న్యూఢిల్లీ: ఇకపై పోస్టాఫీసులు బ్యాంకులుగా మారనున్నాయి. 2017 మార్చి నాటికల్లా ఈప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖమంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రకటించారు. దేశంలో ప్రస్తుతం 1.54 లక్షల మంది పోస్టల్ అధికారులు ఉన్నారని, ఈ నెట్ వర్క్ ప్రపంచంలోనే అతి పెద్దదని వీటిని బ్యాంకులుగా మారిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే పెద్ద బ్యాంకింగ్ రంగం అవుతుందని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది 650 పోస్టాఫీసులను బ్యాంకులుగా మార్చి 5000 ఏటీఎంలను ఏర్పాటు చేస్తామన్నారు.
దీనికి సంబంధించిన ప్రణాళిక మూడేళ్లకు పూర్తవ్వాల్సి ఉన్నా, వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రధాన మంత్రి ఆదేశించారని మంత్రి తెలిపారు. ఇందుకోసం తొలివిడతగా రూ.400 కోట్లను కేటాయించనున్నారు. గ్రామీణ ప్రాంతంలో1.39 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో23,000 వేల పోస్టాఫీసులు సేవలందిస్తున్నాయి.