తయారీ రంగానికి టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తీపి కబురు
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో తయారీకి సంబంధించి వివిధ విభాగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ మొదలైన పరిశ్రమల్లో ఈ ఉద్యోగాలుంటాయని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్రశేఖరన్ ఈ విషయం చెప్పారు. అస్సాంలో ఏర్పాటు చేస్తున్న సెమీకండక్టర్ ప్లాంటుతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ కోసం ఇతరత్రా పలు కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
వీటితో ప్రాథమికంగా ఒక వ్యవస్థ ఏర్పడుతుందని, ఈ వ్యవస్థలో కనీసం 5 లక్షల పైచిలుకు చిన్న, మధ్య తరహా సంస్థలుంటాయని చంద్రశేఖరన్ చెప్పారు. తయారీ రంగంలో ఉద్యోగాలు కల్పించకుండా వికసిత భారత్ లక్ష్యాలను సాధించలేమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి నెలా పది లక్షల మంది యువత ఉద్యోగాల మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో పది కోట్ల పైచిలుకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యక్షంగా ఒక్క ఉద్యోగం కల్పిస్తే పరోక్షంగా ఎనిమిది నుంచి పది మందికి ఉపాధి కల్పించగలిగే సెమీకండక్టర్ల వంటి కొత్త తరం పరిశ్రమలు ఇందుకు దోహదపడగలవని పేర్కొన్నారు.
ముంబై: విమానాలను లీజుకిచ్చిన ఎయిర్ క్యాజిల్, విల్మింగ్టన్ ట్రస్టు సంస్థలతో వివాదాలను పరిష్కరించుకున్నట్లు స్పైస్‌జెట్ వెల్లడించింది. సెటిల్మెంట్‌లో భాగంగా 23.39 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు వివరించింది. దీని ప్రకారం స్పైస్‌జెట్‌పై వేసిన దావాలను రెండు సంస్థలు ఉపసంహరించుకోనున్నాయి. దీర్ఘకాలంగా ఎయిర్‌క్యాజిల్, విల్మింగ్టన్ ట్రస్ట్‌లతో ఉన్న వివాదాలను విజయవంతంగా పరిష్కరించుకున్నట్లు స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ తెలిపారు. కంపెనీ ఇటీవలే అమెరికాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ సంస్థ బీబీఏఎంతో కూడా ఇదే తరహా వివాదాన్ని సెటిల్ చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment