అధిక వడ్డీ తిరిగి ఇచ్చేయండి  | Minister Harish Rao Raps Banks For Collecting Excess Interest From SHGs | Sakshi
Sakshi News home page

అధిక వడ్డీ తిరిగి ఇచ్చేయండి 

Published Sat, Dec 24 2022 2:45 AM | Last Updated on Sat, Dec 24 2022 2:56 PM

Minister Harish Rao Raps Banks For Collecting Excess Interest From SHGs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీలు) నుంచి నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వసూలు చేసిన సొమ్మును వడ్డీతో సహా నెలరోజుల్లో చెల్లించాలని బ్యాంకర్లను ఆర్థిక, వైద్యశాఖల మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. భారత రిజర్వ్‌బ్యాంక్‌ మార్గదర్శకాల ప్రకారమే ఎస్‌హెచ్‌జీల రుణాలకు వడ్డీ రేటు అమలు చేయాలని స్పష్టం చేశారు.

శుక్రవారం ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ 35వ సమీక్షాసమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, గృహ సంబంధ, వ్యవసాయ, అనుబంధ ప్రభుత్వ ప్రాధాన్య రంగాలకు రుణాలు ఎక్కువగా ఇచ్చి, ప్రజల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనతో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఆయిల్‌ సాగుకు రుణాలు ఎక్కువగా ఇవ్వాలన్నారు.  

కొన్ని బ్యాంకులు అధిక వడ్డీ వసూలు... 
ఎస్‌హెచ్‌జీలు పూర్తిస్థాయిలో వడ్డీలు చెల్లిస్తున్నా కొన్ని బ్యాంకులు మాత్రం అధికంగా వడ్డీ వసూలు చేస్తున్నాయని మంత్రి చెప్పారు. నిబంధనల ప్రకారం రూ.3లక్షల లోపు రుణాలకు 7శాతం, రూ. 3లక్షల నుంచి రూ.5లక్షల దాకా 10శాతం వడ్డీ రేటు అమలు చేయాలని సూచించారు. బ్యాంకులు ప్రాసెసింగ్‌ ఫీజు, ఇన్సె్పక్షన్, పోర్ట్‌ ఫోలియో వంటి సేవల పేరుతో రూ.500 నుంచి రూ.5000 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు.

ఎస్‌హెచ్‌జీల రుణాలకు బ్యాంకులు చార్జీలను వసూలు చేయడంలో ఎలాంటి అర్థం లేదన్నారు. మొబిలైజేషన్, ఇతర సేవలను విలేజ్‌ ఆర్గనైజర్లు (వీవోలు) నిర్వహిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. అందువల్ల బ్యాంకర్లు వడ్డీల్లో కొంత భాగం వీవోలు, ఎంఎస్‌(మండల సమాఖ్య), జెడ్‌ఎస్‌ (జిల్లా సమాఖ్య)లకు ఇవ్వాలని ఆయన సూచించారు. ఆర్థిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రామకృష్ణారావు, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ డేబశిష్‌ మిత్రా, ఎస్‌ఎల్‌బీసీ ప్రెసిడెంట్‌ అమిత్‌ జింగ్రాన్, నాబార్డ్‌ సీజీఎం చింతల సుశీల, ఆర్‌బీఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ కెఎస్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement