'రికరింగ్'తో రిలీఫ్! | main sefty of rd account in sevings of money! | Sakshi
Sakshi News home page

'రికరింగ్'తో రిలీఫ్!

Published Mon, Jul 25 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

'రికరింగ్'తో రిలీఫ్!

'రికరింగ్'తో రిలీఫ్!

కొందరు రికరింగ్ డిపాజిట్ అనొచ్చు. మరికొందరు ఆర్‌డీ అనొచ్చు. ఎలా పిలిచినా... పొదుపు చేసేవారి జీవితంలో ఇది ఎప్పుడో ఒకప్పుడు తారసపడుతూనే ఉంటుంది. కాకపోతే ఈ సులువైన పొదుపు సాధనంలో ఉన్న ప్రయోజనాలు చాలామందికి తెలియవనే చెప్పాలి. వాటి పై అవగాహనే ఈ కథనం... నిజానికి ఆర్‌డీ అనేది ఈజీగా ఎంచుకునే పొదుపు సాధనం. నిర్దిష్ట కాలానికి, నిర్దిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా మదుపు చేసే సౌలభ్యం ఈ డిపాజిట్లో ఉంది. రెండేళ్లో, నాలుగేళ్లో... ఎంతో కొంత కాలాన్ని ముందే నిర్ణయించుకుని, అప్పటిదాకా నెలనెలా నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేస్తే...

ముందే నిర్ణయించిన రేటు మేరకు వడ్డీ అందుతుంది. ఉదాహరణకు నెలకు రూ.1,000 చొప్పున 24 నెలలు పొదుపుచేద్దామనుకుంటే బ్యాంకులో ఆర్‌డీ ఖాతా తెరవొచ్చు. ఎంచుకునే కాలాన్ని బట్టి వడ్డీరేటు దాదాపు 7.5 శాతం వరకూ ఉంది.

 
స్వల్ప మొత్తాల పొదుపునకు మెరుగైన సాధనం    
పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఈజీగా తెరవొచ్చు
ఆన్‌లైన్లోనూ సొంతగా తెరుచుకునే వీలు   
నిర్దిష్ట వ్యవధికి వడ్డీ గ్యారంటీ; నష్టభయం ఉండదు
స్వల్పకాలిక లక్ష్యాలకు ఆర్‌డీ మేలంటున్న నిపుణులు

 
స్వల్పకాలిక లక్ష్యాలంటే...?
కొత్తింటి కొనుగోలుకు కొంత డౌన్‌పేమెంట్ కావాలి. ఉంటున్న ఇంటికి మరమ్మతులు, అదనపు హంగులు కావాలంటే... రెండు మూడేళ్ల వ్యవధిలో ఇంట్లో వారికి పెళ్లి చేయాల్సి రావటం. సెలవుల్లో కుటుంబంతో కలసి విహార యాత్రకు వెళ్లటం ఖరీదైన స్మార్ట్ ఫోన్లు, మోటార్‌సైకిల్, కారు లేదా ఫ్రిజ్, టీవీ, వాషింగ్‌మెషీన్ల వంటి వైట్ గూడ్స్ కొనుగోలు
 
స్వల్పకాలిక లక్ష్యాలకు ఉత్తమం...
ఆర్‌డీ చాలా సురక్షితం. తప్పనిసరిగా రాబడులొస్తాయి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి సహజంగా విశ్లేషకులు చెప్పేదేంటంటే... 8 నుంచి 9 సంవత్సరాల్లో అవి మంచి ఫలితాలిస్తాయని. స్వల్పకాలంలో అయితే నష్టాలు రావొచ్చని హెచ్చరిస్తుంటారు. తప్పుడు షేర్లలో పెట్టుబడులు పెడితే లాభం కాదుకదా... అసలుకే ఎసరు రావొచ్చు. ఆర్‌డీతో అలాంటిదేమీ ఉండదు. మార్కెట్ రేటు రిటర్న్ గ్యారంటీ. దీన్నిబట్టి చూస్తే ఏడాది నుంచి మూడేళ్ల కాలానికి సంబంధించిన స్వల్పకాలిక లక్ష్యాలకు రికరింగ్ డిపాజిట్ ఉత్తమం. నిజానికి మనం దీర్ఘకాలిక పెట్టుబడుల గురించే ఆలోచిస్తుంటాం తప్ప... స్వల్పకాలం అవసరాలను గుర్తించం.

స్వల్ప మొత్తం... తేలిగ్గా పరి ష్కారం అయిపోతుం దిలే అనుకుంటాం. కానీ అక్కడే ఇబ్బంది పడతాం. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాల పెట్టుబడులకు సైతం అమాంతంగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది.
 
ఎలా బాగుంటుంది....
ఉదాహరణకు మీరు వచ్చే 18 నెలల్లో మూడు లక్ష్యాలు పెట్టుకున్నారు. అందులో రూ.20,000 ఫోన్, పాపకు రూ.30,000 చిన్న ఆభరణం. అబ్బాయి ఉన్నత విద్యకు తొలి విడత ఫీజు రూ. 25,000. వీటిని తేలిగ్గా చేరుకోడానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కాలానికి తగిన నెలవారీ చెల్లింపులతో మూడు ఆర్‌డీలను తెరిస్తే చాలు. అనుకున్నది సాధించొచ్చు. ఇంకో విషయమేంటంటే... ఆర్‌డీలు తెరిచాక తప్పనిసరిగా డబ్బు చెల్లించాలి కనుక... సహజంగానే మీరు పొదుపరులుగా మారిపోతారు. దుబారా తగ్గించుకుంటారు. ఖర్చులపై ఆచితూచి తీసుకునే నిర్ణయాలు... దీర్ఘకాలంలో చక్కని ఫలితాలనిస్తాయి.
 
అకౌంట్ తెరవడమూ కష్టం కాదు...
బ్యాంక్‌కు వెళ్లి... అకౌంట్ కాగితాలు తీసుకుని... పూర్తిచేయాల్సిన అవసరమేదీ ఇప్పుడు లేదు. ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ పేజీకి వెళ్లి... క్షణాల్లో అకౌంట్‌ను స్వయంగా తెరవొచ్చు. నెలవారీ ఎంత చెల్లించాలనుకుంటున్నారు? కాల వ్యవధి ఎంత? ఏ తేదీన మీ అకౌంట్ నుంచి డబ్బు తీసుకోవచ్చు? ఇలాంటివన్నీ ఆన్‌లైన్ అప్లికేషన్‌లోనే పూర్తిచేసేయొచ్చు. మరో విషయమేంటంటే... మీరు ఆర్‌డీలను ప్రత్యక్షంగా బ్యాంక్ అకౌంట్‌కే లింక్ చేసుకుంటే... నెలనెలా మీరు నగదు బదిలీ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిగ్గా మీ ఖాతా నుంచి డబ్బులు ఆర్‌డీకి జమ అయిపోతాయి.
 
వడ్డీపై పన్ను చెల్లించాల్సిందే...
వడ్డీపై గతంలో పన్ను మినహాయింపు ఉండేది. ఇపుడు లేదు. ఆర్‌డీ మొత్తానికి మాత్రం పన్ను మినహాయింపు ఉంటుంది. కొంత వడ్డీ కోతతో ఎప్పుడైనా మీ ఆర్‌డీని బ్రేక్ చేసుకునే వీలుంది. కొన్ని బ్యాంకుల్లో నెలవారీ డిపాజిట్ మొత్తాన్ని కొంత పెంచుకోవచ్చు కూడా. కాకపోతే తగ్గించడానికి వీలుపడదు. ఆర్‌డీ వడ్డీని చక్రగతిన మూడు నెలలకోసారి లెక్కిస్తారు. ఆర్‌డీలో నామినేషన్ సౌలభ్యం ఉంది. దీన్లో జమయిన మొత్తంపై 80 నుంచి 90 శాతం వరకూ రుణం కూడా తీసుకోవచ్చు.

పోస్టాఫీసుల విషయంలో ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి అకౌంట్‌ను మార్చుకోవచ్చు. ఇద్దరు పెద్దలు కలసి జాయింట్ అకౌంట్‌నూ తెరవొచ్చు. నెలలో నిర్దిష్ట కాలంలో డిపాజిట్ చెల్లించకపోతే రూ.5కు ఐదు పైసల జరిమానా ఉంటుంది. నాలుగు రెగ్యులర్ డిఫాల్ట్స్‌కు అనుమతి ఉంది. అలా జరిగితే రెండునెలల్లో డిపాజిట్‌ను పునరుద్ధరించుకోవచ్చు. లేదంటే తదుపరి డిపాజిట్ చెల్లించడానికి కుదరదు. కనీసం ఆరు విడతల డిపాజిట్లు ముందే కట్టేస్తే... రాయితీ లభిస్తుండడం మరో విశేషం. డిపాజిట్‌కు ఒకవేళ మీరు చెక్ ఇస్తే... ఆ మొత్తం ప్రభుత్వ ఖాతాలో పడిన తర్వాతే మీరు చెల్లింపులు జరిపినట్లుగా భావిస్తారు.
 
డిపాజిట్-కాలం.. కనీసం ఎంత?
రికరింగ్ డిపాజిట్‌లో నెలకు డిపాజిట్ చేయాల్సిన కనీస మొత్తం... కాల వ్యవధి బ్యాంకును బట్టి మారుతుంటాయి. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఆంధ్రాబ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనీసం రూ.100 తోనే ఆర్‌డీ ప్రారంభించవచ్చు. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ వంటి ప్రైవేటు బ్యాంకుల్లో ఈ మొత్తం కనీసం రూ.500 లేదా రూ.1,000గా ఉంది.  పోస్టాఫీసులో కనిష్టంగా రూ.10. గరిష్ట పరిమితి ఎక్కడా లేదు. ఇక కాల వ్యవధి ఆరు నెలల నుంచి  పదేళ్ల వరకూ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement