Reliance Power
-
అనిల్ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ!
ఆర్థిక కష్టాలు తొలగిపోతున్నాయి.. అప్పులన్నీ దాదాపుగా తీరిపోయాయి.. నష్టాలు పోయి లాభాలు కూడా పలకరించాయి. ఇక అంతా ఆనందమే అనుకుంటున్న సమయంలో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ తగిలింది.నకిలీ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించారంటూ రిలయన్స్ పవర్‌కి, దాని అనుబంధ సంస్థకు భారత క్లీన్ ఎనర్జీ ఏజెన్సీ ఎస్ఈసీఐ షోకాజ్ నోటీసు పంపింది. సంస్థలపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ సంజాయిషి కోరింది.రిలయన్స్ పవర్‌కు చెందిన ఒక యూనిట్ విదేశీ బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించిన నకిలీ ఎండార్స్‌మెంట్‌ను సమర్పించిందనే ఆరోపణలపై రిలయన్స్ పవర్‌ను, దాని యూనిట్‌ను మూడేళ్లపాటు వేలంలో పాల్గొనకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI) గత వారం నిషేధించింది.రిలయన్స్ పవర్‌కు అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ ఎన్యూ బీఈఎస్ఎస్ సమర్పించిన బ్యాంక్ గ్యారెంటీ కూడా నకిలీదని ఎస్ఈసీఐ తన నవంబర్ 13 నాటి నోటీసులో పేర్కొంది. ఈ చర్య తర్వాత, గురువారం బీఎస్ఈలో రిలయన్స్ పవర్ షేర్లు 1.53 శాతం పడిపోయి రూ.36 వద్ద స్థిరపడ్డాయి.కాగా ఆరోపణలపై రిలయన్స్ పవర్ స్పందిస్తూ.. "మోసం, ఫోర్జరీ, కుట్రలో బాధితులం" అని పేర్కొంది. “దీనికి సంబంధించి ఇప్పటికే థర్డ్ పార్టీపై అక్టోబర్ 16న ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్‌లో క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశాం. దాని ఆధారంగా నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదైంది. విషయం దర్యాప్తు పరిధిలో ఉంది. న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది” అని రిలయన్స్ పవర్ తెలిపింది. -
అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్ళ నిషేధం
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అనిల్ అంబానీకి మళ్ళీ గట్టి ఎదురుదెబ్బ తెగిలింది. రిలయన్స్ పవర్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలపై మూడేళ్లపాటు టెండర్లలో బిడ్డింగ్ చేయకుండా 'సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (SECI) నిషేధం విధించింది. నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించినట్లు తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.SECI తన టెండర్ ప్రక్రియలో భాగంగా జూన్‌లో 1 గిగావాట్ సోలార్ పవర్, 2 గిగావాట్ స్టాండలోన్ బ్యాటరీ ఎనర్జీ వంటి వాటికి బిడ్లను ఆహ్వానించింది. ఆ సమయంలో అనిల్ అంబానీకి చెందిన సంస్థలు నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేయడం మాత్రమే కాకుండా.. రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ సమర్పించిన బిడ్‌ను రద్దు చేసి నిషేదించింది.అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో SECI డిబార్మెంట్ ఒకటి. అంత కంటే ముందు ఆగస్టులో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంబానీని సెక్యూరిటీల మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధించి, రూ. 25 కోట్ల జరిమానా కూడా విధించింది. అక్టోబర్‌లో సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సెబీని పెనాల్టీ వసూలు చేయకుండా నిలిపివేసినప్పటికీ, సెక్యూరిటీల మార్కెట్ నుంచి డిబార్మెంట్ కొనసాగుతోంది.రిలయన్స్ క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ జారీ చేసిన సాధారణ ప్రయోజన రుణాలకు సంబంధించిన కేసులో కూడా సెబీ ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్ అంబానీ 2016లో పిపావావ్ షిప్‌యార్డ్‌ను కొనుగోలు చేయడంలో భారీగా పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత దానిని రిలయన్స్ నావల్ & ఇంజినీరింగ్‌గా మార్చారు. ఇది కూడా ఊహించనిరీతిలో ముందుకు వెళ్లలేకపోయింది. చివరకు దానిని విక్రయించాల్సి వచ్చింది. -
ఇక అనిల్ కంపెనీల జోరు
న్యూఢిల్లీ: ప్రసిద్ధ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ వృద్ధి బాటలో సాగనున్నాయి. ఇటీవల ఉమ్మడిగా రూ. 17,600 కోట్ల పెట్టుబడులు సమీకరించే ప్రణాళికలకు తెరతీయడంతో వృద్ధి వ్యూహాలను అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గత రెండు వారాలుగా ఇరు కంపెనీలు ఈక్విటీ షేర్ల ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించడంతోపాటు.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వర్డే పార్ట్నర్స్ నుంచి రూ. 7,100 కోట్లు అందుకునేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. ఈక్విటీ ఆధారిత దీర్ఘకాలిక ఎఫ్‌సీసీబీల జారీ ద్వారా నిధుల సమీకరణకు ప్రణాళికలు వేశాయి. పదేళ్ల ఈ విదేశీ బాండ్లకు 5 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేయనున్నాయి. వీటికి జతగా అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా రూ. 3,000 కోట్లు చొప్పున సమీకరించనున్నట్లు ఇరు కంపెనీల అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బోర్డు ఆమోదించిన పలు తీర్మానాలపై ఈ నెలాఖరుకల్లా వాటాదారుల నుంచి అనుమతులు లభించగలవని తెలియజేశాయి. వెరసి నిధుల సమీకరణ ద్వారా గ్రూప్ కంపెనీల విస్తరణకు అనుగుణమైన పెట్టుబడులను వినియోగించనున్నట్లు వివరించాయి. -
షేర్ మార్కెట్లో దూసుకెళ్తున్న అనిల్ అంబానీ
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పవర్ (ఆర్‌పవర్) షేర్ మార్కెట్లో దూసుకెళ్తోంది. ఆ కంపెనీ షేర్లు గత తొమ్మిది సెషన్లలో 55 శాతం ర్యాలీ చేశాయి. సెప్టెంబర్ 17న రూ. 31.40 ముగింపు ధర నుండి ఆర్‌పవర్ షేర్లు వరుసగా తొమ్మిది రోజులు ఎగువ సర్క్యూట్లను తాకాయి.నిధుల సమీకరణకు సంబంధించి అక్టోబర్ 3న కంపెనీ బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో కంపెనీ షేర్లకు ఊపు వచ్చింది. సెప్టెంబర్ 30న ఆర్‌పవర్ షేర్లు దాని మునుపటి ముగింపు రూ. 46.35కి వ్యతిరేకంగా ఒక్కొక్కటి రూ. 46.25 వద్ద ప్రారంభమయ్యాయి. సెషన్ ప్రారంభమైన వెంటనే ప్రాఫిట్ బుకింగ్ కారణంగా స్టాక్ దాదాపు 5 శాతం క్షీణించి రూ.44.21 కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే మధ్యాహ్న సమయంలో తిరిగి పుంజుకుంది. ఎన్ఎస్ఈలో రూ. 48.66 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి ఎన్ఎస్ఈలో 20.62 కోట్ల షేర్లు చేతులు మారగా, బీఎస్ఈఇలో దాదాపు 3.57 కోట్ల షేర్లు చేతులు మారాయి.ఊపు ఎందుకంటే..విదర్భ ఇండస్ట్రీస్ పవర్‌కు రూ. 3,872 కోట్ల గ్యారెంటీని పూర్తిగా సెటిల్ చేసినట్లు కంపెనీ ప్రకటించిన తర్వాత ఆర్‌పవర్ షేర్లలో అప్‌ట్రెండ్ వచ్చింది. ఈ సెటిల్మెంట్ ఫలితంగా రూ. 3,872.04 కోట్ల బకాయి రుణానికి సంబంధించిన అన్ని కార్పొరేట్ గ్యారెంటీలు, అండర్‌టేకింగ్‌లు, ఆబ్లిగేషన్లు పరిష్కారమయ్యాయి. సీఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్తో కూడా అన్ని వివాదాలను రిలయన్స్ పవర్ పరిష్కరించుకుంది. అంతేకాకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలన్నీ తీరిపోయినట్లు ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ముగింపు నాటికి సంస్థ ఏకీకృత నికర విలువ రూ.11,155 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ.. -
హమ్మయ్య.. అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. అప్పుల భారం భారీగా తగ్గింది. గ్రూప్‌లోని రిలయన్స్ పవర్ రుణ రహిత కంపెనీగా మారింది. అలాగే మరో కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తన రుణాన్ని 87 శాతం తగ్గించుకుంది.ఎల్ఐసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇతర రుణదాతల బకాయిలను రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ చేసింది. మొత్తం బాకీ తీర్చేందుకు ఒక్క ఎల్ఐసీకే రూ.600 కోట్లు చెల్లించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్, ప్రెస్ స్టేట్మెంట్లలో రిలయన్స్ ఇన్ఫ్రా తమ స్వతంత్ర బాహ్య రుణం రూ.3,831 కోట్ల నుంచి రూ.475 కోట్లకు తగ్గిందని పేర్కొంది. తత్ఫలితంగా కంపెనీ నికర విలువ రూ. 9,041 కోట్ల వద్ద నిలిచింది.ఈ వార్తలు వచ్చిన తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రా షేరు ధర బుధవారం 20 శాతం పెరిగింది. రూ.47.12 పెంపుతో రూ.282.73 వద్ద ముగిసింది. సెప్టెంబర్ 18 నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.11189 కోట్లకు చేరుకుంది. ఇక ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ రూ. 385 కోట్లతో జారీ చేసిన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లకు సంబంధించి ఆ కంపెనీతో వన్-టైమ్ సెటిల్మెంట్ చేసుకున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా తెలిపింది. ఈ సెటిల్మెంట్ సెప్టెంబర్ 30లోపు పూర్తికానున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం.. అన్నతో సవాలుకు సిద్ధం!అలాగే ఎడిల్వీస్కు చెల్లించాల్సిన మరో రూ.235 కోట్ల అప్పును కూడా రిలయన్స్ ఇన్ఫ్రా సెటిల్ చేసుకుంది. ఇందులో భాగంగా అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని తర్వాత రెండు కంపెనీలు పరస్పర మధ్యవర్తిత్వ దావాలను ఉపసంహరించుకోవడానికి అంగీకరించాయి. -
‘పవర్’ చూపించిన అనిల్ అంబానీ.. తొలగిన చీకట్లు!
ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చీకటి రోజులు తొలగిపోయాయి. ఒకప్పుడు అత్యంత ధనవంతుల్లొ ఒకడైన ఆయన రిలయన్స్ పవర్‌తో బలమైన పునరాగమనం చేస్తున్నారు. షేర్ మార్కెట్లో కంపెనీ మెరుగైన పనితీరు కొనసాగుతుండటంతో స్టాండలోన్ ప్రాతిపదికన రుణ రహితంగా మారింది.బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. అనిల్ అంబానీ రిలయన్స్ పవర్ సుమారు రూ .800 కోట్ల రుణాన్ని కలిగి ఉండేది. రుణాలిచ్చిన బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించేసింది. గత కొన్ని నెలలుగా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డీబీఎస్, ఐడీబీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకులతో డెట్ సెటిల్మెంట్ ఒప్పందాలు కుదుర్చుకుంది. నివేదిక ప్రకారం.. కంపెనీ ఈ బ్యాంకులకు మొత్తం రుణాన్ని తిరిగి చెల్లించింది. ఫలితంగా రిలయన్స్ పవర్ ఇప్పుడు స్టాండలోన్ ప్రాతిపదికన రుణ రహిత సంస్థగా మారింది.అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ ప్రస్తుతం 38 లక్షలకు పైగా రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యంతో రూ .4016 కోట్ల ఈక్విటీ బేస్‌ను కలిగి ఉంది. ఉత్తరప్రదేశ్ లోని 3960 మెగావాట్ల సాసన్ యూఎంపీపీ, 1200 మెగావాట్ల రోసా థర్మల్ పవర్ ప్లాంట్ తో సహా ఇది 5900 మెగావాట్ల ఆపరేటింగ్ కెపాసిటీని కలిగి ఉంది. 2008లో సుమారు రూ.260.78 వద్ద ట్రేడైన రిలయన్స్ పవర్ షేరు భారీ పతనం తర్వాత 2020 మార్చి 27న షేరు ధర రూ.1.13 వద్ద ముగిసింది.కొన్నేళ్లుగా నెమ్మదిగా కోలుకుంటున్న అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ మరోసారి ట్రేడర్ల దృష్టిని ఆకర్షించింది. రిలయన్స్ పవర్ షేరు ప్రస్తుతం రూ.26.15 పైన ట్రేడవుతోంది. ఇది త్వరలోనే రూ.36 మార్కును చేరుకోవచ్చని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
అనిల్ అంబానీకి మరో దెబ్బ.. రూ.397 కోట్లు నష్టం
నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న అనిల్ అంబానీకి మరో దెబ్బ తగిలింది. తన నేతృత్వంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్ మార్చి త్రైమాసికంలో రూ.397.66 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.321.79 కోట్ల లాభాన్ని ఆర్జించిన కంపెనీ ఇప్పుడు దానిని మించి నష్టాన్ని చవిచూసింది.ఇంధన వ్యయాలు పెరగడం వల్లే ఈ నష్టం వాటిల్లినట్లు కంపెనీ తెలిపింది. నష్టాలు ఉన్నప్పటికీ కంపెనీ మొత్తం ఆదాయం రూ.2,193.85 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది రూ.1,853.32 కోట్లతో పోలిస్తే ఇది అధికం. అయితే ఈ త్రైమాసికంలో వినియోగించిన ఇంధన వ్యయం రూ.953.67 కోట్లకు పెరిగింది. 2022-23 జనవరి-మార్చి కాలంలో ఇది రూ.823.47 కోట్లు.పూర్తి ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే రిలయన్స్ పవర్ నష్టాలు గణనీయంగా ఎగిసి రూ.470.77 కోట్ల నుంచి రూ.2,068.38 కోట్లకు పెరిగాయి. ఇక క్యూ4లో రిలయన్స్ పవర్ దాదాపు 6,000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. కాగా సెబీ నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) ద్వారా విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లు (ఎఫ్‌సీసీబీలు), సెక్యూరిటీల జారీకి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. -
ఆ రెండు కంపెనీల నుంచి అనిల్ అంబానీ ఔట్
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ తాజాగా రెండు గ్రూప్ సంస్థల నుంచి వైదొలగారు. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకు రాజీనామా చేశారు. సెబీ ఆదేశాలమేరకు అనిల్ తప్పుకున్నారు. ఏ లిస్టెడ్ కంపెనీలోనూ అనిల్ పదవులు నిర్వహించకుండా సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ డి.అంబానీ బోర్డు నుంచి వైదొలగినట్లు రిలయన్స్ పవర్ తాజాగా బీఎస్ఈకి వెల్లడించింది. రిలయన్స్ ఇన్ఫ్రా కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. కంపెనీ నుంచి నిధులను అక్రమంగా తరలించిన ఆరోపణలతో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌తోపాటు.. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, మరో ముగ్గురు వ్యక్తులను సెక్యూరిటీల మార్కెట్ నుంచి సెబీ ఈ ఫిబ్రవరిలో నిషేధించింది. అంతేకాకుండా ఈ నలుగురినీ రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీలు, లిస్టెడ్ కంపెనీలు, పబ్లిక్ నుంచి నిధులు సమీకరించే కంపెనీలు తదితరాలలో ఎలాంటి పదవులూ చేపట్టకుండా సెబీ నిషేధించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ నిషేధం అమల్లో ఉంటుందని తెలియజేసింది. -
అడాగ్ షేర్ల ర్యాలీ పట్ల అప్రమత్తంగా ఉండండి
అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని అడాగ్ షేర్లు చాలాకాలం తర్వాత చర్చనీయాంశంగా మారాయి. మార్చి కనిష్టం నుంచి అనేక రెట్లు లాభపడంతో దలాల్ స్ట్రీట్‌లో ఇప్పుడు ఈ షేర్ల గురించే మాట్లాడుకుంటున్నారు. రిలయన్స్ పవర్ షేరు మార్చి 25 నుంచి జూలై1 మధ్యకాలంలో 357శాతం లాభపడింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 349శాతం, రిలయన్స్ క్యాపిటల్ షేర్లు 243 శాతం ర్యాలీ చేశాయి. ఇదే సమయంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో సెన్సెక్స్ మాత్రమే 35శాతం పెరిగింది. ర్యాలీలో సత్తా లేదు: మార్చి కనిష్టాల నుంచి అడాగ్ షేర్లు చేసిన ర్యాలీలో సత్తాలేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అడాగ్ షేర్లు నిస్సందేహంగా ర్యాలీ చేశాయని, అయితే గడిచిన 10ఏళ్లలో ఈ షేర్ల నాశనం చేసిన 98శాతం సంపద విధ్వంసంతో తాజా ర్యాలీని సరిపోల్చడం మూర్ఖత్వం అవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అడాగ్ షేర్లపై ఇప్పటికే పలు బ్రోకరేజ్‌లు, రేటింగ్ సంస్థలు ‘‘బేరిష్’’ రేటింగ్‌ను కేటాయించాయి. మార్కెట్ ర్యాలీలో భాగంగా ఈ షేర్లలో మూమెంట్ ఉన్నప్పటికీ.., వీటికీ దూరంగా ఉండటం మంచిదని సలహానిస్తున్నాయి. ‘‘ మా ఫండమెంటల్ ప్రమాణాలను అందుకోలేకపోవడంతో అడాగ్ షేర్లపై మాకు ఎలాంటి అభిప్రాయం లేదు. అయినప్పటికీ, రిటైల్ ఇన్వెస్టర్లు అనేక పెన్నీ స్టాక్లను కొనుగోలు చేస్తున్నారని మేము నమ్ముతున్నాము. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు ఇలాంటి తప్పులు చేసిన మంచి పాఠాలు నేర్చుకుంటారు.’’ అని ఈక్వినామిక్స్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ జీ.చొక్కా లింగం అభిప్రాయపడ్డారు. ఇటీవల అడాగ్ కంపెనీల్లో జరిగిన కొన్ని కార్పోరేట్ పరిణామాలు ఇన్వెసర్లను దృష్టిని ఆకర్షించాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సంపూర్ణ రుణ రహిత కంపెనీగా మారుతుందని కంపెనీ ఛైర్మన్ అనిల్ అంబానీ పేర్కోన్నారు. ఈ కంపెనీకి సుమారు రూ.6వేల పైగా అప్పు ఉంది. ఈ రుణాన్ని తీర్చేందుకు కంపెనీ ఆస్తులను విక్రయప్రకియను మొదలుపెట్టింది. పెన్నీస్టాకులకు దూరంగా ఉండండి: తక్కువ ధరల్లో లభ్యమయ్యే పెన్నీ స్టాకులకు దూరంగా ఉండటం మంచదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అడాగ్ షేర్లు మాత్రమే కాకుండా బిర్లా టైర్స్, ఆప్టో సర్కూ్యట్స్, అలోక్ ఇండస్ట్రీస్, రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, జేఎంటీ అటో, అల్కేమిస్ట్, సింటెక్స్ ప్లాస్టిక్స్, ఆంధ్రా సిమెంట్స్, ఎమ్కోతో సుమారు 178 పెన్నీ స్టాకులు మార్చి కనిష్టం నుంచి 100శాతం నుంచి 1700శాతం ర్యాలీ చేశాయి. గత 7-8 ఏళ్లలో 1,000 కి పైగా షేర్లు స్టాక్స్ మార్కెట్ నుంచి వైదొలిగాయి. వాటిలో ఎక్కువ భాగం పెన్నీ స్టాక్స్ కావడం విశేషం. గడచిన ఆరేళ్లలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు పెన్సీ స్టాక్‌ల ద్వారా రూ.1.5 - రూ.2లక్షల కోట్లను నష్టపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్కెట్లో బలమైన లిక్విడిటీ ఉన్న కారణంగా చాలా పెన్నీ స్టాక్ పెరిగాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు ఎలాంటి ఫండమెంట్లను పట్టించుకోకుండా తక్కువ ధరలో లభ్యమయ్యే షేర్లను కొనుగోలు చేస్తున్నాయి. వారిని రాబిన్‌హుడ్ ఇన్వెసర్లు అని పిలవచ్చు. అడాగ్‌తో సహా అంలాంటి కౌంటర్లలో కొనుగోలు జరపకపోవడం మంచింది.’’ అని సామ్కో సెక్యూరిటీస్ హెడ్ ఉమేష్ మెహతా తెలిపారు. -
సెప్టెంబర్ వరకూ తనఖా షేర్ల విక్రయం ఉండదు
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు ఊరట లభించింది. ప్రమోటర్ తనఖా పెట్టిన షేర్లను ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ విక్రయించకుండా రుణదాతలతో ఒక ఒప్పందాన్ని రిలయన్స్ గ్రూప్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి రుణదాతల్లో దాదాపు 90 శాతం సంస్థలు అంగీకరించాయి. ఈ ఒప్పందంలో భాగంగా రుణదాతలకు గడువు ప్రకారమే వడ్డీ, అసలు చెల్లింపులను రిలయన్స్ గ్రూప్.. జరుపుతుంది. అంతే కాకుండా రిలయన్స్ పవర్లో రిలయన్స్గ్రూప్నకు నేరుగా ఉన్న 30 శాతం వాటాలో పాక్షిక వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లకు విక్రయించడం కోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను నియమించింది. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు త్వరలో రోడ్‌షోలను నిర్వహిస్తారు. రిలయన్స్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్న రుణదాతల్లో టెంపుల్టన్ ఎమ్ఎఫ్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా ఎమ్ఎఫ్, ఇండియాబుల్స్ ఎమ్ఎఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్‌లు ఉన్నాయి. కాగా తనఖా షేర్లు విక్రయించకుండా యథాతథ ఒప్పందం కుదిరినందుకు రుణదాతలకు రిలయన్స్ గ్రూప్ ధన్యవాదాలు తెలిపింది. తమపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞులమని రిలయన్స్ గ్రూప్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇటీవల రిలయన్స్ గ్రూప్ షేర్లు భారీగా పతనమైన విషయం తెలిసిందే. ఈ పతనం కారణంగా తనఖా పెట్టిన షేర్ల విలువ బాగా తగ్గినప్పటికీ, రుణదాతలు తనఖా షేర్లను విక్రయించబోమని తాజా ఒప్పందం ద్వారా అభయం ఇచ్చాయి. ఎడెల్వీజ్కు బకాయి రూ.150 కోట్లు తనఖా పెట్టిన షేర్లను ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఎడెల్వీజ్ సంస్థలు అన్యాయంగా కావాలని ఓపెన్ మార్కెట్లో విక్రయించాయని, ఫలితంగా తమ కంపెనీల షేర్ల విలువలు భారీగా పడిపోయాయని రిలయన్స్ గ్రూప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను ఈ ఇరు కంపెనీలు ఖండించాయి. తనఖా ఒప్పందం ప్రకారమే షేర్లను విక్రయించామని, ఎలాంటి దురుద్దేశం లేదని ఎడెల్వీజ్ పేర్కొంది. కాగా క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఎడెల్‌వీజ్‌ను తక్షణం నిషేధించాలని కూడా సెబీని రిలయన్స్ గ్రూప్ కోరింది. కాగా రిలయన్స్ గ్రూప్ ఎడెల్వీజ్ సంస్థకు రూ.150 కోట్ల రుణం చెల్లించాల్సి ఉండగా, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ రుణం పూర్తిగా తీరిపోయింది. -
మూడింతలు జంప్ చేసిన రిలయన్స్ పవర్
అనిల్ అంబానీ ప్రమోటెడ్ రిలయన్స్ పవర్ లిమిటెడ్ ఒక్కసారిగా మూడింతలు జంప్ చేసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ లాభాలు మూడింతలు పెరిగి రూ.216 కోట్లగా నమోదయ్యాయి. పన్ను వ్యయాలు 40 శాతం తగ్గడంతో కంపెనీ భారీ లాభాల్లోకి ఎగిసింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభాలు రూ.61.55 కోట్లగా ఉన్నాయి. మొత్తంగా కంపెనీ ఆదాయాలు రూ.2548.94 కోట్ల నుంచి 6 శాతం పెరిగి రూ.2696.50 కోట్లగా నమోదైనట్టు తెలిసింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ వ్యయాలు 3 శాతం పడిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 2372.12 కోట్లగా ఉన్న కంపెనీ వ్యయాలు ఈ ఏడాది రూ.2311.1 కోట్లగా రికార్డయ్యాయి. తక్కువ ఇంధనపు వ్యయం, ఫైనాన్స్ ధరలు తగ్గడంతో ఈ త్రైమాసికంలో కంపెనీ ఖర్చులు కూడా దిగొచ్చినట్టు రిలయన్స్ పవర్ పేర్కొంది. వడ్డీలు, పన్నులు, తరుగుదల, రుణ విమోచన తర్వాత కంపెనీ ఆర్జించిన రాబడులు మార్చి క్వార్టర్లో రూ.1066 కోట్లగా ఉన్నాయి. దీంతో మొత్తంగా 2016-17 ఆర్థికసంవత్సరంలో కంపెనీ నికర లాభాలు 23 శాతం పెరిగి రూ.1,104 కోట్లగా నమోదైనట్టు, ఎబీఐటీడీఏలు రూ.4506 కోట్లగా రికార్డైనట్టు రిలయన్స్ పవర్ వెల్లడించింది. -
ఆల్ట్రా పవర్ ప్రాజెక్టు ఒప్పందం రద్దు!
ముంబై: అనీల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పవర్ సంస్థ ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు (యుఎంపీపీ) నుంచి తప్పుకుంది. జార్ఖాండ్‌లో 3960 మెగావాట్ల ఆల్ట్రా పవర్ ప్రాజెక్టు కోసం అక్కడి ప్రభుత్వంతో రిలయన్స్ పవర్ ఒప్పందం కుదుర్చుకుంది. 36 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టుని హజారీబాగ్ జిల్లాలో నిర్మించతలపెట్టారు. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకొని అయిదేళ్లు పూర్తి అయినా ప్రాజెక్టుకు కావలసిన భూమిని ప్రభుత్వం సమకూర్చలేదు. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు రిలయన్స్ పవర్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. -
అదాని చేతికి ల్యాంకో ఉడిపి ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉడిపిలో నిర్మిస్తున్న 1,200 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ను అదాని గ్రూపునకు విక్రయించినట్లు ల్యాంకో ఇన్ఫ్రా ప్రకటించింది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ. 6,000 కోట్లపైనే ఉంటుందని, దీని ద్వారా ల్యాంకోకు రూ.2,000 కోట్ల నగదు లభించడమే కాకుండా రూ.4,000 కోట్లకు పైగా రుణ భారం తగ్గుతుందని కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం అదాని గ్రూపు చైర్మన్ గౌతమ్ ఆదాని హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు 2020 నాటికి 20,000 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన అనంతరం ఈ అతిపెద్ద డీల్ జరగడం విశేషం. ప్రస్తుతం అదాని గ్రూపు 8,500 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశీయ విద్యుత్ పరిశ్రమలో విలువ పరంగా ఇది రెండో అతిపెద్ద కొనుగోలు ఒప్పందంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మధ్యనే అనిల్ అంబానీకి చెందిన రిల యన్స్ పవర్ రూ.10,000 కోట్లకు జేపీ అసోసియేట్స్‌కు చెందిన విద్యుత్ ప్రాజెక్టులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఉడిపి విద్యుత్ ప్లాంట్ గురించి దిగుమతి చేసుకున్న బొగ్గుతో ఏర్పాటైన తొలి స్వతంత్ర విద్యుత్ ప్రాజెక్టుగా ఉడిపి విద్యుత్ రికార్డులకు ఎక్కింది. 1,200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును దిగుమతి చేసుకోవడానికి మంగుళూరు పోర్టులో 4 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన సొంత జెట్టీలు ఉన్నాయి. అవసరమైతే ఈ జెట్టీ సామర్థ్యాన్ని మరో 4 మిలియన్ టన్నులకు పెంచుకోవచ్చు. ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌లో 90 శాతం కర్ణాటక రాష్ట్రానికి, మిగిలిన 10 శాతం పంజాబ్ రాష్ట్రానికి విక్రయించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విద్యుత్ ప్లాంట్ సామర్థ్యాన్ని అదనంగా 1,320 మెగా వాట్లకు పెంచడానికి కర్ణాటక ప్రభుత్వంతోల్యాంకో ఈ మధ్యనే ఒప్పందం కుదుర్చుకుంది. -
హైడ్రో పవర్లో హైఓల్టేజీ డీల్స్!
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్: జేపీ గ్రూప్‌నకు చెందిన హైడ్రో పవర్ ప్రాజెక్టులను రూ. 12,300 కోట్లకు అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్ కొనుగోలు చేయడంతో స్థానిక పారిశ్రామిక వేత్తల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రూ. లక్ష కోట్ల రుణ భారంతో తల్లడిల్లుతున్న జీఎంఆర్, ల్యాంకో, జీవీకే లాంటి సంస్థలకు ఈ పరిణామాలు ఎంతో ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించ తలపెట్టిన పలు విద్యుదుత్పాదన సంస్థలు తమ వాటాల విక్రయానికి సుముఖుత చూపుతున్నాయని పవర్ ప్రాజెక్టుల కన్సల్టెంట్ పీపీ రావు తెలిపారు. తెలంగాణా, ఏపీ రాష్ట్రాలకు చెందిన కేఎస్కే ఎనర్జీ, సాయి కృష్ణోదయా , కోస్టల్ ప్రాజెక్ట్స్, జీఎంఆర్, ఎథీనా ఎనర్జీ వెంచర్స్, నవయుగ ఇంజీనీరింగ్, సోమ ఎంటర్‌ప్రెజైస్ లాంటి సంస్థలు బ్రహ్మపుత్ర నదిపై జలవిద్యుత్కేంద్రాలను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించుకున్నాయి. ప్రాజెక్టు ప్రారంభించేందుకు కావాల్సిన అన్ని అనుమతులు పొందాయి. అయితే అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రాజెక్టులు నిర్వహించేందుక అవసరమైన వనరులు సకాలంలో సమీకరించలేకపోవడంతో పలు కంపెనీలు మధ్యలో నే ఆపేశాయి. హైదరాబాద్‌కు చెందిన సర్వోమ్యాక్స్ సంస్థ అరుణాచల్ ప్రదేశ్‌లో చేపట్టిన మినీ హైడల్ పవర్ప్రాజెక్టు నిర్మాణంలో బాలారిష్టాలు దాటి పురోగతి సాధించిన స్థానిక సమస్యల కారణంగా ఇటీవలే ప్రాజెక్టు కార్యాలయాన్ని మూసేసింది. జీవీకే పవర్ సంస్థకు జమ్ము కాశ్మీర్లో రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు (850 మెగావాట్ల), ఉత్తరాఖండ్‌లో శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (330 మెగావాట్లు), బోగుడియార్ శ్రీకార్ భోల్ (146 మెగావాట్లు), మాపాంగ్ బోగుడియార్ (200 మెగావాట్ల) హౌడ్రో పవర్ ప్రాజెక్టులున్నాయి. జీఎంఆర్ సంస్థకు నేపాల్‌లో అప్పర్ కునాలి (900 మెగావాట్ల) ప్రాజెక్టు, హిమతాల్ (600 మెగావాట్ల) ప్రాజెక్టు, అరుణాచల్ ప్రదేశ్‌లో తెలాంగ్లో జీఎంఆర్ ఎనర్జీ (225 మెగావాట్లు) జలవిద్యుత్‌కు సంబంధించిన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. జీఎంఆర్ ఎనర్జీకి ఉత్తరాఖండ్లోనిఅలకనందాలో 300 మెగావాట్ల ప్రాజెక్టు కూడా ఉంది. ల్యాంకో గ్రూప్‌నకు ఉత్తరాఖండ్‌లో ఫటా బీయుంగ్ (76 మెగావాట్లు), రంబారా (76 మెగాయూనిట్లు), ల్యాంకో మందాకినీ హైడ్రో పవర్ ( 76 మెగావాట్లు), సిక్కిం రాష్ట్రంలో ల్యాంకో తీస్తా హైడ్రో పవర్ (500 మెగావాట్లు), హిమాచల్ ప్రదేశ్‌లోని బుడిల్ ప్రాజెక్టు (70 మెగావాట్లు)లు ఉన్నాయి. అరుణాచల్ ప్రాజెక్టుల ఆకర్షణ ఇదీ... జమ్ము కాశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో జలవిద్యుత్ వనరులను అభివృద్ధి చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 2008లో హైడ్రో పవర్ అభివృద్ధి విధానాన్ని ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థలతో దీటుగా ప్రైవేట్ సంస్థలకూ పలు రాయితీలను ప్రకటించారు. అందులో ప్రధానంగా కాస్ట్ ప్లస్ టారిఫ్ విధానం. దీని ప్రకారం విద్యుత్కేంద్రంపై వెచ్చించిన వ్యయాలను డెవలపర్ రాబట్టుకునేందకు వీలుగా సేలబుల్ ఎన ర్జీలో 40 శాతం మర్చంట్ విక్రయాల రాయితీని ప్రకటించారు. మరో ఆకర్షణ మెగా పవర్ ప్రాజెక్టు పాలసీ. సాధారణంగా మెగా పవర్ ప్రాజెక్టు స్థాయి పొందాలంటే కనీసం వెయ్యి మెగావాట్ల సామర్థ్యం ఉండాలి. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సామర్థ్యాన్ని 350 మెగా వాట్లకే కుదించారు. మెగాపవర్ ప్రాజెక్టులకు క్యారేజీ టారిఫ్‌లో పది శాతం పన్ను రాయితీ ఉంటుంది. జీఎంఆర్ జల విద్యుత్కేంద్రాలను గుజరాత్‌కు చెందిన అదానీ పవర్ కొనుగోలు చేయనుందన్న మార్కెట్ వర్గాల సమాచారంపై జీఎంఆర్ అధికార ప్రతినిధి స్పందిస్తూ ప్రస్తుతం తాము ఆ దిశగా ఆలోచించడం లేదన్నారు. మార్కెట్ వర్గాల అంచనాలకు అధికార వివరణ ఇవ్వలేమని సాక్షి ప్రతినిధికి తెలిపారు. అలాగే ల్యాంకో పవర్‌కు చెందిన సంస్థలను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నరశింహన్ స్పందిస్తూ ఇది పూర్తిగా నిరాధారమూ, ఊహా జనితమైన మార్కెట్ కల్పన అని అన్నారు. అయితే జేపీ-రిలయన్స్ పవర్ డీల్ నేపథ్యంలో స్థానిక కంపెనీలు కూడా వాటి విద్యుత్ ప్రాజెక్టులను విక్రయించవచ్చనే మార్కెట్ వర్గాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి. జేపీ డీల్‌ను మిస్సయిన ఆదాని గ్రూప్ వీటిలో కొన్ని హైడ్రో ప్రాజెక్టుల కొనుగోలుకు ముందుకు రావచ్చన్నది ఆ వర్గాల సమాచారం. -
రిలయన్స్ పవర్ చేతికి జేపీ గ్రూప్ జల విద్యుత్ ప్లాంట్లు
న్యూఢిల్లీ: జైప్రకాష్ అసోసియేట్స్‌కు చెందిన మూడు జల విద్యుత్ ప్రాజెక్ట్‌లను అనిల్ అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ పవర్ సొంతం చేసుకోనుంది. ఈమేరకు జేపీ గ్రూప్‌తో ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రిలయన్స్ పవర్ తెలిపింది. దీనిలో భాగంగా అనుబంధ సంస్థ రిలయన్స్ క్లీన్జెన్(ఆర్సీఎల్) ద్వారా జేపీ గ్రూప్ అనుబంధ కంపెనీ జైప్రకాష్ పవర్ వెంచర్స్(జేపీవీఎల్)తో ప్రత్యేక అవగాహన ఒప్పం దంపై సంతకాలు చేసినట్లు పేర్కొంది. తద్వారా జేపీవీఎల్‌కు చెందిన జలవిద్యుత్ పోర్ట్‌ఫోలియోలో 100% వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. సుమారు 1,800 మెగావాట్ల నిర్వహణ సామర్థ్యం (ప్రైవేటు రంగంలో దేశంలోనే అత్యధికం) కలిగిన 3 జల విద్యుత్ ప్లాంట్లను జేపీవీఎల్ కలిగి ఉంది. వీటి ఆస్తుల విలువ రూ.10,000 కోట్లుగా అంచనా. -
సంపద సృష్టిలో టీసీఎస్ టాప్
ముంబై: సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గడచిన ఐదేళ్ల కాలంలో (2008-12) అతిపెద్ద సంపద సృష్టి కంపెనీగా నిలిచింది. ఈ విషయంలో ఐటీసీని టీసీఎస్ రెండవ స్థానానికి నెట్టివేసింది. 2007-12 మధ్య కాలంలో చూస్తే... బహుళ ఉత్పత్తుల సంస్థ ఐటీసీ సంపద సృష్టిలో ముందుంది (గత ఏడాది ఆవిష్కరించిన నివేదిక ప్రకారం...). సంపద సృష్టికి సంబంధించి మోతీలాల్ ఓస్వాల్ 18వ వార్షిక అధ్యయన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఇన్వెస్టర్లు నష్టపోయిన దిగ్గజ కంపెనీల జాబితా మొదటి స్థానాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆర్‌కామ్‌లు ఉన్నాయి. ముఖ్య వివరాలు... మార్కెట్ క్యాపిటలైజేషన్ కోణంలో గత ఐదేళ్లలో సంపద సృష్టి టాప్ 10లో టీసీఎస్, ఐటీసీసహా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, విప్రోలు ఉన్నాయి. టాప్ 10 సంపద ఛిద్రం కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎంఎంటీసీ, ఎన్ఎండీసీ, డీఎల్ఎఫ్, రిలయన్స్ పవర్, బీహెచ్ఈఎల్, సెయిల్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీలు నిలిచాయి. వేగంతో పురోగమించిన కంపెనీల్లో టీటీకే ప్రిస్టేజ్ది అగ్రస్థానం. -
రిలయన్స్ పవర్‌కు చలసాని గుడ్‌బై
న్యూఢిల్లీ: విద్యుత్‌రంగ సంస్థ రిలయన్స్ పవర్ సీఈవో పదవికి జేపీ చలసాని రాజీనామా చేశారు. వ్యాపారవేత్తగా ఎదిగే ఉద్దేశంతో ఉన్న చలసాని ఈ ఏడాది ఆఖర్లో వైదొలుగుతారని, విదేశాలకు వెడతారని కంపెనీ..స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. ఆయన దాదాపు 18 సంవత్సరాల పాటు సంస్థలో కొనసాగారు. ప్రభుత్వరంగ దిగ్గజం ఎన్టీపీసీలో చలసాని (55) కెరియర్ ప్రారంభించారు. 2005 జూన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యం రెండుగా విభజన జరిగినప్పుడు ఆయన అనిల్ అంబానీ గ్రూప్‌లో చేరారు. అనిల్ అంబానీకి సన్నిహితుడైన చలసాని.. రిలయన్స్ పవర్‌కి సంబంధించి అనేక ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్నారు. 2008 మార్చ్‌లో సంస్థ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆయన సీఈవోగా ఉన్న సమయంలో కృష్ణపట్నం (ఆంధ్రప్రదేశ్), ససాన్ (మధ్యప్రదేశ్), తిలయా (జార్ఖండ్)లలో తలో రూ. 20,000 కోట్ల విలువ చేసే అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులు మూడింటిని రిలయన్స్ పవర్ దక్కించుకుంది. అలాగే, పవర్ ప్రాజెక్టులకు కావాల్సిన పరికరాల సరఫరా కోసం చైనాకి చెందిన షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్‌తో 10 బిలియన్ డాలర్ల ఒప్పందం కూడా కుదుర్చుకుంది.