
కన్సల్టెంట్‌గా బీవైడీ మాజీ చీఫ్ సంజయ్ నియామకం
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తాజాగా ఎలక్ట్రిక్ కార్లు (ఈవీ), బ్యాటరీల తయారీ విభాగంలోకి ప్రవేశించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళికలకు సంబంధించి వ్యయాలపరంగా సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేసేందుకు చైనా దిగ్గజం బీవైడీ ఇండియా మాజీ హెడ్ సంజయ్ గోపాలకృష్ణన్‌ను కన్సల్టెంటుగా నియమించుకున్నట్లు సమాచారం. రిలయన్స్ ఇన్‌ఫ్రా ప్రాథమికంగా ఏటా 2,50,000 ఈవీలతో మొదలుపెట్టి 7,50,000 వాహనాలకు ఉత్పత్తిని పెంచుకోవాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అలాగే 10 గిగావాట్ అవర్స్ (జీడబ్లూహెచ్) సామర్థ్యంతో బ్యాటరీల తయారీ ప్లాంటు ఏర్పాటు సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు వివరించాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం రిలయన్స్ ఇన్‌ఫ్రా జూన్‌లోనే వాహన రంగానికి సంబంధించి కొత్తగా రెండు అనుబంధ సంస్థలను ప్రారంభించింది. రిలయన్స్ ఈవీ ప్రైవేట్ లిమిటెడ్ వీటిలో ఒకటి. అధిక రుణభారం, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కంపెనీ ఈ కొత్త ఈవీ ప్రాజెక్టులకు నిధులెలా సమకూర్చుకుంటుందనే దానిపై ఇంకా స్పష్టత లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment