టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌తో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
ముంబై/లండన్: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ తాజాగా బ్రిటన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీల తయారీ కోసం గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఏకంగా 4 బిలియన్ పౌండ్లు (సుమారు రూ. 42,500 కోట్లు) వెచి్చంచనున్నట్లు తెలిపింది. తమ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) వాహనాలతో పాటు ఇతరత్రా సంస్థల కోసం కూడా ఇందులో బ్యాటరీలను తయారు చేయనున్నట్లు పేర్కొంది. 2026 నుంచి ఈ గిగాఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలో బ్యాటరీల వాటా దాదాపు సగం పైగా ఉంటుంది.
వేల కొద్దీ ఉద్యోగాలకు ఊతం..
గిగాఫ్యాక్టరీపై పెట్టుబడులతో స్థానికంగా 4,000 పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాలు, సరఫరా వ్యవస్థలో పరోక్షంగా వేల మందికి ఉపాధి లభించగలదని బ్రిటన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 2030 నాటికి తమకు అవసరమయ్యే బ్యాటరీల్లో ఈ ప్లాంటు దాదాపు సగభాగం ఉత్పత్తి చేయగలదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి మళ్లాలన్న తమ లక్ష్యం మరింత వేగవంతంగా సాకారం కాగలదని వివరించారు.
భారీగా సబ్సిడీలు..
గిగాఫ్యాక్టరీ కోసం బ్రిడ్జ్‌వాటర్ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు జేఎల్‌ఆర్ మాతృ సంస్థ టాటా సన్స్ తెలిపింది. 40గిగావాట్‌అవర్స్ (జీడబ్ల్యూహెచ్) సామర్థ్యంతో ఇది యూరప్‌లోని భారీ గిగాఫ్యాక్టరీల్లో ఒకటిగాను, భారత్‌కు వెలుపల టాటా గ్రూప్‌నకు తొలి భారీ గిగాఫ్యాక్టరీగా నిలవనుంది. 1980ల్లో నిస్సాన్ రాక తర్వాత బ్రిటన్ ఆటోమోటివ్ రంగంలో ఇది అత్యంత భారీ పెట్టుబడి కానుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం టాటా గ్రూప్‌నకు ప్రభుత్వం నుంచి వందల కొద్దీ మిలియన్ పౌండ్ల మేర ప్లాంటుకు సబ్సిడీల హామీ లభించి ఉంటుందని పేర్కొన్నాయి. విద్యుత్, గ్రాంటు, సైటుకు రహదారిని మెరుగుపర్చటం తదితర రూపాల్లో 500 మిలియన్ పౌండ్ల మేర సబ్సిడీలు అందించాలని ప్రభుత్వాన్ని టాటా గ్రూప్ కోరినట్లు సమాచారం. అయితే, ఇటు టాటా గ్రూప్, అటు బ్రిటన్ ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వలేదు. పారదర్శక విధానాల్లో భాగంగా వీటిని తర్వాత ప్రచురించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్‌లో ప్రస్తుతం ఒక్క బ్యాటరీల తయారీ ప్లాంటు ఉంది. కొత్తగా మరో ఫ్యాక్టరీ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు యూరోపియన్ యూనియన్‌లో 35 పైచిలుకు ప్లాంట్లు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఇప్పటికే పనిచేస్తుండగా, కొన్ని నిర్మాణంలోనూ, కొన్ని ప్రతిపాదనల దశల్లోనూ ఉన్నాయి.
అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు..
‘బిలియన్ల కొద్దీ పౌండ్ పెట్టుబడులు, అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసే ప్లాంటు.. ఆటోమోటివ్ రంగం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వేగవంతంగా మళ్లేందుకు తోడ్పడగలదు. ఇప్ప టికే బ్రిటన్‌లో వివిధ రంగాల్లో మా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. బ్రిటన్‌లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని తెలిపేందుకు తాజా ఇన్వెస్ట్‌మెంట్ నిదర్శనం‘ అని టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తెలిపారు. ‘భారత్‌కు వెలుపల తమ తొలి భారీ ఫ్యాక్టరీని ఇక్కడ నెలకొల్పాలని టాటా గ్రూప్ నిర్ణయం తీసుకోవడమనేది బ్రిటన్ కార్ల తయారీ పరిశ్రమ, నిపుణులపై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. మా ఆటోమోటివ్ రంగంలో అత్యంత భారీ పెట్టుబడుల్లో ఇది కూడా ఒకటిగా నిలవనుంది’
– బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
Comments
Please login to add a commentAdd a comment