‘తుగ్లక్’ విధానం | pension problems to Older people | Sakshi
Sakshi News home page

‘తుగ్లక్’ విధానం

Published Thu, Jun 19 2014 2:47 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM

‘తుగ్లక్’ విధానం - Sakshi

‘తుగ్లక్’ విధానం

 అద్దంకి:  సమాజంలో ఆదరణ కోల్పోయిన వారికి ఆసరా కల్పించాల్సిన కనీస ధర్మం ప్రభుత్వాలకుంది. కానీ పేదలంటే పాలకులకు లెక్కలేదు. వారి జీవితాలంటే గౌరవం లేదు. కాస్తో కూస్తో కాళ్లమీద నిలబడేందుకు ఉపయోగపడే సామాజిక పింఛన్ల వ్యవహారంలో నిర్లక్ష్యం వహిస్తూ ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇటీవలే కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఎన్నో వాగ్దానాలు చేసింది. అవి ఎలాగున్నా.. కనీసం ముందునుంచి వస్తున్న పద్ధతులను కూడా గాడిలో పెట్టలేకపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు చేరే పింఛన్ల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారితే.. మళ్లీ దానిలో వేలు పెట్టి కలగాపులగం చేస్తోంది.
 
 గజిబిజీ..

 పింఛన్ల పంపిణీలో గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు విధానాలు మార్చడంతో లబ్ధిదారులు ముప్పతిప్పలు పడ్డారు. మొదట్లో పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో పంపిణీ జరిగేది. జనం దానికి అలవాటు పడేసమయానికి మళ్లీ మార్చి ఐకేపీ ఆధ్వర్యంలోని మండల సమాఖ్యలకు అప్పగించారు. వెంటనే ఫినో కంపెనీ ఏజెంట్లు లబ్ధిదారుల వద్దకు వెళ్లి నగదు అందించేవారు. దీనిని మళ్లీ మార్చి పోస్టాఫీసులకు బదలాయించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక మళ్లీ విధానంలో మార్పు వచ్చింది.

గ్రామాల్లోని పింఛనుదారుల ఖాతాలను పోస్టాఫీసుల్లోనే ఉంచుతూ.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని లబ్ధిదారులు మాత్రం ఐసీఐసీఐ బ్యాంకుల్లో తీసుకోవాలంటూ నిబంధనలు మార్చారు. దీంతో ఏం చేయాలో తెలియని పింఛనుదారులు మళ్లీ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వివరాలు ఎలా అందించాలో తెలియక కనపడినవారందరినీ అడుగుతున్నారు.
 
 ఓ ప్రహసనం

 పింఛను పొందాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. ప్రభుత్వం తరఫున పింఛను కార్డులుంటేనే సరిపోదు. వివిధ సంస్థలకు పింఛను వ్యవహారాన్ని బదలాయించినప్పుడల్లా లబ్ధిదారులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సిందే. ప్రతి సారీ వేలిముద్రలు ఇవ్వాలి. అలాగే రేషన్‌కార్డు, ఆధార్ కార్డు ఫొటోస్టాట్ కాపీలు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు ఆయా సంస్థలకు అందజేయాలి. ఇది ఖర్చుతో కూడుకున్నదే కాకుండా బోలెడంత శ్రమ పడాలి. ఇచ్చే *200 కోసం పడరాని పాట్లు పడితే కానీ సకాలంలో అందవు. లబ్ధిదారునిగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నా.. ప్రతి సారీ వివరాలు కావాలంటూ వేధించడంతో వికలాంగు లు, వృద్ధులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
 
సీన్‌లోకి ఐసీఐసీఐ ప్రతినిధులు
నూతన విధానం అమల్లోకి రావడంతో పింఛన్ల పంపిణీ ప్రక్రియను నగర పంచాయతీ నుంచి ఐసీఐసీఐ బ్యాంకుకు అప్పగించారంటూ.. బ్యాంకు రిసోర్స్ పర్సన్లు అద్దంకి పట్టణంలో బుధవారం దండోరా వేయించారు. పింఛనుదారులను నగరపంచాయతీ కార్యాలయానికి పిలిపించారు. యంత్రం సాయంతో వేలిముద్రలు తీసుకోవడం.. ఆధార్, రేషన్ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోలను సేకరించడం మొదలు పెట్టారు.
 
తప్పని పడిగాపులు
అద్దంకి పట్టణంలోని 20 వార్డులుండగా..  2,463 మంది వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్ దారులున్నారు. వీరికి నెలకు * 7,74,900 నగదు చెల్లిస్తున్నారు. అయితే రీ ఎంట్రీ అని చెప్పగానే వీరంతా ఒక్కసారిగా కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కానీ సిబ్బంది ఇద్దరే వివరాలు తీసుకోవడానికి రావడంతో వేలిముద్రలు సేకరించడంలో తీవ్ర జాప్యం నెలకొంది.

దీంతో పింఛనుదారులంతా ఎండలో గంటల తరబడి వేచి చూశారు. వీరికి కనీస వసతులు కల్పించలేదు. నీడలేదు.. మంచినీరు అందించలేదు.. కనీసం క్యూలైన్‌లు కూడా పాటించలేదు. ఈ దెబ్బకు తొక్కిసలాట జరిగింది. కొంతమంది కింద పడిపోయారు. భరించలేని వారు ఇళ్లకు వెళ్లిపోయారు. ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులు ఉషారాణి, శిరీష మాట్లాడుతూ తమ సంస్థ పింఛనుదారుల వివరాలు రీ ఎంట్రీ చేయమని కోరినట్లు తెలిపారు. అందుకే అందరినీ పిలిపించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement