
రూ.2,796 కోట్ల బ్యాంకు మోసం కేసులో అనిల్ అంబానీ, ఇతరులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన ఛార్జిషీట్ తమ కార్యకలాపాలపై లేదా ఆర్థిక పనితీరుపై ఎటువంటి ప్రభావం చూపదని రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలిపింది. రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ (ఆర్సీఎఫ్ఎల్), రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (ఆర్హెచ్ఎఫ్ఎల్), యెస్ బ్యాంక్, యెస్ బ్యాంక్ మాజీ సీఈఓ రాణా కపూర్ కుటుంబానికి సంబంధించిన సంస్థల మధ్య మోసపూరిత లావాదేవీలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ ఇటీవల చార్జిషీట్ దాఖలు చేసింది.
2022, 2023లో సుప్రీంకోర్టు తీర్పుల తరువాత, ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంక్ ఆఫ్ బరోడా నేతృత్వంలోని స్వతంత్ర రుణదాత ఆధారిత ప్రక్రియల ద్వారా ఆర్సీఎఫ్ఎల్, ఆర్హెచ్ఎఫ్ఎల్కు సంబంధించిన సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయని రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండూ వేర్వేరు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ లో తెలిపాయి.
ఆర్సీఎఫ్ఎల్, ఆర్హెచ్ఎఫ్ఎల్ బోర్డుల్లో అనిల్ అంబానీ ఎప్పుడూ ఉండలేదని, మూడున్నరేళ్ల క్రితమే రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డుల నుంచి వైదొలిగారని కంపెనీలు తెలిపాయి. తాము ప్రత్యేక లిస్టెడ్ సంస్థలుగా ఉన్నామని, సీబీఐ చర్య తమ నిర్వహణ, పాలన లేదా ఆర్థిక స్థిరత్వంపై ఎటువంటి ప్రభావం చూపదని పేర్కొన్నాయి.