ఆర్థిక కష్టాలు తొలగిపోతున్నాయి.. అప్పులన్నీ దాదాపుగా తీరిపోయాయి.. నష్టాలు పోయి లాభాలు కూడా పలకరించాయి. ఇక అంతా ఆనందమే అనుకుంటున్న సమయంలో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ తగిలింది.
నకిలీ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించారంటూ రిలయన్స్ పవర్‌కి, దాని అనుబంధ సంస్థకు భారత క్లీన్ ఎనర్జీ ఏజెన్సీ ఎస్‌ఈసీఐ షోకాజ్ నోటీసు పంపింది. సంస్థలపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ సంజాయిషి కోరింది.
రిలయన్స్ పవర్‌కు చెందిన ఒక యూనిట్ విదేశీ బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించిన నకిలీ ఎండార్స్‌మెంట్‌ను సమర్పించిందనే ఆరోపణలపై రిలయన్స్ పవర్‌ను, దాని యూనిట్‌ను మూడేళ్లపాటు వేలంలో పాల్గొనకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI) గత వారం నిషేధించింది.
రిలయన్స్ పవర్‌కు అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ ఎన్‌యూ బీఈఎస్ఎస్ సమర్పించిన బ్యాంక్ గ్యారెంటీ కూడా నకిలీదని ఎస్‌ఈసీఐ తన నవంబర్ 13 నాటి నోటీసులో పేర్కొంది. ఈ చర్య తర్వాత, గురువారం బీఎస్‌ఈలో రిలయన్స్ పవర్ షేర్లు 1.53 శాతం పడిపోయి రూ.36 వద్ద స్థిరపడ్డాయి.
కాగా ఆరోపణలపై రిలయన్స్ పవర్ స్పందిస్తూ.. "మోసం, ఫోర్జరీ, కుట్రలో బాధితులం" అని పేర్కొంది. “దీనికి సంబంధించి ఇప్పటికే థర్డ్ పార్టీపై అక్టోబర్ 16న ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్‌లో క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశాం. దాని ఆధారంగా నవంబర్ 11న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. విషయం దర్యాప్తు పరిధిలో ఉంది. న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది” అని రిలయన్స్ పవర్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment