సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ ఇకపై పోస్టాఫీసుల్లోనూ లభించనున్నాయి. ప్రజలు మరింత సులభంగా స్టాంప్ పేపర్స్ పొందేందుకు వీలుగా పోస్టాఫీసుల్లో కూడా వీటిని విక్రయించాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే పోస్టల్ శాఖతో ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.10, రూ.20, రూ.50, రూ.100 డినామినేషన్ల స్టాంప్ పేపర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,952 మంది లైసెన్సు పొందిన స్టాంప్ వెండార్స్ ప్రజలకు వీటిని అమ్ముతున్నారు. కొన్నిసార్లు ఈ స్టాంప్ పేపర్స్‌కు కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా వీటికి డిమాండ్ పెంచి.. బ్లాక్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. దీనికితోడు స్టాంప్ వెండార్స్ అన్ని జిల్లాల్లో ఒకే సంఖ్యలో లేకపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో స్టాంప్ పేపర్స్ కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు సులభంగా స్టాంప్ పేపర్స్ పొందేందుకు పోస్టాఫీసులే సరైన మార్గమని రిజిస్ట్రేషన్ల శాఖ భావించి అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది.
తొలుత మండల స్థాయి పోస్టాఫీసుల్లో..
రాష్ట్రంలో ప్రస్తుతం మండల స్థాయిలో 1,568 పోస్టాఫీసులున్నాయి. ప్రతి మండలంలో 2 నుంచి 3 పోస్టాఫీసులు పనిచేస్తున్నాయి. ఇవికాకుండా గ్రామ స్థాయిలో 10 వేలకుపైగా పోస్టాఫీసులున్నాయి. ప్రస్తుతం మండల స్థాయి పోస్టాఫీసుల్లో స్టాంప్ పేపర్స్ అమ్మకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి దశలో 700 పోస్టాఫీసులకు రిజిస్ట్రేషన్ల శాఖ స్టాంప్ పేపర్స్ విక్రయించే లైసెన్సులు మంజూరు చేసింది. రెండో దశలో మిగిలిన 868 పోస్టాఫీసులకు లైసెన్సులు ఇస్తారు. మూడో దశలో గ్రామస్థాయి పోస్టాఫీసుల్లో విక్రయానికి పెట్టనున్నారు. రూ.15 కోట్ల విలువైన స్టాంప్ పేపర్స్ ఒకటి, రెండు దశల్లో పోస్టాఫీసుల ద్వారా అమ్మకానికి పెట్టాలని నిర్ణయించారు.
ఇక కొరత ఉండదు..
నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్‌ను మరింత సులభంగా ప్రజలు తీసుకునేందుకు వీలుగా పోస్టాఫీసులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మొదట మండల స్థాయి పోస్టాఫీసుల్లో అమ్మకాలు ప్రారంభిస్తాం. ఆ తర్వాత వీలును బట్టి గ్రామ స్థాయి పోస్టాఫీసుల్లో అమ్మకాలు జరిపే అంశాన్ని పరిశీలిస్తాం. దీనివల్ల స్టాంప్ పేపర్ల కొరత ఉండదు. అమ్మకాలు సులభంగా మారి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది.
- ఎంవీ శేషగిరిబాబు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment