హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్‌కు మారేందుకు సుమారు రూ.23 లక్షల కోట్లు అవసరమని ఒక నివేదిక వెల్లడించింది. నీతి అయోగ్ భాగస్వామ్యంతో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రూపొందించిన ఈ శ్వేత పత్రం ప్రకారం..చివరి గమ్యస్థానం కోసం, అలాగే పట్టణాల్లో డెలివరీకి ఉపయోగించే వాహనాలే దేశంలో ఎలక్ట్రిక్ టూ, త్రీవీలర్ల స్వీకరణను ముందుండి నడిపిస్తున్నాయి.
పూర్తిగా ఎలక్ట్రిక్‌కి మారబోయే మొదటి విభాగాలుగా వీటిని చెప్పవచ్చు. ముందస్తు కొనుగోలు ఖర్చు ఎక్కువగా ఉండడం, కొత్త సాంకేతికతపై విశ్వాసం లేకపోవడం, హామీ లేని విశ్వసనీయత, పునఃవిక్రయం విలువ స్థిరీకరించకపోవడం కారణంగా ఎలక్ట్రిక్‌కు మారడానికి డ్రైవర్–కమ్–ఓనర్లు వెనుకాడుతున్నారు. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం వెహికిల్స్‌లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల వాటా ఏకంగా 80 శాతం ఉంది. కొన్నేళ్లుగా ఈవీల వాడకం పెరుగుతోంది.
నిర్వహణ ఖర్చు తక్కువ..
భారత్‌లో ధ్రువీకరణ పొందిన 45 కంపెనీలు ఎలక్ట్రిక్ టూ, త్రీవీలర్ల తయారీలో ఉన్నాయి. ఇవి ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్లను విక్రయించాయి. 25 కోట్ల మొత్తం ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో ఎలక్ట్రిక్ టూ, త్రీవీలర్ల వాటా అతిస్వల్పమే. భారత్‌లో పెరుగుతున్న ఆదాయాలు, వాహన యాజమాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర, త్రిచక్ర వాహనాల సంఖ్య మొత్తం 27 కోట్లకు పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.
వీటిలో 26.4 కోట్ల యూనిట్ల ఎలక్ట్రిక్ టూవీలర్లు ఒక్కొక్కటి సగటున రూ.80,000 చొప్పున, అలాగే 60 లక్షల యూనిట్ల ఈ–త్రీవీలర్లు ఒక్కొక్కటి సగటున రూ.2.8 లక్షలుగా లెక్కించారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నప్పటికీ.. వాటి నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. యాజమాన్య ఖర్చుతో అంచనా వేసినప్పుడు రోజువారీ అధికంగా వినియోగించే రైడ్–హెయిలింగ్, లాస్ట్–మైల్ డెలివరీ ఫ్లీట్స్‌కు ఈవీలు ఇప్పటికే అనువైనవని పరిశ్రమ గుర్తించిందని నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment