అకటా...! మళ్లీ కటకట
⇒ బ్యాంకుల్లో నిండుకున్న నగదు నిల్వలు
⇒ ఏటీఎంల వద్ద ‘నో క్యాష్’ బోర్డులు
⇒ నగదురహితం పేరిట ప్రభుత్వం గొప్పలు
⇒ పల్లెలు, పట్టణాల్లో సామాన్యుల ఇక్కట్లు
‘నో క్యాష్’ బోర్డులు...పొడవైన క్యూలు... బ్యాంకుల్లో పడిగాపులు... అయినా అందుబాటులోకి రాని నగదు...వెరసి అమరావతిలో మరో సారి నగదు కష్టాలు ముప్పిరిగొన్నాయి. మూడు నెలల పాటు నగదు కష్టాలతో అల్లాడిన సామాన్యులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నామని భావిస్తుండగా... అంతలోనే మరోసారి నగదు కొరత వచ్చిపడింది.
సాక్షి, అమరావతి బ్యూరో : బ్యాంకుల వద్ద నగదు నిల్వలు దాదాపు నిండుకోవడంతో సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు అమరావతి ప్రాంతాన్ని నగదు రహిత జిల్లాలుగా ప్రకటిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా తయారైంది.
నగదు కష్టాలు
రిజర్వు బ్యాంకు రాష్ట్రంలోని బ్యాంకులకు నగదు సరఫరాను గణనీయంగా తగ్గించివేసింది. నగదు రహిత లావాదేవీలవైపు ప్రజలను మళ్లించేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. అమరావతి పరిధిలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా తయారైంది. కృష్ణా జిల్లాలో 48 బ్యాంకులకు చెందిన 789 శాఖలు ఉండగా, గుంటూరు జిల్లాలో 42 బ్యాంకులకు చెందిన 795 శాఖలు ఉన్నాయి. దాదాపు అన్ని శాఖల్లోనూ కనీస స్థాయిలో కూడా నగదు నిల్వలు లేకుండా పోయాయి. కొత్తగా ప్రారంభించిన శాఖకు రోజువారీ లావాదేవీలకు కనీసం రూ.50లక్షలు అవసరం కాగా, 10 ఏళ్లకు పైబడిన శాఖలలో రోజుకు దాదాపు రూ.2కోట్ల వరకు లావాదేవీలు సాగుతాయి. ఇక గ్రామీణ బ్యాంకులకు రోజుకు కనీసం రూ.10లక్షల వరకు అవసరం. కానీ అందులో 25 శాతం నగదు నిల్వలు కూడా లేకుండాపోయాయి. దాంతో బ్యాంకుల్లో దాదాపు 75 శాతం లావాదేవీలు తగ్గిపోయాయి. డ్వాక్రా సంఘాలు, రైతులకు చెల్లింపులు నిలిపి వేశారు. ఖాతాదారులకు నగదు చెల్లింపులపై అనధికారికంగా పరిమితులు విధిస్తున్నారు.
నో క్యాష్ బోర్డులే ...
నగదు నిల్వలు లేకపోవడంతో ఏటీఎంల వద్ద ‘నో క్యాష్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో 928 ఏటీఎంలు, గుంటూరు జిల్లాలో 850 ఏటీఎంలు ఉన్నాయి. వాటిలో 80శాతం ఏటీఎంలలో నగదు నిల్వలు లేనేలేవు. విత్‌డ్రా కోసం ఖాతాదారులు పలు ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఒక్కో ఏటీఎంలో రోజుకు సగటున రూ.30లక్షలు ఉంచాలి. కానీ ప్రస్తుతం రూ.10లక్షలు కూడా అందుబాటులో ఉంచలేకపోతున్నారు.
13 నుంచి పరిస్థితి ఏమిటో...!?
ఈ నెల 13 నుంచి బ్యాంకుల్లో విత్‌డ్రాల మీద పరిమితి ఎత్తివేస్తామని రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుతం సేవింగ్స్ ఖాతా నుంచి రోజుకు రూ.50వేల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మార్చి 13 నుంచి ఆ పరిమితి తొలగిస్తామని చెప్పారు. అదే విధంగా ఏటీఎం నుంచి రోజుకు రూ.40వేలు విత్‌డ్రా చేసుకోవచ్చని కూడా ప్రకటించారు. కానీ ప్రస్తుతం నగదు నిల్వలు నిండుకోవడంతో ఆర్బీఐ ప్రకటించిన విధానం అమలయ్యే సూచనలు కనిపించడం లేదు.