సేవింగ్స్ డిపాజిట్లకు తగ్గిన డిమాండ్
బ్యాంకులకు పెరిగిన వ్యయాలు
ఫలితంగా మార్జిన్లకు చిల్లు
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాల్లో సేవింగ్స్ డిపాజిట్లకు బదులు, అధిక రాబడినిచ్చే టర్మ్ డిపాజిట్లకే కస్టమర్లు మొగ్గు చూపిస్తున్నారు. ఫలితంగా బ్యాంకులకు నిధులపై వ్యయాలు పెరిగిపోయి, వాటి నికర వడ్డీ మార్జిన్లకు చిల్లు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఆర్‌బీఐ తాజా డేటా ప్రకారం.. ఐదు ప్రముఖ బ్యాంక్‌ల్లో సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటు 2.7–3 శాతం మధ్య ఉండగా, ఏడాది కాల టర్మ్ డిపాజిట్లపై అవే బ్యాంకులు 7.25 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.
2023–2024 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగం, అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే టర్మ్ డిపాజిట్ల రూపంలో 18.64 శాతం అధికంగా రూ.116 లక్షల కోట్లను సమీకరించాయి. అదే కాలంలో బ్యాంకుల సేవింగ్స్ డిపాజిట్లు కేవలం 6 శాతం పెరిగి రూ.63 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2022–23లో టర్మ్ డిపాజిట్లలో వృద్ధి 13.5 శాతంగా ఉంటే, సేవింగ్స్ డిపాజిట్లలో పరుగుదల 4.9 శాతంగానే ఉండడం గమనార్హం.
2021–22లో టర్మ్ డిపాజిట్లలో వృద్ధి 9.6 శాతంగానే ఉంది. అదే ఏడాది సేవింగ్స్ డిపాజిట్లు ఇంతకంటే అధికంగా 12.4 శాతం మేర పెరిగాయి. మొత్తం మీద 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ డిపాజిట్లు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 13.5 శాతం వృద్ధి చెందాయి. అంతకుముందు వరుస ఆర్థిక సంవత్సరాల్లో ఈ వృద్ధి వరుసగా 9.6 శాతం, 8.9 శాతం చొప్పున ఉంది.
అధిక రాబడుల కోసమే..
పొదుపు నుంచి టర్మ్ డిపాజిట్లకు పెట్టుబడుల మరళింపు స్పష్టంగా కనిపిస్తున్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. రేట్లు గరిష్ట స్థాయిలో ఉండడంతో టర్మ్ డిపాజిట్లలోకి పొదుపు నిధులు మళ్లించుకోవడం ద్వారా రాబడులను పెంచుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దేశంలో అతిపెద్ద బ్యాంక్ (డిపాజిట్లలో 22.6 శాతం వాటా) ఎస్‌బీఐ డిపాజిట్ బేస్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 11.13 శాతం వృద్ధితో రూ.49.16 లక్షల కోట్లకు చేరుకుంది.
‘‘2023–24లో వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో టర్మ్ డిపాజిట్లు 16.38 శాతం మేర వృద్ధి చెంది రూ.27.82 లక్షల కోట్లకు చేరాయి. కాసా డిపాజిట్లు (కరెంట్, సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు) 4.25 శాతం పెరిగి రూ.19.42 లక్షల కోట్లకు చేరాయి’’అని ఎస్‌బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల నుంచి డిపాజిట్లు కేవలం టర్మ్ డిపాజిట్లలోకే కాకుండా, ఇంకా మెరుగైన రాబడులు వచ్చే ఈక్విటీలు, ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాల్లోకి వెళుతున్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు.
గత రెండు సంవత్సరాలుగా బ్యాంకు రుణాల వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి తగ్గడానికి ఇదే కారణమని పేర్కొంటున్నారు. రుణాల వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి క్షీణించడం పట్ల ఆర్‌బీఐ సైతం ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. డిపాజిట్లు ఆకర్షించేందుకు బ్యాంకులు వినూత్నమైన మార్గాలను అన్వేíÙంచాలని సైతం ఆర్‌బీఐ సూచించింది. ‘‘బ్యాంక్‌లు డిపాజిటర్లను ఆకర్షించేందుకు మెరుగైన సంబంధాల దిశగా కృషి చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా వ్యాపార విధానాలు సైతం మారాల్సిందే. కేవలం డిపాజిట్ల స్వీకరణకే పరిమితం కాకుండా, సంపద నిర్వహణ సేవలు, క్లయింట్లతో పూర్తి సంబంధాల దిశగా వ్యవహరించాల్సిందే’’అని ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment