
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా.. వచ్చిన దారిని, మూలలను మరచిపోకూడదు. డబ్బు సంపాదించగానే లగ్జరీకి అలవాటుపడే మనుషులున్న ఈ రోజుల్లో కూడా.. వేలకోట్ల రూపాయల కంపెనీ అతని సారథ్యంలో ఉన్నప్పటికీ, నిరాడంబరంగా.. పంచె కట్టుకుని జీవితం గడిపేస్తున్నారు. ఇంతకీ అయన ఎవరు? ఆయన స్థాపించిన కంపెనీ ఏది? సంపాదన ఎంత అనే ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
తమిళనాడులో జన్మించిన 'శ్రీధర్ వెంబు'.. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి, నేడు ఎంతోమందికి ఆదర్శమయ్యారు. చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని.. ఆ తరువాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు పయనమయ్యారు. చదువు పూర్తయిన తరువాత ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ సంపాదించారు. కానీ కొన్ని రోజులకు మంచి ఉద్యోగాన్ని వదిలి, ఇండియాకు వచ్చేసారు.

ఉద్యోగం వదిలి, భారత్ వచ్చిన తరువాత.. సొంత సాఫ్ట్‌వేర్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. అదే నేడు అందరికి సుపరిచయమైన.. 'జోహో కార్పొరేషన్'. చాలా మంది ప్రజలు మంచి అవకాశాల కోసం గ్రామాల నుంచి నగరాలకు, ఆపై విదేశాలకు తరలిపోతున్న సమయంలో వెంబు ఈ ధోరణిని తిప్పికొట్టారు.
అమెరికాను విడిచిపెట్టి తమిళనాడులోని ఒక చిన్న గ్రామానికి తిరిగి వచ్చి, అక్కడ నుంచే ఇప్పుడు తన బిలియన్ డాలర్ల కంపెనీని నడుపుతున్నారు. జోహో ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది, కానీ వెంబు 630 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెన్కాసికి సమీపంలోని మారుమూల గ్రామమైన మథలంపారైలో ఓ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు.

శ్రీధర్ వెంబు తీసుకున్న ఈ నిర్ణయం.. కంపెనీని అభివృద్ధికి మాత్రమే కాకుండా, సమాజ అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ భారతదేశాన్ని నిర్మించడానికి దోహదపడింది. దీంతో భారత ప్రభుత్వం.. 72వ గణతంత్ర దినోత్సవం నాడు వెంబుకు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందించింది.
గ్రామీణ ప్రాంతంలో ఆఫీస్ ఏర్పాటు చేయాలనే.. వెంబు ఆలోచన చాలామందిని ఆశ్చర్యపరిచింది. గ్రామాలను వదిలి నగరాలకు ప్రజలు తరచుగా వెళ్లే వలస ధోరణిని తిప్పికొట్టాలనే గ్రామంలో ఆఫీస్ స్టార్ట్ చేసినట్లు శ్రీధర్ వెంబు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

వెంబు తెన్కాసిలో ఒక చిన్న కార్యాలయాన్ని అద్దెకు తీసుకొని ప్రారంభించారు. ఆ తరువాత మథలంపారైలో ఒక పాత ఫ్యాక్టరీని కొనుగోలు చేసి, దానిని టెక్ క్యాంపస్‌గా మార్చారు. వెంబు కార్యాలయాలను ఏర్పాటు చేయడంతోనే ఆగిపోలేదు. ఆయన జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌ను కూడా ప్రారంభించారు. ఇక్కడ ఉన్నత పాఠశాల, డిప్లొమా విద్యార్థులు వివిధ నైపుణ్యాలలో శిక్షణ పొందుతారు.
ఇదీ చదవండి: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. ప్రధాన కారణాలివే!
శ్రీధర్ వెంబు ప్రారంభించిన.. జోహో కార్పొరేషన్ విలువ రూ. లక్ష కోట్ల కంటే ఎక్కువ. కాగా ఈయన ఆస్తి రూ. 28వేలకోట్ల కంటే ఎక్కువని సమాచారం. వేలకోట్ల సంపద కలిగి ఉన్నప్పటికీ.. వెంబు చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. రోజువారీ ప్రయాణానికి ఆయన సైకిల్ ఉపయోగిస్తున్నారు. ఖరీదైన సూట్ కాకుండా.. పంచె కట్టుకుంటుటారు. ఇటీవలే 'శ్రీధర్ వెంబు' తన సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అయితే అదే కంపెనీలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment