బెంగళూరు: బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తితో కలిసి బెంగళూరులో పర్యటించారు. కార్తీక మాసం పవిత్రమైన మాసం కావడంతో గురురాఘవేంద్ర స్వామి ఆశీస్సులు పొందేందుకు ఈ దంపతులు మఠాన్ని సందర్శించారు. జయనగర్‌లో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరితో పాటు సునక్ అత్తమామలు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఉన్నారు. గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా దర్శనమిచ్చాయి.
స్వామివారి దర్శనం సందర్భంగా ఆలయ సంప్రదాయ పూజల్లో వారు పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయాలపై తన విశ్వాసం గురించి బహిరంగంగానే ప్రకటించే రిషి సునాక్.. గతంలో దేశంలో పర్యటించినప్పుడు అనేక దేవాలయాలను సందర్శించారు. ఈ ఏడాది జనవరిలో సునాక్ లండన్‌లోని ప్రఖ్యాత బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్‌ను సందర్శించారు. ‘‘నేను హిందువును. అందరిలాగే, నేనూ నా విశ్వాసం నుంచి ప్రేరణను, ఓదార్పును పొందుతాను. పార్లమెంటు సభ్యుడిగా ‘భగవద్గీత’పై ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment