భారతదేశంలో జరిగే వివాహాల్లో దాదాపు అందరూ.. చాలా వరకు సాంప్రదాయ వస్త్రాలనే ధరిస్తారు. సంప్రదాయ వస్త్రాలు అంటే.. ముందుగా గుర్తొచ్చే బ్రాండ్లలో ఒకటి 'మన్యవర్'. ఈ బ్రాండ్ కేవలం 10వేల రూపాయలతో మొదలైందని.. బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో మన్యవర్ గురించి, దీని అభివృద్ధికి కారణమైన వ్యక్తి గురించి వివరంగా తెలుసుకుందాం.
మన్యవర్ బ్రాండ్ నేడు ప్రపంచ స్థాయికి ఎదగటానికి కారణమైన వ్యక్తి 'రవి మోదీ' (Ravi Modi). ఈయన తండ్రికి కోల్‌కతాలో చిన్న బట్టల దుకాణం ఉండేది. చిన్నప్పటి నుంచే రవి.. తన తండ్రికి వ్యాపారంలో సహాయం చేస్తూ ఉండేవాడు. సుమారు తొమ్మిది సంవత్సరాలు బట్టల దుకాణంలోని పనిచేస్తూ.. ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్వాపరాలు తెలుసుకున్నాడు.
రూ.10000 అప్పుతో
అప్పట్లోనే రవి మోదీ కోల్‌కతాలోని సెయింట్ జేవియన్స్ కాలేజీలో బీ.కామ్ పూర్తి చేశాడు. అయితే చాలా రోజులుగా తండ్రి దుకాణంలోని పనిచేస్తూ ఉన్నాడు, ఇంతలోనే తండ్రితో చిన్న విభేదాలు రావడంతో.. తానే సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తల్లి దగ్గర నుంచి రూ.10,000 తీసుకుని తన కొడుకు పేరు మీదుగా 'వేదాంత్ ఫ్యాషన్స్' అనే పేరుతో బట్టల వ్యాపారమే ప్రారంభించాడు.
రవి మోదీ ప్రారంభించిన వేదాంత్ ఫ్యాషన్ అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాల్లో రెడీమేడ్ వస్త్రాలను.. రవి విక్రయించడం ప్రారంభించాడు. ప్రజలు కూడా ఇతడు విక్రయించే దుస్తులను బాగా ఇష్టపడ్డారు. వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్ కింద 'మన్యవర్' కూడా చేరింది.
భారతదేశంలోని 248 నగరాల్లో
మన్యవర్ నేడు భారతీయ వివాహ మార్కెట్‌లో ప్రసిద్ధ బ్రాండ్. మనదేశంలో పాపులర్ బ్రాండ్‌గా నిలిచిన మన్యవర్ తొలి అంతర్జాతీయ స్టోర్ 2011లో దుబాయ్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సంస్థ భారతదేశంలోని సుమారు 248 నగరాల్లో విస్తరించి ఉంది. దేశంలో మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్లో 662 స్టోర్‌లు ఈ మన్యవర్ కింద ఉన్నాయి.
రూ. 32వేల కోట్ల కంటే ఎక్కువ
రవి మోదీ భార్య 'శిల్పి' కంపెనీ బోర్డులో ఉండగా, ఆయన కుమారుడు 'వేదాంత్' కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. కేవలం 10 వేల రూపాయలతో ప్రారంభమైన కంపెనీ విలువ నేడు రూ. 32వేల కోట్ల కంటే ఎక్కువ.
ఇదీ చదవండి: సంపదలో సరికొత్త రికార్డ్.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా మస్క్
మన్యవర్ విజయం.. రవి మోదీని భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో చేర్చింది. ఏప్రిల్ 2023 నాటికి, అతని నికర విలువ 3 బిలియన్లకు (సుమారు రూ. 26,000 కోట్లు) పెరిగింది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. రవి మోదీ భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 64వ స్థానాన్ని.. ప్రపంచవ్యాప్తంగా 1,238వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment