సాక్షి, గుంటూరు: అచ్యుతాపురం ఫార్మా ప్రమాదాన్ని కూడా చంద్రబాబు వైఎస్సార్‌సీపీపై వేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఘటనను చంద్రబాబు సీరియస్‌గా తీసుకోలేదని ధ్వజమెత్తారు. హోంమంత్రి, డీజీపీ అందరూ సెక్రటేరియట్‌లోనే ఉన్నారు. నాలుగు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్‌ని దూషించటమే పనిగా పెట్టుకున్నారని అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు.
‘‘కార్మిక శాఖ మంత్రి ఐదు గంటలకు మీడియా సమావేశం పెట్టి సమాచారం లేకుండా మాట్లాడారు. వ్యవస్థలన్నీ వైఎస్ జగన్‌ని నాశనం చేశారంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు, హోంమంత్రి, కార్మిక మంత్రి ఈ ప్రమాదాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అదే సెజ్‌లో ప్రమాదం జరిగి గతంలో ముగ్గురు చనిపోతే ఎందుకు సేఫ్టీ ఆడిట్ చేయలేదు?. పైగా ఆ ఆడిట్ చేస్తే పరిశ్రమలు వెళ్లిపోతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆడిట్ చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కావు, మనుషుల ప్రాణాలు పోయేవికావు’ అని అంబటి చెప్పారు.
‘‘కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగింది. కార్మికుల భద్రత పట్టించుకోని కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?. చంద్రబాబు మీద బాధితుల కుటుంబాలకు నమ్మకం లేదు. బాధిత కుటుంబాలను ఆదుకునే విషయంలో చంద్రబాబు నాన్చుడు వైఖరి అవలంబిస్తున్నారు. బాధితులను వెంటనే విశాఖపట్నం తరలించకుండా అనకాపల్లి ఎందుకు తరలించారు?. 2014 నుండి 2019 వరకు అనేక పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి అనేక మంది మరణించారు. నేరం చేసిన రోజే నేరస్తులకు చివరిరోజు కావాలంటూ చంద్రబాబు కథలు వినిపిస్తున్నారు. మరి తాడిపత్రిలో పోలీసుల సమక్షంలోనే దాడి జరుగుతుంటే ఏం చేశారు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.
‘‘పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబుదే. శవాల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకులేదు. పరిశ్రమల్లో కార్మికులను శవాలుగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తోంది. ఇది మానుకుని కార్మికులను కాపాడాలి. సూపర్ సిక్స్‌ని సూపర్ చీట్ గా మార్చారు. ఇచ్చిన హామీలు అమలు చేసిన మొనగాడు జగన్. హామీలను అమలు చేయని మోసగాడు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ గ్రామాల రూపురేఖలను మార్చాలనుకుంటే చంద్రబాబు ఊరుకోడు’’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment