దావోస్: భారత్ ఇటీవలి కాలంలో మార్పు దిశగా చక్కని వైఖరి ప్రదర్శించిందని, ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలంగా పైకి తీసుకొచ్చేందుకు భారత్ నాయతక్వం పోషించాల్సిన స్థానంలో ఉన్నట్టు టాటా గ్రూపు చైర్‌పర్సన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో భాగంగా.. ‘10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ మార్గం’ అనే అంశంపై చర్చా కార్యక్రమంలో చంద్రశేఖరన్ పాల్గొన్నారు.
టెక్నాలజీని వినియోగించుకోవడంలో భారత్ ప్రావీణ్యం సంపాదించినట్టు చెప్పారు. భారత్ అధిక సంఖ్యలో గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోందని, భారత్‌ను అనుకూల స్థితిలో ఉంచేందుకు కారణమైన అంశాల్లో ఇది కూడా ఒకటన్నారు. ‘‘భారత్ కరోనా సమయంలో గొప్ప పనితీరు చూపించింది. కావాల్సిన టీకాలను భారత్‌లోనే తయారు చేసుకోవడాన్ని చూశాం. డిజిటల్ దిశగా అనూహ్యమైన మార్పును చూస్తున్నాం. నా వరకు వృద్ధి, వృద్ధి, వృద్ధి అన్నవి ఎంతో ముఖ్యమైనవి. ప్రపంచం పుంజుకోవాలని చూస్తోంది. సరఫరా వ్యవస్థ సహా నాయకత్వం వహించాల్సిన స్థానంలో భారత్ ఉంది’’అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
భారత్‌కు అపార అవకాశాలున్నాయంటూ.. హెల్త్‌కేర్, పర్యాటకం తదితర రంగాల్లో ముఖ్య పాత్ర పోషించగలదన్నారు. భారత్‌కు ఏటా కోటి మంది పర్యాటకులు ప్రస్తుతం వస్తుండగా, 10 కోట్ల మందిని ఆకర్షించే సామర్థ్యం ఉందని చెప్పారు. ఈ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను నిర్మించాలని, ఎయిర్ పోర్ట్‌లు, ఉపరితల రవాణా, షిప్పింగ్ విభాగాల్లో ఎన్నో పనులు జరుగుతున్నట్టు చెప్పారు. అన్ని లక్ష్యాలను 25 ఏళ్ల అమృత కాలంలో సాధించొచ్చన్నారు. కరోనా సమయంలో భారత్ ఎన్నో అంశాల్లో తన సామర్థ్యాలను నిరూపించుకున్నట్టు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పేర్కొన్నారు. ఈ లక్ష్యాలను భారత్ సునాయాసంగా సాధించగలదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment