సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలో బ్యాటరీల అవసరం భారీగా పెరగనుంది. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి పెద్దఎత్తున చేపట్టనున్నారు. కాలుష్య నియంత్రణ, కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం బ్యాటరీలను ఎక్కువగా ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ తాజా నివేదికలో పేర్కొంది. 2030 నాటికి దేశంలో కొత్త వాహనాల అమ్మకాల్లో 30% ఎలక్ట్రిక్‌వే ఉంటాయని తెలిపింది. అయితే బ్యాటరీల డిమాండ్ ఎంత మేరకు ఉందో అందులో 20 శాతం కూడా మనకు అందుబాటులో లేవని తేల్చింది.
విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో దాన్ని స్టోరేజ్ (నిల్వ) చేయడం అంతకంటే ప్రధానమని స్పష్టం చేసింది. రెన్యువబుల్ ఎనర్జీ (పునరుత్పాదక శక్తి)ని పెంపొందించుకునేందుకు భారీ ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో బ్యాటరీలతో ఎక్కువ అవసరం ఉంటున్న దృష్ట్యా వాటిని భారీఎత్తున ఉత్పత్తి చేసుకోవాలని సూచించింది. 2030 కల్లా అంతర్జాతీయ రెన్యువబుల్ ఎనర్జీ మార్కెట్ ఏడాదికి 150 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది.
కాలుష్య నగరాల్లో 22 ఇక్కడే
ప్రపంచంలో ఎక్కువ కాలుష్యం వెదజల్లుతున్న 30 నగరాలను గుర్తించగా..అందులో 22 భారత్‌లోనే ఉన్నాయి. భారత్ వంటి ఎక్కువ జనాభా కలిగిన దేశాల్లో కాలుష్యాన్ని తగ్గించాలంటే పట్టణాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడం తప్ప మరో మార్గం లేదు. ఇందుకోసం బ్యాటరీల దిగుమతిని తగ్గించుకుని..సొంతంగా తయారీ అవకాశాలు పెంచుకోవాలి. పైగా బ్యాటరీల వ్యయం కూడా తగ్గినందున వాటిని భారీ స్థాయిలో ఉపయోగించుకోవచ్చు. బ్యాటరీల ఉత్పత్తిలో కొత్త సాంకేతికతను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది.
ఏపీలో 3 ప్రాజెక్టులు
ఎనర్జీ ఉత్పత్తితో పాటు స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌లో 3 ప్రాంతాలను ఎంపిక చేసింది. ఇందులో ఒకటి అనంతపురం జిల్లా రామగిరి మండలంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని, ఇది టెండర్ దశలో ఉందని నీటి ఆయోగ్ పేర్కొంది. ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. 2030 నాటికి దేశంలోనే మొబైల్ బ్యాటరీల మార్కెట్ విలువ 15 బిలియన్ డాలర్లు అంటే రూ.లక్ష కోట్లు దాటుతుందని వెల్లడించింది. 2070 నాటికి దేశంలో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయని నీతిఆయోగ్ తన నివేదికలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment