Battery manufacturing
-
ఈవీ రంగంలోకి రిలయన్స్ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాజాగా ఎలక్ట్రిక్ కార్లు (ఈవీ), బ్యాటరీల తయారీ విభాగంలోకి ప్రవేశించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళికలకు సంబంధించి వ్యయాలపరంగా సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేసేందుకు చైనా దిగ్గజం బీవైడీ ఇండియా మాజీ హెడ్ సంజయ్ గోపాలకృష్ణన్‌ను కన్సల్టెంటుగా నియమించుకున్నట్లు సమాచారం. రిలయన్స్ ఇన్ఫ్రా ప్రాథమికంగా ఏటా 2,50,000 ఈవీలతో మొదలుపెట్టి 7,50,000 వాహనాలకు ఉత్పత్తిని పెంచుకోవాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే 10 గిగావాట్ అవర్స్ (జీడబ్లూహెచ్) సామర్థ్యంతో బ్యాటరీల తయారీ ప్లాంటు ఏర్పాటు సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు వివరించాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం రిలయన్స్ ఇన్ఫ్రా జూన్‌లోనే వాహన రంగానికి సంబంధించి కొత్తగా రెండు అనుబంధ సంస్థలను ప్రారంభించింది. రిలయన్స్ ఈవీ ప్రైవేట్ లిమిటెడ్ వీటిలో ఒకటి. అధిక రుణభారం, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కంపెనీ ఈ కొత్త ఈవీ ప్రాజెక్టులకు నిధులెలా సమకూర్చుకుంటుందనే దానిపై ఇంకా స్పష్టత లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
భారత్‌లో ఫాక్స్‌కాన్ బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్
శ్రీపెరంబదూర్: భారత్‌లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు తైవాన్‌కు చెందిన ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్లీ ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహన విభాగంపై దృష్టితో బ్యాటరీ తయారీ వ్యాపార విస్తరణపై ఫాక్స్‌కాన్ దృష్టి సారించింది. ఈ సంస్థ ఈ–బస్‌ల కోసం తైవాన్‌లో ఇలాంటి ప్లాంట్ ఒకదాన్ని ఇప్పటికే ఏర్పాటు చేయగా, ఈ ఏడాదే ఉత్పత్తి మొదలు కానుంది. ‘‘3ప్లస్3 భవిష్యత్ పరిశ్రమ ఏర్పాటుకు వేచి చూస్తున్నాం. తమిళనాడులో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ఏర్పాటు విషయంలో సహకారం ఎలా అన్నదానిపై పరిశ్రమల మంత్రితో చర్చిస్తున్నా’’ అని యాంగ్లీ తెలిపారు. సోలార్, విండ్ టర్బయిన్ల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను నిల్వ చేసేందుకు బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు వీలు కలి్పస్తాయి. మన దేశం పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇస్తుండడం తెలిసిందే. దీంతో ఈ విభాగంలో అవకాశాలను సొంతం చేసుకునేందుకు ఫాక్స్‌కాన్ ఆసక్తిగా ఉన్నట్టు యాంగ్లీ మాటలను బట్టి తెలుస్తోంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిశగా ఫాక్స్‌కాన్ ప్రణాళికలు అమలు చేస్తోంది. త్వరలోనే ఈవీల తయారీ మొదలవుతుందని యాంగ్లీ తెలిపారు. భారత్‌లో ఇప్పటివరకు తాము 1.4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశామని, వ్యాపారం 10 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందినట్లు చెప్పారు. రానున్న ఏడాది కాలంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ప్రస్తుత భారత పర్యటనలో భాగంగా పలు రాష్ట్రాల సీఎంలతో యాంగ్లీ సమావేశం కావడం గమనార్హం. ఎన్నో రాష్ట్రాలను సందర్శించిన తర్వాత భారత్ వృద్ధి పథకంలో ఉందని అర్థమవుతోందంటూ.. ఈ ప్రయాణంలో ఫాక్స్‌కాన్ సైతం భాగస్వామి కావాలనుకుంటున్నట్టు యాంగ్లీ చెప్పారు. -
బ్రిటన్‌లో టాటా గిగాఫ్యాక్టరీ!
ముంబై/లండన్: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ తాజాగా బ్రిటన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీల తయారీ కోసం గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఏకంగా 4 బిలియన్ పౌండ్లు (సుమారు రూ. 42,500 కోట్లు) వెచి్చంచనున్నట్లు తెలిపింది. తమ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) వాహనాలతో పాటు ఇతరత్రా సంస్థల కోసం కూడా ఇందులో బ్యాటరీలను తయారు చేయనున్నట్లు పేర్కొంది. 2026 నుంచి ఈ గిగాఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలో బ్యాటరీల వాటా దాదాపు సగం పైగా ఉంటుంది. వేల కొద్దీ ఉద్యోగాలకు ఊతం.. గిగాఫ్యాక్టరీపై పెట్టుబడులతో స్థానికంగా 4,000 పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాలు, సరఫరా వ్యవస్థలో పరోక్షంగా వేల మందికి ఉపాధి లభించగలదని బ్రిటన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 2030 నాటికి తమకు అవసరమయ్యే బ్యాటరీల్లో ఈ ప్లాంటు దాదాపు సగభాగం ఉత్పత్తి చేయగలదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి మళ్లాలన్న తమ లక్ష్యం మరింత వేగవంతంగా సాకారం కాగలదని వివరించారు. భారీగా సబ్సిడీలు.. గిగాఫ్యాక్టరీ కోసం బ్రిడ్జ్‌వాటర్ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు జేఎల్ఆర్ మాతృ సంస్థ టాటా సన్స్ తెలిపింది. 40గిగావాట్‌అవర్స్ (జీడబ్ల్యూహెచ్) సామర్థ్యంతో ఇది యూరప్‌లోని భారీ గిగాఫ్యాక్టరీల్లో ఒకటిగాను, భారత్‌కు వెలుపల టాటా గ్రూప్‌నకు తొలి భారీ గిగాఫ్యాక్టరీగా నిలవనుంది. 1980ల్లో నిస్సాన్ రాక తర్వాత బ్రిటన్ ఆటోమోటివ్ రంగంలో ఇది అత్యంత భారీ పెట్టుబడి కానుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం టాటా గ్రూప్‌నకు ప్రభుత్వం నుంచి వందల కొద్దీ మిలియన్ పౌండ్ల మేర ప్లాంటుకు సబ్సిడీల హామీ లభించి ఉంటుందని పేర్కొన్నాయి. విద్యుత్, గ్రాంటు, సైటుకు రహదారిని మెరుగుపర్చటం తదితర రూపాల్లో 500 మిలియన్ పౌండ్ల మేర సబ్సిడీలు అందించాలని ప్రభుత్వాన్ని టాటా గ్రూప్ కోరినట్లు సమాచారం. అయితే, ఇటు టాటా గ్రూప్, అటు బ్రిటన్ ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వలేదు. పారదర్శక విధానాల్లో భాగంగా వీటిని తర్వాత ప్రచురించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్‌లో ప్రస్తుతం ఒక్క బ్యాటరీల తయారీ ప్లాంటు ఉంది. కొత్తగా మరో ఫ్యాక్టరీ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు యూరోపియన్ యూనియన్‌లో 35 పైచిలుకు ప్లాంట్లు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఇప్పటికే పనిచేస్తుండగా, కొన్ని నిర్మాణంలోనూ, కొన్ని ప్రతిపాదనల దశల్లోనూ ఉన్నాయి. అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు.. ‘బిలియన్ల కొద్దీ పౌండ్ పెట్టుబడులు, అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసే ప్లాంటు.. ఆటోమోటివ్ రంగం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వేగవంతంగా మళ్లేందుకు తోడ్పడగలదు. ఇప్ప టికే బ్రిటన్‌లో వివిధ రంగాల్లో మా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. బ్రిటన్‌లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని తెలిపేందుకు తాజా ఇన్వెస్ట్మెంట్ నిదర్శనం‘ అని టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తెలిపారు. ‘భారత్‌కు వెలుపల తమ తొలి భారీ ఫ్యాక్టరీని ఇక్కడ నెలకొల్పాలని టాటా గ్రూప్ నిర్ణయం తీసుకోవడమనేది బ్రిటన్ కార్ల తయారీ పరిశ్రమ, నిపుణులపై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. మా ఆటోమోటివ్ రంగంలో అత్యంత భారీ పెట్టుబడుల్లో ఇది కూడా ఒకటిగా నిలవనుంది’ – బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ -
బ్యాటరీ సెల్ తయారీపై భారీ పెట్టుబడులు
ముంబై: బ్యాటరీ సెల్ తయారీలో పెట్టుబడులు 2030 నాటికి 9 బిలియన్ డాలర్లను (రూ.72వేల కోట్లు) అధిగమిస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ డిమాండ్ 2030 నాటికి 60 గిగావాట్‌హవర్‌కు (జీడబ్ల్యూహెచ్) చేరుకుంటుందని తెలిపింది. ఈవీ ఎకోసిస్టమ్ అభివృద్ధిలో బ్యాటరీ తయారీ అన్నది అత్యంత కీలకమైనదిగా పేర్కొంది. బ్యాటరీల తయారీ పెద్ద ఎత్తున విస్తరించాల్సి ఉందని, ఈవీల ధరలు తగ్గేందుకు, ధరల వ్యత్యాసం తొలగిపోయేందుకు ఇది ముఖ్యమైనదిగా గుర్తు చేసింది. ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గుతాయన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించింది. చార్జింగ్ సదుపాయాలు అన్నవి క్రమంగా విస్తరిస్తాయని, ఇంధన సామర్థ్యంలో పురోగతి తప్పనిసరి అని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఒకే చోటకు చేరడం.. ఎలక్ట్రిక్ వాహనాల ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ (ఓఈఎంలు) కంపెనీలకు సమీపంలోనే సెల్ తయారీ కంపెనీలు కూడా ఉండాలని.. అప్పుడు పరిశోధన, ఆవిష్కరణల ఎకోసిస్టమ్ ఏర్పడుతుందని ఇక్రా నివేదిక తెలియజేసింది. అప్పుడు మెరుగైన ఇంధన సామర్థ్యం, భారత వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన బ్యాటరీల తయారీ సాధ్యపడుతుందని సూచించింది. ‘‘ఎలక్ట్రిక్ వాహనంలో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ బ్యాటరీలు ఎంతో ముఖ్యమైనవే కాదు, చాలా ఖరీదైనవి. వాహనం ధరలో సుమారు 40 శాతం బ్యాటరీకే అవుతోంది. ప్రస్తుతం బ్యాటరీ సెల్స్ భారత్‌లో తయారు కావడం లేదు. ఓఈఎంలు చాలా వరకు దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ కార్యకలాపాలు దేశీయంగా పరిమితంగానే ఉన్నాయి. ఈవీల విస్తరణ, పోటీ ధరలకే వాటిని తయారు చేయాలంటే బ్యాటరీ సెల్స్ అభివృద్ధికి స్థానికంగా ఎకోసిస్టమ్ ఏర్పాటు కావాల్సిందే’’అని ఇక్రా గ్రూపు హెడ్ శంషేర్ దివాన్ అన్నారు. -
కమోడిటీలకు రెక్కలు.. ఎలక్ట్రిక్ వాహనాలకు చిక్కులు
పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఉత్పత్తిని మరింతగా పెంచాలన్న లక్ష్యాలకు ఊహించని రీతిలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈవీల్లో కీలకమైన బ్యాటరీల తయారీకి సంబంధించిన ముడి వస్తువుల రేట్లు అమాంతం పెరిగిపోవడం ఇందుకు కారణం. దీని వల్ల ఈవీల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు మరింత సమయం పట్టేయనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈవీల్లో వాడే బ్యాటరీల తయారీలో లిథియం, కోబాల్ట్, మాంగనీస్, నికెల్ వంటి ముడి వస్తువులను ఉపయోగిస్తారు. ఈ ఏడాది తొలి నాళ్ల నుంచి మ్యాంగనీస్ మినహా మిగతా కమోడిటీల ధరలన్నీ ఒక్కసారిగా ఎగిశాయి. గణాంకాల ప్రకారం ప్రపంచంలో సరఫరా అయ్యే మొత్తం లిథియం వినియోగంలో నాలుగింట మూడొంతుల వాటా బ్యాటరీలదే ఉంటోంది. ఈవీల కొరత, ఉత్పత్తి పెంపు అంచనాల కారణంగా లిథియం రేట్లు గతేడాది నుంచే పరుగులు తీస్తున్నాయి. లిథియం ధరలకు ప్రామాణికమైన లిథియం కార్బొనేట్ ధరలు ఈ ఏడాది 75 శాతం పెరిగాయి. ప్రస్తు తం టన్ను రేటు 78,294 డాలర్ల స్థాయిలో ఉంది. కస్టమర్లపై భారం.. నికెల్, ఇంధనాల ధరల పెరుగుదల వల్ల ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీ సంస్థలు, వాహన తయారీ సంస్థల వ్యయాలూ పెరుగుతాయని ఫిచ్ సొల్యూషన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ భారం అంతిమంగా వినియోగదారులకు బదిలీ అవుతుందని తెలిపాయి. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఫిబ్రవరి 24 నుండి ఇంధనాల ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముడిచమురు, బొగ్గు, సహజ వాయువు, ఇథనాల్ మొదలైన వాటన్నింటి రేట్లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పరిస్థితులు అదుపులోకి రావచ్చన్న ఆశలతో ఆ తర్వాత కాస్త దిగివచ్చాయి. క్రూడాయిల్, సహజ వాయువు అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా కూడా ఒకటి. ఉక్రెయిన్‌పై దాడుల కారణంగా రష్యాపై ఆంక్షలు విధించడంతో ఇంధనాల సరఫరాపై ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలతో క్రూడాయిల్ రేట్లు ఎగిశాయి. అటు గోధుమలు, బార్లీ, వంటనూనెల ధరలూ పెరిగాయి. రష్యా, ఉక్రెయిన్ దేశాలు రెండూ.. వీటిని అత్యధికంగా సరఫరా చేసే దేశాలు కావడం ఇందుకు కారణం. ముడి వస్తువుల ధరలు పెరిగిపోవడం, సరఫరా తగ్గిపోవడం వంటి అంశాల కారణంగా కంపెనీలు ఇతర ప్రత్యామ్నాయాల వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు చాలా మటుకు దేశాలు లిథియం–నికెల్–మాంగనీస్–కోబాల్ట్ బ్యాటరీల ను ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగిస్తున్నాయి. కానీ చైనా ఈవీ మార్కెట్లో మాత్రం లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నికెల్‌ను పక్కన పెట్టి లిథియం–ఐరన్–ఫాస్ఫేట్ కాంబినేషన్‌తో ప్రత్యా మ్నాయ బ్యాటరీల తయారీపై ఆసక్తి పెరగవచ్చని ఫిచ్ సొల్యూషన్స్ అభిప్రాయపడింది. నికెల్ @ 1 లక్ష డాలర్లు.. మరో కీలక కమోడిటీ నికెల్ రేట్లు గడిచిన మూడు వారాల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఒక దశలో టన్నుకు 1,00,000 డాలర్లు పలికిన నికెల్ తర్వాత 45,000 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. అయినా కూడా ఈ ఏడాది ప్రారంభం నాటి 20,995 డాలర్లతో పోలిస్తే ఇప్పటికీ రెట్టింపు స్థాయిలోనే ఉండటం గమనార్హం. రష్యాపై ఆంక్షల వల్ల ఆ దేశం నుండి కొనుగోళ్లు పడిపోయి.. ఈ ఏడాదంతా కూడా నికెల్ ధరలు అధిక స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నికెల్ సరఫరాలో రష్యాకు దాదాపు తొమ్మిది శాతం వాటా ఉంది. అటు కోబాల్ట్ 2021లో గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటిదాకా మరో 16 శాతం పెరిగింది. టన్నుకు 82,000 డాలర్లకు చేరింది. మాంగనీస్ ధరలు 2022లో మూడు శాతం పెరిగి టన్నుకు 5.43 డాలర్లకు చేరాయి. ఈ ధరలు అధిక స్థాయిలో అలాగే కొనసాగాయంటే హరిత వాహనాల వైపు మళ్లే ప్రక్రియ నెమ్మదించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈవీలకు డిమాండ్ భారీగా పెరగడంతో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో లిథియం ఉత్పత్తిని పెంచేందుకు మైనింగ్ కంపెనీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. పరిశ్రమ గణాంకాల ప్రకారం అమెరికాను మినహాయించి గతేడాది అంతర్జాతీయంగా లిథియం ఉత్పత్తి 21 శాతం పెరిగి 1,00,000 టన్నులకు చేరింది. రేట్లు పెరగడంతో వివిధ వనరుల ద్వారా ఉత్పత్తిని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
కాలుష్య నగరాల్లో 22 భారత్‌లోనే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలో బ్యాటరీల అవసరం భారీగా పెరగనుంది. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి పెద్దఎత్తున చేపట్టనున్నారు. కాలుష్య నియంత్రణ, కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం బ్యాటరీలను ఎక్కువగా ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ తాజా నివేదికలో పేర్కొంది. 2030 నాటికి దేశంలో కొత్త వాహనాల అమ్మకాల్లో 30% ఎలక్ట్రిక్‌వే ఉంటాయని తెలిపింది. అయితే బ్యాటరీల డిమాండ్ ఎంత మేరకు ఉందో అందులో 20 శాతం కూడా మనకు అందుబాటులో లేవని తేల్చింది. విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో దాన్ని స్టోరేజ్ (నిల్వ) చేయడం అంతకంటే ప్రధానమని స్పష్టం చేసింది. రెన్యువబుల్ ఎనర్జీ (పునరుత్పాదక శక్తి)ని పెంపొందించుకునేందుకు భారీ ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో బ్యాటరీలతో ఎక్కువ అవసరం ఉంటున్న దృష్ట్యా వాటిని భారీఎత్తున ఉత్పత్తి చేసుకోవాలని సూచించింది. 2030 కల్లా అంతర్జాతీయ రెన్యువబుల్ ఎనర్జీ మార్కెట్ ఏడాదికి 150 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది. కాలుష్య నగరాల్లో 22 ఇక్కడే ప్రపంచంలో ఎక్కువ కాలుష్యం వెదజల్లుతున్న 30 నగరాలను గుర్తించగా..అందులో 22 భారత్‌లోనే ఉన్నాయి. భారత్ వంటి ఎక్కువ జనాభా కలిగిన దేశాల్లో కాలుష్యాన్ని తగ్గించాలంటే పట్టణాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడం తప్ప మరో మార్గం లేదు. ఇందుకోసం బ్యాటరీల దిగుమతిని తగ్గించుకుని..సొంతంగా తయారీ అవకాశాలు పెంచుకోవాలి. పైగా బ్యాటరీల వ్యయం కూడా తగ్గినందున వాటిని భారీ స్థాయిలో ఉపయోగించుకోవచ్చు. బ్యాటరీల ఉత్పత్తిలో కొత్త సాంకేతికతను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. ఏపీలో 3 ప్రాజెక్టులు ఎనర్జీ ఉత్పత్తితో పాటు స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌లో 3 ప్రాంతాలను ఎంపిక చేసింది. ఇందులో ఒకటి అనంతపురం జిల్లా రామగిరి మండలంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని, ఇది టెండర్ దశలో ఉందని నీటి ఆయోగ్ పేర్కొంది. ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. 2030 నాటికి దేశంలోనే మొబైల్ బ్యాటరీల మార్కెట్ విలువ 15 బిలియన్ డాలర్లు అంటే రూ.లక్ష కోట్లు దాటుతుందని వెల్లడించింది. 2070 నాటికి దేశంలో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయని నీతిఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. -
వ్యర్థాల నుంచి స్వచ్ఛలోహాలు
లండన్: బ్యాటరీ వ్యర్థాల నుంచి వంద శాతం స్వచ్ఛమైన లిథియం, కోబాల్ట్, నికెల్ లోహాలను వెలికితీయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. దీంతో బ్యాటరీల రీసైక్లింగ్ సులభతరం కానుంది. బ్యాటరీ వ్యర్థాల నుంచి 99.6 శాతం కోబాల్ట్, 99.7 శాతం నికెల్, 99.9 శాతం లిథియం లోహాలను పరిశోధకులు వెలికితీయగలిగారు. బ్యాటరీ తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలు స్వచ్ఛమైనవిగా ఉండాలని, అవే తయారీలో కీలకపాత్ర పోషిస్తాయని ఈ పరిశోధన నిర్వహించిన లప్పీరంట వర్సిటీ పరిశోధకులు తెలిపారు. కొత్త బ్యాటరీల తయారీకి ఉపయోగించే లిథియం లోహం స్వచ్ఛతత 99.5 శాతంపైగా లేకపోతే అవి పనిచేయవని సామీ అన్నారు.