ఫిక్స్‌డ్ డిపాజిట్‌దారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI). ఇక నుంచి అన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల నుంచి మెచ్యూరిటీ కంటే ముందే డబ్బును తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు కోటి రూపాయల వరకు ఉన్న అన్ని బ్యాంకు డిపాజిట్లపై ముందస్తు మెచ్యూర్ విత్‌డ్రాలను తప్పనిసరిగా అనుమతించాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.
నాన్ కాలబుల్ (ముందస్తు ఉపసంహరణకు వీలు లేని) ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో ఆర్బీఐ గతంలోనే రూ.15 లక్షల వరకూ డిపాజిట్లను ముందస్తుగా ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.కోటి వరకూ పెంచింది. కాగా గతంలో ఈ ముందస్తు ఉపసంహరణకు వీలు లేని డిపాజిట్‌లపై అధిక వడ్డీ చెల్లించేందుకు బ్యాంకులను అనుమతించింది.
అధిక వడ్డీ రేటు వర్తించే సమయంలో మెచ్యూర్‌కు ముందు ఉపసంహరణ సౌకర్యం లేకుండా అధిక వడ్డీ రేట్లను అందించేలా బ్యాంకులను ఆర్బీఐ ప్రోత్సహించింది. వడ్డీ రేట్లు పెరిగితే కస్టమర్‌లు తమ డిపాజిట్లను ముందస్తుగా విత్‌డ్రా చేయరనేది ఆర్బీఐ ఉద్దేశం.
చిన్న పెట్టుబడిదారులను రక్షించడమే నాన్ కాలబుల్ డిపాజిట్లపై కనీస డిపాజిట్ల పరిమాణాన్ని పెంచడం వెనుక లక్ష్యం అని బ్యాంకర్లు భావిస్తున్నారు. ఈ డిపాజిట్లపై బ్యాంకులు 25 నుంచి 30 బేసిస్ పాయింట్లు అధికంగా రాబడిని అందిస్తాయి. అధిక విలువ కలిగిన డిపాజిట్లకు రాబడి ఎక్కువగా ఉంటుంది.
ఇక గ్రామీణ బ్యాంకులకు బల్క్ డిపాజిట్ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 1 కోటికి పెంచుతూ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్బీఐ. అంటే రూ. 1 కోటి కంటే ఎక్కువ డిపాజిట్లపై మాత్రమే బ్యాంకులు డిఫరెన్షియల్ రేట్లను అందించగలవు.
Comments
Please login to add a commentAdd a comment