ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చీకటి రోజులు తొలగిపోయాయి. ఒకప్పుడు అత్యంత ధనవంతుల్లొ ఒకడైన ఆయన రిలయన్స్ పవర్‌తో బలమైన పునరాగమనం చేస్తున్నారు. షేర్ మార్కెట్లో కంపెనీ మెరుగైన పనితీరు కొనసాగుతుండటంతో స్టాండలోన్ ప్రాతిపదికన రుణ రహితంగా మారింది.
బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. అనిల్ అంబానీ రిలయన్స్ పవర్ సుమారు రూ .800 కోట్ల రుణాన్ని కలిగి ఉండేది. రుణాలిచ్చిన బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించేసింది. గత కొన్ని నెలలుగా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డీబీఎస్, ఐడీబీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకులతో డెట్ సెటిల్మెంట్ ఒప్పందాలు కుదుర్చుకుంది. నివేదిక ప్రకారం.. కంపెనీ ఈ బ్యాంకులకు మొత్తం రుణాన్ని తిరిగి చెల్లించింది. ఫలితంగా రిలయన్స్ పవర్ ఇప్పుడు స్టాండలోన్ ప్రాతిపదికన రుణ రహిత సంస్థగా మారింది.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ ప్రస్తుతం 38 లక్షలకు పైగా రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యంతో రూ .4016 కోట్ల ఈక్విటీ బేస్‌ను కలిగి ఉంది. ఉత్తరప్రదేశ్ లోని 3960 మెగావాట్ల సాసన్ యూఎంపీపీ, 1200 మెగావాట్ల రోసా థర్మల్ పవర్ ప్లాంట్ తో సహా ఇది 5900 మెగావాట్ల ఆపరేటింగ్ కెపాసిటీని కలిగి ఉంది. 2008లో సుమారు రూ.260.78 వద్ద ట్రేడైన రిలయన్స్ పవర్ షేరు భారీ పతనం తర్వాత 2020 మార్చి 27న షేరు ధర రూ.1.13 వద్ద ముగిసింది.
కొన్నేళ్లుగా నెమ్మదిగా కోలుకుంటున్న అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ మరోసారి ట్రేడర్ల దృష్టిని ఆకర్షించింది. రిలయన్స్ పవర్ షేరు ప్రస్తుతం రూ.26.15 పైన ట్రేడవుతోంది. ఇది త్వరలోనే రూ.36 మార్కును చేరుకోవచ్చని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment