తెలుస్తోంది. -
పేలిన రియాక్టర్.. ఇద్దరు కార్మికుల మృతి
హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని ఓ ఫార్మా కంపెనీలో బుధవారం వేకువజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గగన్‌పహాడ్ లోని సంజీమ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
-
వేగేశ్న ఫార్మాసిటీలో పేలుడు,8మందికి గాయాలు
విశాఖ : విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరోసారి పేలుడు సంభవించింది. వేగేశ్న ఫార్మా కంపెనీలో సోమవారం ఉదయం రియాక్టర్ పేలి ఎనిమిదిమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుతో ఆ చుట్టు పక్కల ప్రాంతాలు దట్టమైన పొగ అలుముకుంది. పేలుడు ధాటికి కంపెనీలోని ఉత్పత్తి బ్లాక్‌లు ధ్వంసం అవటంతో పాటు, ప్లాస్టిక్ షెడ్లు కూలాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించటంతో కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. మరోవైపు ఫార్మా కంపెనీ సమీపంలోని గ్రామస్తులు ఏమి జరుగుతుందో అర్థం కాగా భయాందోళనలకు గురయ్యారు. కాగా గాయపడినవారిని చికిత్స నిమిత్తం గాజువాక లంకెలపాలెం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో రాఘవరాజు, రవికాంత్, సూర్య, సతీష్ తదితరులు ఉన్నారు. -
రియాక్టర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
బొమ్మలరామారం, న్యూస్‌లైన్: నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామంలోని నైట్రోజన్ కెమికల్ కంపెనీలో ఈ నెల 12న జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు కార్మికుల్లో ఇద్దరు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ప్రొడక్షన్ మేనేజర్ భీమిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు మరో ముగ్గురు కార్మికులకు గాయాలైన సంఘటన విదితమే. గాయపడిన కార్మికులను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ప్రొడక్షన్ మేనేజర్ భీమిరెడ్డి వెంకట్‌రెడ్డి(35), మల్యాల గ్రామానికి చెందిన ఊట్ల రాములు(36)లు శుక్రవారం మృత్యువాత పడ్డారు. వెంకట్‌రెడ్డిది గుంటూరు జిల్లా. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నర్సింగ్‌రావు తెలిపారు.