కాటేసిన కార్ఖానా | Reactor Blast in Atchutapuram Pharma Company | Sakshi
Sakshi News home page

కాటేసిన కార్ఖానా

Published Thu, Aug 22 2024 7:47 AM | Last Updated on Sat, Aug 24 2024 11:09 AM

Reactor Blast in Atchutapuram Pharma Company

ఎటు చూసినా మాంసపు ముద్దలే.. 

ఎసైన్షియా కంపెనీలో భారీ ప్రమాదం 

పేలుడు ధాటికి చెల్లాచెదురైన కార్మికుల శరీరాలు 

17 మంది మృతి.. శిథిలాల కింద మరో 9 మంది? 

హృదయ విదారకంగా అచ్యుతాపురం సెజ్‌లో పరిస్థితి 

సహాయక చర్యలు ఆలస్యం 

గంటన్నరైనా రాని అంబులెన్సులు 

కంపెనీ బస్సుల్లోనే క్షతగాత్రుల తరలింపు 

కేజీహెచ్‌కు మూటల్లో మృతదేహాలు  

కుప్పకూలిన శిథిలాల్లో నలిగిన ప్రాణాలు...  ఎగసిపడుతున్న మంటలు...పొగచూరిన పరిసరాలు శ్వాస ఆడక.. మాట రాక.. పగిలిన గుండెలు రసాయన మంటల్లో మసైపోయిన బతుకులు... తునాతునకలైన దేహాలు... 

రక్తాన్ని చెమటగా మార్చే కష్టజీవులు.. యంత్రాలకు చెట్లకు వేలాడే నెత్తుటి ముద్దలై... అక్కడంతా బీభత్సం...మాటలకందని విషాదం.. ఎవరిది కాలో...ఎవరిది చేయో...తెలియని హృదయ విదారక స్థితిలో..  ముక్కలైన దేహాలను మూటకట్టి విసిరేసిన దుర్మార్గం.. 

తమ వాళ్లకేమైందో...జాడ తెలియక...బతికున్నారో లేదో అంటూ లబలబలాడిన గుండెలతో పరిశ్రమ గేటు వద్దకు పరుగులు తీసిన వారికి సమాధానం చెప్పే నాథుడు లేక...   అంతులేని నిర్లక్ష్యానికి, అనంత శోకానికి నిదర్శనంగా.. సెజ్‌లోని ఎసైన్షియా పరిశ్రమలో బుధవారం జరిగిన ప్రమాదం పెను విషాదం నింపింది. జిల్లాలో ప్రకంపనలు రేపింది..

విశాఖ సిటీ/అచ్యుతాపురం/రాంబిల్లి (యలమంచిలి)/అనకాపల్లి/తుమ్మపాల: బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలు.. కొంత మంది భోజనానికి వెళ్లారు. మరికొంత మంది వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఒక్కసారిగా అణుబాంబు పేలినట్టు భారీ విస్ఫోటనం.. భూమి కంపించింది.. అచ్యుతాపురం సెజ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. 500 కిలోల సామర్ధ్యం గల రియాక్టర్‌ పేలడంతో ఆ ధాటికి ఎసైన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ భవనం కుప్పికూలిపోయింది. దాని నుంచి దట్టమైన పొగ క్షణాల్లోనే కిలోమీటర్‌ వరకు వ్యాపించింది.

 ఏం జరిగిందో ఎవరికీ అంతుచిక్కలేదు. ఎసైన్షియా కంపెనీలో రియాక్టర్‌ పేలడంతో ఆ ప్రాంతం శవాల దిబ్బగా మారింది. పేలుడు ధాటికి కారి్మకుల శరీర భాగాలు వందల మీటర్ల వరకు చెల్లాచెదురయ్యాయి. చెట్లపైకి కాళ్లు, చేతులు ఎగిరిపడ్డాయి. మూడో అంతస్తులో రియాక్టర్‌ పేలడంతో ఆ భవనం నేలమట్టమైంది. కింద అంతస్తులో ఉన్న కారి్మకులపై శ్లాబ్‌ కుప్పకూలడంతో సజీవ సమాధి అయిపోయారు. కొందరి మృతదేహాలు పూర్తిగా చికితిపోయి మాంసపు ముద్దగా మారిపోయాయి. 17మంది దుర్మరణం పాలవ్వగా 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు పాతికేళ్ల క్రితం హెచ్‌పీసీఎల్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదం తరువాత అతిపెద్ద పారిశ్రామిక విషాదంగా ఈ దుర్ఘటన నిలవనుంది.


రక్తసిక్తంగా ఘటనా స్థలం 

కొంత ఆలస్యంగా సహాయక చర్యలు 
అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సెజ్‌.. పేలుడు ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల కంపెనీల్లో పనిచేసే కారి్మకులు భయంతో పరుగులు పెట్టారు. సుమారు 15 నిమిషాల వరకు ఎసైన్షియా కంపెనీ వైపు వెళ్లడానికే భయపడిపోయారు. ఈ క్రమంలో ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది. అధికారులు రావడానికి కూడా 30 నిమిషాలకు పైగా సమయం పట్టింది. అప్పటి వరకు కనీసం ప్రమాదంలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ముందుగా స్థానిక అధికారులతో పాటు అగ్ని మాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుంది. ఒకవైపు మంటలను అదుపు చేస్తూనే.. మరోవైపు భవనంపై చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. మూడో అంతస్తులో చిక్కుకున్న కారి్మకులను క్రేన్‌ సాయంతో కిందకు దించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు ఎక్కువగా సమయం పట్టింది. 

మిన్నంటిన రోదనలు 
కొద్ది నిమిషాలకు అన్ని శాఖల అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. అయితే పేలుడు ధాటికి భవన శకలాలు, ఇతర సామగ్రి ఎగిరి అక్కడ పనిచేస్తున్న కారి్మకులకు బలంగా తగలడంతో అనేక మంది గాయపడ్డారు. అలాగే పేలుడు కారణంగా వెలువడిన రసాయనాలు పడి కొందరు క్షతగాత్రులయ్యారు. వీరందరినీ సహాయక బృందాలు బయటకు తీసుకువచ్చాయి. అయితే క్షతగాత్రుల రోదనలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో కారి్మకులకు గాయాలవడంతో వారిని అక్కడి నుంచి తరలించడానికి అధిక సమయం పట్టింది. దీంతో వారు ఆ గాయాల నొప్పిని భరించలేక చేసిన రోదనలు మిన్నంటాయి. 

అంబులెన్సులు లేకపోవడంతో.. 
ప్రమాదం జరిగిన గంటన్నర అయినా అంబులెన్సులు సంఘటన స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం. దీంతో క్షతగాత్రులను కంపెనీ బస్సుల్లోనే ఆస్పత్రులకు తరలించారు. ఆ తరువాత రెండు అంబులెన్సులు వచ్చినప్పటికీ.. అవి సరిపోలేక అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడి నుంచి 30, 40 కిలోమీటర్ల మేర ఆ నొప్పితోనే ప్రయాణించాల్సి వచ్చింది. 

మృతులు, క్షతగాత్రుల్లో ఉత్తరాంధ్రవారే ఎక్కువ 
ఈ ప్రమాదంలో 17 మంది కారి్మకులు మృత్యువాత పడ్డారు. వీరిలో భవనం శ్లాబ్‌ పడి చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నారు. శిథిలాల కింద మరో 9 మంది వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కొంతమంది మృతదేహాలు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాయి. సంఘటనా స్థలం నుంచి మృతదేహాలను బయటకు తీయడానికి సహాయ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అనేక మంది శరీర భాగాలు ఎగిరిపడడంతో వాటిని ఏరుకోవాల్సి వచ్చింది. కొన్ని ఏకంగా ఛిద్రమై మాంసపు ముద్దలా మారిపోయాయి. వాటన్నింటినీ మూటల్లో చుట్టి ఉంచారు. మృతుల్లో ఎక్కువ మంది ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారుగా తెలుస్తోంది.  

కేజీహెచ్‌కు మాంసపు ముద్దలు
ఘటనా స్థలం నుంచి 13 మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. ఇందులో మాంసపు ముద్దలే వచ్చాయి. ఎవరి కాలు, ఎవరి చేయి, ఎవరిది శరీరమో గుర్తించలేని పరిస్థితి ఉంది. శరీర భాగాలను మూటలు కట్టుకొని తీసుకువచ్చారు. హృదయ విదారకరమైన ఈ సంఘటన చూసిన వారంతా చలించిపోయారు.  

అంతా యువకులే...
ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడినవారంతా యువకులే ఉండటం విషాదకరం. వివిధ జిల్లాల నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చారు. నైపుణ్యం లేకపోయినా దాదాపు ఫార్మా కంపెనీల్లోనే ఎక్కువగా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. ఈ కారణంగానే యువకులు ఎక్కువ శాతం మంది ఫార్మా పరిశ్రమల్లో చేరుతున్నారు. ఎసైన్షియా ఫార్మా పరిశ్రమలో దాదాపు 70 శాతం మంది 40 ఏళ్లలోపు యువతే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృత్యు ఒడికి చేరిన వారిలో ఎక్కువ మంది 40 సంవత్సరాల్లోపు ఉన్న వారే కావడంతో అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరిలో కొందరికి వివాహం కాలేదని తెలుస్తోంది. మరికొందరికి చిన్న చిన్న పిల్లలున్నట్లు బంధువులు చెబుతున్నారు.  

నేడు సీఎం చంద్రబాబు రాక  
సాక్షి, విశాఖపట్నం: ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాద బాధితులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబునాయుడు గురువారం విశాఖ రానున్నారు. ఉదయం 10.50 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్‌లో కోస్టల్‌ బ్యాటరీకి రానున్నారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో మెడికవర్‌ హాస్పిటల్‌కు చేరుకొని అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించనున్నారు. అనంతరం కోస్టల్‌ బ్యాటరీకి చేరుకొని హెలికాఫ్టర్‌లో అచ్యుతాపురం సెజ్‌కి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం హెలికాఫ్టర్‌లో ఎయిర్‌పోర్టుకు చేరుకొని మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ తిరుగు ప్రయాణం కానున్నారు.  

కేజీహెచ్‌కు మృతదేహాలు
మహారాణిపేట(విశాఖ): ఎసైన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో మరణించిన 13 మంది ఉద్యోగుల మృతదేహాలను బుధవారం రాత్రి కేజీహెచ్‌కు మార్చురీకి తీసుకొచ్చారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. విశాఖ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్, డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ శివానంద్, ఏఎంసీ ప్రిన్సిపాల్‌ బుచ్చిరాజు, విశాఖ ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్, సీతమ్మధార తహసీల్దార్‌ రమేష్‌ స్వయంగా పర్యవేక్షించారు. పలువురు క్షతగాత్రులను సెవెన్‌ హిల్స్, మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు.  

కేజీహెచ్‌కు తీసుకొచ్చిన మృతదేహాలు 
నీలపు రామిరెడ్డి, మహంతి నారాయణరావు, మొండి నాగబాబు, చల్లపల్లి హారిక, మారిశెట్టి సతీ‹Ù, యళ్లబిల్లి చిన్నారావు, పైడి రాజశేఖర్, మోహనరావు, బొడ్డు నాగేశ్వర రామచంద్రరావు మృతదేహాలను తీసుకొచ్చారు. నాలుగు మృతదేహాల వివరాలు తెలియలేదు.

మార్చురీ వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన 
మహారాణిపేట : తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబ సభ్యులు, వారి బంధువులు కేజీహెచ్‌ మార్చురీ వద్ద బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున, యాజమాన్యం తరఫున కనీస స్పందన లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పంచనామాకు సంతకాలు పెట్టేదిలేదని భీషి్మంచుకుకూర్చున్నారు. సీఎం చంద్రబాబు గురువారం విశాఖ పర్యటనలో పరిహారం ప్రకటిస్తారని సంతకాలు చేయాలని అధికారులు కోరినా వారు వినలేదు. తమకు న్యాయం చేయకుండా పంచానామా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.  

మెట్లు ఎక్కుతుండగా ప్రమాదం 
రెండో షిఫ్ట్‌ డ్యూటీలో చేరేందుకు కంపెనీ మెట్లు ఎక్కుతున్నా. అదే సమయంలో ఢాం అని సౌండ్‌ వచ్చింది. బిల్డింగ్‌ ఊగిపోయింది. దీంతో నేను కూడా తూలి కింద పడిపోయాను. నా మీద నుంచి రాళ్లు, శ్లాబ్‌ పెచ్చులు వెళ్లాయి.  
– బి.సూరిబాబు, వై.లోవ, రాంబిల్లి

చుట్టూ చెల్లాచెదురు 
ఏడాదిగా పనిచేస్తున్నా. నేనుండేది ఇక్కడే సెజ్‌ కాలనీలో. ఈ రోజు మధ్యాహ్నం డ్యూటీకి వచ్చిన అరగంటలోనే ఈ ప్రమాదం జరిగింది. భయంకరమైన సౌండ్‌ వచ్చింది. చుట్టూ అంతా చెల్లాచెదురైంది. నా చేతికి, ముఖంపై గాయాలయ్యాయి. భయంతో తోచిన వైపు పరుగులు తీశా.               
– జె.వర్ధన్, హెల్పర్‌

ఎవరూ పట్టించుకోవట్లేదు 
మాది గాజువాకలోని శ్రీనగర్‌. బి షిఫ్ట్‌ విధుల్లోకి వచ్చా. ఆఫీస్‌కు వచ్చిన వెంటనే ప్రమాదం జరిగింది. చేతికి గాజు పెంకులు గుచ్చుకున్నాయి. ఆస్పత్రిలో చేర్చి గంటలు గడిచినా ఒక్క డాక్టరూ వచ్చి చూడలేదు. అడిగినా ఎవరూ పట్టించుకోవట్లేదు. 
– సీహెచ్‌ బంగారునాయుడు, కెమిస్ట్‌

ఇక్కడ చేరి రెండు నెలలే.. 
ఉద్యోగం కోసం శ్రీకాకుళం నుంచి 2 నెలల క్రితం రాంబిల్లి వచ్చాను. కంపెనీలో ప్రొడక్షన్‌ విభాగంలో పనిచేస్తున్నా. మధ్యాహ్నం ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఏమీ కనిపించలేదు. అంతా పొగతో, మంటల్లో కాలిపోతోంది. నాకు ముఖం, చేతిపైన కాలిపోయింది.    
– కె.రాంబాబు, క్షతగాత్రుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement