సాక్షి, అమరావతి : అవును.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా పక్షపాతే. ‘ఈనాడు’ తనకు నచ్చలేదని ‘పచ్చ’వాతం జబ్బుతో తప్పుడు రాతలు రాస్తే కాకుండాపోతారా! డ్వాక్రా (పొదుపు సంఘాల) మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చాక పైసా విదల్చకుండా రాష్ట్రంలో మహిళలను మోసం చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు. డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని, ఎవ్వరూ పైసా కట్టొద్దంటూ 2014 ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీని నమ్మి మహిళలు ఓట్లేశారు.
అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన మోసానికి బలైన పేదింటి మహిళలు వారు తీసుకున్న రుణాలపై ఐదేళ్ల పాటు వడ్డీలపై వడ్డీలు కట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11 నాటికి మహిళల పేరిట ఉండే పొదుపు సంఘాల రుణాల మొత్తం రూ. 25,571 కోట్లు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా నాలుగు విడతల్లో నేరుగా ఆ మహిళలకు చెల్లిస్తున్నారు.
ఇంకొకటి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అమలులో ఉన్న పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తిగా మంగళం పాడేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించారు. గత నాలుగేళ్లుగా సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళల వడ్డీని ఏ ఏడాదికి ఆ ఏడాదే వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో రూ. 4,969.05 కోట్లు వడ్డీని చెల్లించి, అక్కచెల్లెమ్మలపై భారాన్ని తగ్గించారు సీఎం వైఎస్ జగన్.
అడుగడుగునా వంచించిన చంద్రబాబును మహిళా వ్యతిరేకిగా, అన్ని విధాలుగా ఆదుకొంటున్న సీఎం వైఎస్ జగన్ సర్కారును మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఆ పేద మహిళలు ఎందుకు భావించకుండా ఉంటారు? డ్వాక్రా రుణాల మాఫీ, సున్నా వడ్డీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పి, అక్కచెల్లెమ్మలను మోసం చేసిన వైనాన్ని ఏ రోజూ ప్రశ్నించలేని ‘ఈనాడు’ పత్రిక.., ఇప్పుడు ఇచ్చిన హామీలను క్రమం తప్పకుండా అమలు చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిపై బురదజల్లడమే పనిగా పెట్టుకొంది.
ఈనాడు ఆరోపణ: డ్వాక్రా సున్నా వడ్డీ కోత. టీడీపీ ప్రభుత్వంలో రూ. 5 లక్షల రుణం వరకు వర్తింపు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే రూ. 3 లక్షలకు కుదింపు.
వాస్తవం: సున్నా వడ్డీ పథకానికి గత చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మంగళం పాడేసింది. 2016 ఆగస్టు తర్వాత సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళలెవరికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ డబ్బు చెల్లించలేదు. మొత్తం ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు చివరి మూడేళ్లు పథకాన్ని చంద్రబాబు సర్కారు నిలిపివేసింది. టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిన పథకానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కోత పెట్టిందని రాయడం ‘ఈనాడు’ ప్రజలను వంచించడమే.
ఆరోపణ: జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రుణ పరిమితిని తగ్గించింది
వాస్తవం: వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమం తప్పకుండా సున్నా వడ్డీ సొమ్ము చెల్లిస్తుండటంతో గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారాయి. మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులు 18.36 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గిపోయాయి. గత ప్రభుత్వంలో సి, డి గ్రేడ్‌లోకి దిగజారిన సంఘాలు జగనన్న ప్రభుత్వ సహకారంతో తిరిగి ఎ, బి‘ గ్రేడ్ లోకి చేరాయి. మరోవైపు గత నాలుగేళ్లుగా ఏటా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారుల సంఖ్య కూడా పెరుగుతోంది.
ఆరోపణ: సున్నా వడ్డీ పథకంలోనూ కేంద్రం వాటా ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సాయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు.
వాస్తవం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఈ నాలుగు సంవత్స రాలలో ఇచ్చిన మాట ప్రకారం మహిళా సంఘాలు బ్యాంకులకు కట్టవ లసిన వడ్డీని వారి తరపున ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటివరకు 1.05 కోట్ల మంది పేరిట ఉన్న 9.76 లక్షల పొదుపు సంఘాల రుణాలకు రూ.4,969.05 కోట్లు వడ్డీ భారం ఆ పేద మహిళల నెత్తిన పడకుండా ప్రభుత్వమే పూర్తిగా చెల్లించింది. రాష్ట్రంలోని పేద మహిళలపై ఒక్క పైసా భారం వేయలేదు.
ఆరోపణ: గత ప్రభుత్వం మహిళలకు చెల్లించాల్సిన బకాయిలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టేయడం మహిళాపక్షపాతమా?
వాస్తవం: గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీకి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పులు మొత్తం సుమారు రూ. 25,571 కోట్లు. ఆ మొత్తాన్ని నాలుగు విడతల్లో ఆయా మహిళలందరికీ చెల్లించేలా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ‘వైఎస్సార్ ఆసరా’ పథకం అమలు చేస్తోంది. అంటే, చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే బేషరతుగా మాఫీ చేస్తానన్న రూ. 14 వేల కోట్ల అప్పులు, ఆ తర్వాత ఐదేళ్లలో వడ్డీలపై వడ్డీలు పెరిగి 2019 ఎన్నికల నాటికి ఆ ఆప్పుల మొత్తం రూ. 25,571 కోట్లు అయ్యాయి.
ఈ మొత్తం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పేద మహిళలను మోసం చేసి ఎగ్గొట్టిందే. ఇందులో డ్వాక్రా మహిళల రుణ మొత్తాలతో పాటు ఆ ఐదేళ్లలో మహిళలపై వడ్డీ రూపంలో పెరిగిన అదనపు భారం కూడా ఉంది. సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పుల మొత్తం రూ. 25,571 కోట్లకు గాను ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,178 కోట్లు చెల్లించింది. అలాంటప్పుడు.. గత ప్రభుత్వం మహిళలకు చెల్లించాల్సిన బకాయిలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టేసిందన్న ఆరోపణే అబద్ధం. అయినా, రూ.2100 కోట్లు బకాయిలు ఎగవేత అని ప్రచురించడం లో ‘ఈనాడు’కున్న ‘పచ్చ’వాతం జబ్బును తెలియజేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment