రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. అప్పుల భారం భారీగా తగ్గింది. గ్రూప్‌లోని రిలయన్స్ పవర్ రుణ రహిత కంపెనీగా మారింది. అలాగే మరో కంపెనీ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తన రుణాన్ని 87 శాతం తగ్గించుకుంది.
ఎల్‌ఐసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇతర రుణదాతల బకాయిలను రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ చేసింది. మొత్తం బాకీ తీర్చేందుకు ఒక్క ఎల్‌ఐసీకే రూ.600 కోట్లు చెల్లించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్, ప్రెస్ స్టేట్‌మెంట్లలో రిలయన్స్ ఇన్‌ఫ్రా తమ స్వతంత్ర బాహ్య రుణం రూ.3,831 కోట్ల నుంచి రూ.475 కోట్లకు తగ్గిందని పేర్కొంది. తత్ఫలితంగా కంపెనీ నికర విలువ రూ. 9,041 కోట్ల వద్ద నిలిచింది.
ఈ వార్తలు వచ్చిన తర్వాత రిలయన్స్ ఇన్‌ఫ్రా షేరు ధర బుధవారం 20 శాతం పెరిగింది. రూ.47.12 పెంపుతో రూ.282.73 వద్ద ముగిసింది. సెప్టెంబర్ 18 నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.11189 కోట్లకు చేరుకుంది. ఇక ఎడెల్‌వీస్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ రూ. 385 కోట్లతో జారీ చేసిన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్‌లకు సంబంధించి ఆ కంపెనీతో వన్-టైమ్ సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు రిలయన్స్ ఇన్‌ఫ్రా తెలిపింది. ఈ సెటిల్‌మెంట్ సెప్టెంబర్ 30లోపు పూర్తికానున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం.. అన్నతో సవాలుకు సిద్ధం!
అలాగే ఎడిల్‌వీస్‌కు చెల్లించాల్సిన మరో రూ.235 కోట్ల అప్పును కూడా రిలయన్స్ ఇన్‌ఫ్రా సెటిల్ చేసుకుంది. ఇందులో భాగంగా అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని తర్వాత రెండు కంపెనీలు పరస్పర మధ్యవర్తిత్వ దావాలను ఉపసంహరించుకోవడానికి అంగీకరించాయి.
Comments
Please login to add a commentAdd a comment