బ్యాంకులకే కఠిన నిబంధనలు
ఫండ్స్‌కు ఈ తరహా బంధనాల్లేవు
ఐబీఏ చైర్మన్ ఎంవీ రావు
ఇందుకు ఫండ్స్‌ను నిందించొద్దు
కోటక్ ఏఎంసీ చీఫ్ నీలేష్ షా
ముంబై: బ్యాంకుల నుంచి డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్, ఇతర సాధనాల వైపు మళ్లడానికి సులభతర నిబంధనలే కారణమని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చైర్మన్ ఎంవీ రావు వ్యాఖ్యానించారు. గడిచిన ఏడాది కాలంగా బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి నిదానించిన నేపథ్యంలో.. ఎఫ్‌ఐబీఏసీ వార్షిక సదస్సులో భాగంగా దీనిపై ఆసక్తికర చర్చ జరిగింది.
సెంట్రల్ బ్యాంక్ ఇండియా ఎండీ, సీఈవోగానూ వ్యవహరిస్తున్న ఎంవీ రావు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సులభతర నిబంధనల కారణంగా ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్స్ అధిక రాబడులు అందిస్తున్నాయని చెప్పారు. నిధుల నిర్వహణ విషయంలో బ్యాంకులపై ఎన్నో నియంత్రణలు ఉండగా.. మ్యూచువల్ ఫండ్స్‌కు అలాంటి నిబంధనలేవీ లేవన్నారు. ‘‘నిధులను అంతిమంగా ఎందుకు వినియోగిస్తున్నారో తనిఖీ చేయాల్సిన అవసరం మ్యూచువల్ ఫండ్స్‌కు లేదు.
మా వద్దే డిపాజిట్ చేయాలని కస్టమర్లను బ్యాకింగ్ రంగం నిర్దేశించలేదు. ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసే విషయంలో ఫండ్స్‌కు ఎలాంటి ప్రొవిజనింగ్ లేదు. కానీ ప్రామాణిక రుణ ఆస్తులకు సంబంధించి కూడా నిర్దేశిత మొత్తాన్ని బ్యాంక్‌లు పక్కన పెట్టాల్సి ఉంటుంది. 99 శాతం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి పరిశోధన చేయడం లేదు.
ఆరేడేళ్ల తర్వాత ఈ సైకిల్ తిరగబడితే అది వ్యవస్థాగత ముప్పుకు దారితీయవచ్చు. రానున్న రోజుల్లో డిపాజిటర్లు అధిక రాబడులు సొంతం చేసుకునేందుకు, దేశ వృద్ధికి కావాల్సిన ముడి సరుకు (నిధులు)ను బ్యాంక్‌లు పొందేందుకు ప్రభుత్వం, నియంత్రణ సంస్థల మధ్య చురుకైన భాగస్వామ్యం, చర్చ అవసరం’’అని రావు ఈ సమావేశంలో తన అభిప్రాయాలు వెల్లడించారు.
డిపాజిట్ల మందగమనం కారణాలు వేరే..
కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో, ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి సభ్యుడు కూడా అయిన నీలేష్ షా ఈ అభిప్రాయాలతో విభేదించారు. బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి నిదానించడానికి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమను ఎలా తప్పుబడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.
ప్రభుత్వ నిధులు సైతం బ్యాంకింగ్ నుంచి బయటకు వెళుతున్నాయని, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, నగదు పంపిణీ తదితర అంశాలను ఇందుకు కారణాలుగా ప్రస్తావించారు. ప్రభుత్వ బ్యాలన్స్‌లను (మిగులు నిధులు) బ్యాంకుల్లో ఉంచాలని ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ను తాను కోరినట్టు చెప్పారు. ఇలా చేసిన ప్రభుత్వం ఏటా రూ.12,000 కోట్ల ఆదాయం పొందొచ్చన్నారు. కాగా, రావు అభిప్రాయాలతో ఇదే సమావేశంలో పాల్గొన్న హెచ్‌ఎస్‌బీసీ హితేంద్ర దవే సేతం విభేదించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment