
రూ. 17,600 కోట్ల సమీకరణకు రెడీ
జాబితాలో రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఆర్‌పవర్
న్యూఢిల్లీ: ప్రసిద్ధ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ వృద్ధి బాటలో సాగనున్నాయి. ఇటీవల ఉమ్మడిగా రూ. 17,600 కోట్ల పెట్టుబడులు సమీకరించే ప్రణాళికలకు తెరతీయడంతో వృద్ధి వ్యూహాలను అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గత రెండు వారాలుగా ఇరు కంపెనీలు ఈక్విటీ షేర్ల ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించడంతోపాటు.. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ వర్డే పార్ట్‌నర్స్ నుంచి రూ. 7,100 కోట్లు అందుకునేందుకు సన్నాహాలు ప్రారంభించాయి.
ఈక్విటీ ఆధారిత దీర్ఘకాలిక ఎఫ్‌సీసీబీల జారీ ద్వారా నిధుల సమీకరణకు ప్రణాళికలు వేశాయి. పదేళ్ల ఈ విదేశీ బాండ్లకు 5 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేయనున్నాయి. వీటికి జతగా అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా రూ. 3,000 కోట్లు చొప్పున సమీకరించనున్నట్లు ఇరు కంపెనీల అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బోర్డు ఆమోదించిన పలు తీర్మానాలపై ఈ నెలాఖరుకల్లా వాటాదారుల నుంచి అనుమతులు లభించగలవని తెలియజేశాయి. వెరసి నిధుల సమీకరణ ద్వారా గ్రూప్ కంపెనీల విస్తరణకు అనుగుణమైన పెట్టుబడులను వినియోగించనున్నట్లు వివరించాయి.
Comments
Please login to add a commentAdd a comment