16 మంది కార్మికులకు గాయాలు
ఒకరి మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం
విజయవాడ, తాడేపల్లి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు
ప్రమాదంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి
యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన
కర్మాగారంలో ఫర్నీచర్ ధ్వంసం
బూదవాడ (జగ్గయ్యపేట)/సాక్షి, అమరావతి/ తాడేపల్లి రూరల్/ : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో లైమ్‌స్టోన్ ఐరన్ రెడ్‌సాయిల్ రియాక్టర్‌లో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కర్మాగారంలోని మూడో ఫ్లోర్‌లో లైమ్‌స్టోన్ ఐరన్ రెడ్‌సాయిల్ రా మెటీరియల్ మిక్స్ చేయటానికి 1,300 డిగ్రీల ఉష్ణోగ్రతతో హీట్‌చేసే రియాక్టర్ వద్దకు ఉదయం షిఫ్టులో 16 మంది కార్మికులు విధులకు వచ్చారు.
వారు విధుల్లో ఉండగా ఒక్కసారిగా రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలింది. అందులోని సిమెంట్ కార్మికులందరిపై పడింది. దీంతో వారి శరీర భాగాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరవింద్ యాదవ్, సుభం సోని, గుడ్డు కుమార్, దినేష్‌కుమార్, నాగేంద్ర, బిహార్‌కు చెందిన బి. సింగ్, పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన బొంతా శ్రీనివాసరావు, బూదవాడ గ్రామానికి చెందిన ధారావతు వెంకటేశ్వరరావు, వేముల సైదులు, గుగులోతు గోపినాయక్, గుగులోతు బాలాజీ, బాణావతు సైదా, బాణావతు స్వామి, పరిటాల అర్జునరావు, బాణావతు సైదా, అవుల వెంకటేష్ గాయపడ్డారు.
వీరిలో బాణావతు స్వామి, పరిటాల అర్జునరావు, బాణావతు సైదా, అవుల వెంకటేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రి, తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆవుల వెంకటేష్ (35)కు 80 శాతం కాలిన గాయాలవడంతో మృతిచెందాడు. గాయపడిన వారిలో మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.
ఫర్నిచర్ ధ్వంసం చేసిన గ్రామస్తులు..
యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులతో పాటు క్షతగాత్రుల కుటుంబ సభ్యులు కర్మాగారం వద్ద ఆందోళన చేశారు. ప్రమాదం జరిగినా కనీస స్పందనలేదని ఆరోపించారు. సమాధానం చెప్పడానికి కర్మాగారం తర ఫున ఎవరూ లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామ స్తులు, క్షతగాత్రుల బంధువులు కర్మాగారంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సీఐ జానకీరాం, చిల్లకల్లు ఎస్‌ఐ సతీష్ పరిస్థితిని చక్కదిద్దారు. ఘటనా స్థలాన్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఏసీపీ కె. శ్రీనివాసరావు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు పరిశీలించారు.
రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి..
ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అలాగే, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. సృజన, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ కూడా పరామర్శించారు. ఇదిలా ఉంటే.. పేలుడు ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
మృతుని కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. మిగిలిన వారికి గాయాల తీవ్రతను బట్టి నష్టపరిహారాన్ని అందించాలన్నారు. అలాగే, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సీఐటీయు నేతలు కూడా బాధితులను పరామర్శించారు. యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని.. గాయపడ్డ ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం, యాజమాన్యం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు.
యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది..
ఇదిలా ఉంటే.. గాయాలైన ఎనిమిది మందిని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు వచ్చారు. 24 గంటలు గడిస్తే తప్ప ఎవరి పరిస్థితి ఏవిధంగా ఉందో చెప్పలేమని తెలియడంతో తమవారికి ఏమవుతుందా అని వారంతా ఆందోళన చెందుతున్నారు. అలాగే, దుర్ఘటనపై ఆదివారం మణిపాల్ ఆస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఉదయం 10.00– 10.30 మధ్య ప్రమాదం జరిగిందని.. తమకు తెలిసేసరికి రెండు గంటలు పట్టిందని, ఆ తర్వాత తాము ఫ్యాక్టరీకి వెళ్లిన రెండు గంటల తరువాతే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారని మండిపడ్డారు.
ఇంతగా జాప్యంచేసి కార్మికుల ప్రాణా లంటే లెక్కలేకుండా యాజమాన్యం ప్రవర్తించిందని ఆరోపించారు. తొలుత.. గాయపడిన వారిని బయటకు తెచ్చేందుకు తామంతా ప్రయత్నించగా అక్కడ భద్రతా సిబ్బంది అనుమతించలేదని.. పైగా తమను తోసేసి చేయిచేసుకున్నారని చెప్పారు. అయినా వారిని తోసుకుంటూ వెళ్లగా గాయపడ్డ వారంతా కేకలు పెడుతున్నారని.. మొత్తం 16మందిని తీసుకుని బయటకు వచ్చామన్నారు. అలాగే, మృతుడు ఆవుల వెంకటేష్ తమ్ముడు గోవింద్ మాట్లాడుతూ.. మా అన్నయ్య బూడిదలో కూరుకుపోయాడని, పైకి లేవలేకపోయాడని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment