అనిల్ అంబానీ (Anil Ambani) నేతృత్వంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్ (Reliance Power) తన క్యూ3 ఆదాయాలను ప్రకటించిన తర్వాత ఆ సంస్థ షేర్లు రయ్..మని ఎగిశాయి. గురువారం (ఫిబ్రవరి 6) ప్రారంభ డీల్స్‌లో రిలయన్స్ పవర్ షేర్లు (shares) 9% పైగా పెరిగాయి. 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ రిలయన్స్ గ్రూప్ సంస్థ రూ.41.95 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో అనిల్ అంబానీ కంపెనీ రూ.1136.75 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
అయితే కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయం క్యూ3లో 4.68% తగ్గి రూ.1852.84 కోట్లకు చేరింది. ఇది 2023 డిసెంబర్ త్రైమాసికంలో రూ.1943.83 కోట్లుగా ఉండేది. గడిచిన త్రైమాసికంలో లాభం చెల్లించాల్సిన పన్నుతో కలిపి రూ.49.88 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1168.70 కోట్ల నష్టం ప్రకటించింది. రిలయన్స్ పవర్ ఒక్కో షేరుకు ఆదాయం ఈ క్యూ3లో రూ.0.104గా ఉంది. ఇది గతేడాది క్యూ3లో రూ.3,298 (మైనస్)గా ఉంది.
గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.1,998.79 కోట్ల నుంచి రూ.2,159.44 కోట్లకు పెరిగింది. ఖర్చులు రూ.3,167.49 కోట్ల నుంచి రూ.2,109.56 కోట్లకు తగ్గాయి. కంపెనీ జీరో బ్యాంక్ రుణ స్థితిని సాధించిందని, అంటే ప్రైవేట్ లేదా పబ్లిక్ ఏ బ్యాంకులోనూ తమకు ఎటువంటి బకాయిలు లేవని రిలయన్స్ పవర్ తెలిపింది.
ఒక్కో రిలయన్స్ పవర్ షేర్ అంతకుముందు ముగింపు రూ.39.89తో పోలిస్తే గురువారం (ఫిబ్రవరి 6) 9.52% పెరిగి రూ.43.69కి చేరుకుంది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ.17,252 కోట్లుగా ఉంది. ఈ కంపెనీకి సంబంధించిన మొత్తం 42.76 లక్షల షేర్లు చేతులు మారాయి. బీఎస్‌ఈలో వీటిపై మొత్తం రూ.18.17 కోట్ల టర్నోవర్ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment