ముంబై: టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడగిస్తూ కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. "బోర్డు సభ్యులు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పనితీరును ప్రశంసిస్తూ రాబోయే ఐదు సంవత్సరాలకు ఎన్.చంద్రశేఖరన్‌ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తిరిగి నియమించడానికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు" కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడైన రతన్ టాటా, ఎన్.చంద్రశేఖరన్ నాయకత్వంలో టాటా గ్రూపు పురోగతి & పనితీరుపై తన సంతృప్తిని వ్యక్తం చేశారు. తన పదవీకాలాన్ని మరో ఐదేళ్లు పునరుద్ధరించాలని ఆయన సిఫారసు చేసినట్లు ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది.
తనను తిరిగి నియమించడంపై చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. "గత ఐదు సంవత్సరాలుగా టాటా గ్రూపుకు నాయకత్వం వహించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. టాటా గ్రూపుకు మరో ఐదు సంవత్సరాలు నాయకత్వం వహించే అవకాశం రావడం నాకు సంతోషంగా ఉంది" అని అన్నారు. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఎయిర్ ఇండియాను జనవరిలో టాటా గ్రూప్ స్వాధీనం చేసుకున్న కొద్ది వారాలకే చంద్రశేఖరన్ తిరిగి నియామకం కావడం విశేషం. దాదాపు 70 సంవత్సరాల తర్వాత విమానయాన సంస్థ తిరిగి తన సొంత గూటికి చేరుకుంది.
గతేడాది అక్టోబర్‌లో స్పైస్‌జెట్ కన్సార్షియంతో పోటీపడి ఎయిరిండియాను టాటా సన్స్ చేజిక్కించుకుంది. ఎయిరిండియా తిరిగి తమ నిర్వహణ కిందకు రావడం ఎంతో సంతోషంగా ఉందని టాటాసన్స్ (టాటా కంపెనీల మాతృ సంస్థ) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. టాటా గ్రూపు హోల్డింగ్ కంపెనీ అయిన టాలేస్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఎయిరిండియాను అప్పగించినట్టు పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) సెక్రటరీ తుహిన్ కాంత పాండే జనవరిలో తెలిపారు. ఈ డీల్ విలువ సుమారు రూ.18,000 కోట్లు. ఇందులో రూ.2,700 కోట్ల మేర టాలేస్ నగదు చెల్లించనుండగా, మిగతా మొత్తానికి సరిపడా ఎయిరిండియాకు ఉన్న రుణ భారాన్ని తనకు బదిలీ చేసుకోనుంది. అయితే, ఎయిరిండియా తిరిగి టాటాల చెంతకు చేరడం.. చంద్రశేఖరన్ సాధించిన విజయాల్లో ముఖ్యమైనది.
(చదవండి: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. త్వరలో పెరగనున్న పెన్షన్..!)
Comments
Please login to add a commentAdd a comment