( ఫైల్ ఫోటో )
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం.. చందాపూర్ గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎస్‌బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీలో పనిచేసే మేనేజర్ రవితోపాటు ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. రియాక్టర్ పేలుడుతో కార్మికులు వందల మీటర్ల దూరం ఎగిరిపడ్డారు
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది ఫైరింజన్లతో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దుర్ఘటన జరిగిన సమయంలో కంపెనీలో 50 మంది కార్మికులు పని చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న బాధితులు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే ఒక రియాక్టర్ నుంచి మరో రియాక్టర్‌కు మంటలు వ్యాపించాయి.దీంతో ఇంకో రియాక్టర్ పేలితే ప్రమాదం మరింత త్రీవతరం అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు పరిశ్రమ పరిసరాల నుంచి ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రుల్ని సిబ్బంది అత్యవసర చికిత్స కోసం సంగారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ఎస్‌బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్ళి సహాయక చర్యలను పర్యవేక్షించల్సిందిగా ఫైర్ సర్వీసెస్ డి.జి. నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరారు.
పరిశ్రమ ప్రమాదంపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందజేయాలని జిల్లా అధికారులకు సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే హరీష్ రావు సానుభూతి
సంగారెడ్డి పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment