non judicial stamp papers
-
హైదరాబాద్: స్టాంప్ పేపర్లు కావలెను!
సాక్షి, హైదరాబాద్: మహా నగరంలో రూ.20 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లకు కొరత ఏర్పడింది. విద్యార్థుల స్కాలర్షిప్ దరఖాస్తులతో పాటు వివిధ ధృవీకరణలు, న్యాయపరమైన లావాదేవీలకు అత్యధికంగా వినియోగించే రూ.20 స్టాంప్ పేపర్ల పంపిణీ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి నిలిచిపోయింది. జిల్లా రిజిస్ట్రేటర్ ఆఫీసులతో పాటు సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో సైతం నిల్వలేకుండా పోయింది. నగరంలో కేవలం ఏడు ఆఫీసుల్లో మాత్రం నామమాత్రంగా స్టాక్ ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్టాంప్ వెండర్స్ వద్ద పాత స్టాక్ ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటికే రూ.100 స్టాంప్ పేపర్లు సైతం కొరత వెంటాడుతోంది. డిమాండ్ ఉన్నా స్టాక్ లేకుండా పోయింది. ఇండెంట్‌పై అనాసక్తి స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్ల శాఖ నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల ఇండెంట్‌పై ఆసక్తి చూపడం లేదు. నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లకు డిమాండ్ ఉన్నప్పటికీ నాసిక్ ముద్రణాలయానికి ఇండెంట్ పెట్టకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కాగ కొరత కారణంగా బహిరంగ మార్కెట్లో పాత స్టాక్‌కు డిమాండ్ పెరిగినట్లయింది. నాసిక్‌లోనే ముద్రణ మహారాష్ట్రలోని నాసిక్ ముద్రణాలయంలో నాన్ జ్యుడీషియల్, రెవెన్యూ స్టాంపులు ముద్రిస్తారు. స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్ల శాఖ నాసిక్ ముద్రణాలయానికి అవసరమైనంత ఇండెంట్ పంపించి నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లను తెప్పిస్తోంది. జిల్లా రిజిస్ట్రార్ల ఇండెంట్ ప్రకారం వాటిని సరఫరా చేస్తోంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ నాసిక్ నుంచి స్టాక్ తెప్పించిన ప్రతిసారి ముందస్తుగా 20 శాతం వరకు సరుకు నిల్వ చేసి మిగితాది జిల్లా రిజి్రస్టార్లకు సరఫరా చేస్తోంది. స్టాక్ అయిపోక ముందే ఇండెంట్ పెట్టి తెప్పించుకోవడం ఆనవాయితీ. తాజాగా స్టాక్ పూర్తయినా ఇండెంట్ ఊసే లేకుండా పోయింది. గ్రేటర్లో రూ.20 విలువగల నాన్ జ్యుడీషియల్ స్టాంప్స్ స్టాక్ ఇలా.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ స్టాక్ హైదరాబాద్ ఆర్వో 262 కూకట్పల్లి 3000 బాలానగర్ 146 శామీర్ పేట 400 కీసర 437 చేవేళ్ల 1717 ఇబ్రహీంపట్నం 13 -
పోస్టాఫీసుల్లోనూ స్టాంప్ పేపర్ల అమ్మకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ ఇకపై పోస్టాఫీసుల్లోనూ లభించనున్నాయి. ప్రజలు మరింత సులభంగా స్టాంప్ పేపర్స్ పొందేందుకు వీలుగా పోస్టాఫీసుల్లో కూడా వీటిని విక్రయించాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే పోస్టల్ శాఖతో ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.10, రూ.20, రూ.50, రూ.100 డినామినేషన్ల స్టాంప్ పేపర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,952 మంది లైసెన్సు పొందిన స్టాంప్ వెండార్స్ ప్రజలకు వీటిని అమ్ముతున్నారు. కొన్నిసార్లు ఈ స్టాంప్ పేపర్స్‌కు కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా వీటికి డిమాండ్ పెంచి.. బ్లాక్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. దీనికితోడు స్టాంప్ వెండార్స్ అన్ని జిల్లాల్లో ఒకే సంఖ్యలో లేకపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో స్టాంప్ పేపర్స్ కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు సులభంగా స్టాంప్ పేపర్స్ పొందేందుకు పోస్టాఫీసులే సరైన మార్గమని రిజిస్ట్రేషన్ల శాఖ భావించి అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది. తొలుత మండల స్థాయి పోస్టాఫీసుల్లో.. రాష్ట్రంలో ప్రస్తుతం మండల స్థాయిలో 1,568 పోస్టాఫీసులున్నాయి. ప్రతి మండలంలో 2 నుంచి 3 పోస్టాఫీసులు పనిచేస్తున్నాయి. ఇవికాకుండా గ్రామ స్థాయిలో 10 వేలకుపైగా పోస్టాఫీసులున్నాయి. ప్రస్తుతం మండల స్థాయి పోస్టాఫీసుల్లో స్టాంప్ పేపర్స్ అమ్మకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి దశలో 700 పోస్టాఫీసులకు రిజిస్ట్రేషన్ల శాఖ స్టాంప్ పేపర్స్ విక్రయించే లైసెన్సులు మంజూరు చేసింది. రెండో దశలో మిగిలిన 868 పోస్టాఫీసులకు లైసెన్సులు ఇస్తారు. మూడో దశలో గ్రామస్థాయి పోస్టాఫీసుల్లో విక్రయానికి పెట్టనున్నారు. రూ.15 కోట్ల విలువైన స్టాంప్ పేపర్స్ ఒకటి, రెండు దశల్లో పోస్టాఫీసుల ద్వారా అమ్మకానికి పెట్టాలని నిర్ణయించారు. ఇక కొరత ఉండదు.. నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్‌ను మరింత సులభంగా ప్రజలు తీసుకునేందుకు వీలుగా పోస్టాఫీసులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మొదట మండల స్థాయి పోస్టాఫీసుల్లో అమ్మకాలు ప్రారంభిస్తాం. ఆ తర్వాత వీలును బట్టి గ్రామ స్థాయి పోస్టాఫీసుల్లో అమ్మకాలు జరిపే అంశాన్ని పరిశీలిస్తాం. దీనివల్ల స్టాంప్ పేపర్ల కొరత ఉండదు. అమ్మకాలు సులభంగా మారి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. - ఎంవీ శేషగిరిబాబు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ -
నిల్వలు నిల్!
జిల్లాలో రూ. 50, రూ.100 విలువైన నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల కొరత ఏర్పడింది. విజయవాడ సహా అన్ని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ సమస్య వేధిస్తోంది. స్టాంప్ వెండర్ల వద్ద కూడా నిల్వలు నిండుకోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా స్థిర, చరాస్థుల లావాదేవీలు చాలా వరకు తగ్గాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా అధికారులు ఫ్రాంక్లింగ్ మెషిన్‌తో స్టాంపు వేసి ప్రస్తుత అవసరాలకు వినియోగిస్తున్నారు. సాక్షి, అమరావతి: రిజి్రస్టేషన్ల శాఖ జిల్లాలోని సబ్ రిజి్రస్టార్ కార్యాలయాలు, లైసెన్స్డ్ స్టాంపు వెండర్స్ ద్వారా దస్తావేజు పత్రాలు విక్రయిస్తుంది. ఈ స్టాంపు పత్రాలపైనే క్రయ, విక్రయ లావాదేవీలను రాసుకుని రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజి్రస్టేషన్లు చేయిస్తారు. అనామతుగానూ, బయానాగా ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలను సైతం ఈ పత్రాలపై రాసుకుంటుంటారు. ఎక్కువగా రూ.10, రూ. 20, రూ.50, రూ.100 ముఖ విలువతో స్టాంపు పత్రాలు వినియోగిస్తుంటారు. నెలకు రూ.35 లక్షల విక్రయాలు జిల్లాల్లో 28 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. అన్ని కార్యాలయలతో పాటు లైసెన్స్డ్ స్టాంప్ వెండర్స్ కూడా స్టాంపులు విక్రయిస్తారు. నెలకు సరాసరిన జిల్లాలో రూ.35 లక్షల విలువైన స్టాంపు పత్రాలు అమ్ముడవుతుంటాయి. వీటిలో రూ.50, రూ.100ల స్టాంపులు ఎక్కువగా గిరాకీ ఉంటుంది. నాసిక్‌లో ముద్రణ స్టాంపు పత్రాలు అధికారిక రాజ ముద్రతో మహారాష్ట్ర నాసిక్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ముద్రణాలయంలో ముద్రిస్తారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటికి ఈ ముద్రణా కేంద్రం నుంచే స్టాంపు పేపర్లు సరఫరా అవుతుంటాయి. ఎన్నికల ముందు నుంచి రాష్ట్రానికి సరిపడా స్టాంపు పత్రాలు ఆ కేంద్రం నుంచి రావటం లేదు. దీంతో కొన్ని రోజులుగా స్టాంపు పత్రాల కొరత తీవ్రమైంది. ఫలితంగా లావాదేవీలు నిలిచిపోతున్నాయి. రూ.100 విలువైన స్టాంపు పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా కొరత ఉన్నట్లు సమాచారం. రాజధాని నగరం విజయవాడలో కొంత మేరకు రూ.10, రూ.20 విలువైన స్టాంపు పత్రాలు లభిస్తుండగా రూ.50, రూ.100ల స్టాంపు పత్రాలు కొరత వేధిస్తోంది. గన్నవరం, నూజివీడు సబ్‌రిజిస్ట్రార్ వంటి గ్రామీణ ప్రాంత కార్యాలయాల్లో కొంతమేర లభిస్తుండటంతో నగర ప్రజలు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఫ్రాంకింగ్ మెషిన్... ప్రభుత్వం రూ.10, రూ.20, రూ.50, రూ.100 ముఖ విలువతోనే స్టాంపు పత్రాలు విక్రయిస్తోంది. స్టాంపు డ్యూటీ ఎక్కువ మొత్తంలో అంటే ఉదాహరణకు రూ.10వేలు అంతకు మించిన విలువ మేరకు పత్రాలు కొనుగోలు చేయాలంటే స్టాంపు పత్రాలు పెద్ద సంఖ్యలో కావాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయంగా ఫ్రాంకింగ్ మెషిన్‌ను వినియోగిస్తున్నారు. ఒక తెల్లకాగితంపై కావాల్సినంత విలువను ముద్రించి ఇస్తారు. ఒక్క కాగితంపైనే ఒప్పందం రాసుకునేవారు ఈ విధానంలో పెద్ద మొత్తానికి తగిన విధంగా ఫ్రాంకింగ్ మిషన్ వినియోగిస్తారు. ఈ యంత్రాలు రిజి్రస్టార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. కొంతమంది లైసెన్స్డ్ వెండర్ల దగ్గరా ఈ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్రాంకింగ్ యంత్రం వినియోగించి ముద్రించిన విలువకు సమానమైన నగదు వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్టాంపు పేపర్లు అందుబాటులో లేకపోవటంతో వీటిని ఉపయోగిస్తున్నారు. లావాదేవీలకు కష్టం... లావాదేవీల్లో చట్టపరమైనవే కాక కొన్ని అనధికారికంగా కూడా నడుస్తుంటాయి. అటువంటి వ్యవహారాలు ఫ్రాంకింన్ మెషిన్‌తో స్టాంపు విలువ ముద్రించుకోవటం వీలుపడదు. ఇటువంటి వ్యవహారాలకు స్టాంపుల కొరత తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. ఇటువంటి వారి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉన్న అరకొర పత్రాలను బ్లాక్‌లో కొందరు బ్రోకర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రూ.100 విలువ చేసే పత్రాలను విజయవాడ గాం«దీనగర్ సబరిజి్రస్టార్ కార్యాలయ పరిధిలో ఏకంగా రూ.150 నుంచి రూ.180ల దాకా అమ్ముతున్నారని ఓ వినియోగదారుడు వాపోయారు. కొరత లేకుండా చేస్తున్నాం.. కొన్ని ప్రాంతాల్లో స్టాంపుల కొరత ఉన్న మాట వాస్తవమే. ఆయా చోట్ల యుద్ధ ప్రాతిపాదికన అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే విజయవాడ గాం«దీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి కావాల్సిన స్టాంపులను పంపాం. జిల్లాలో అవసరమున్న చోట్లకు మిగులుగా ఉన్న ప్రాంతాలను నుంచి సర్దుబాటు చేసే కార్యక్రమం జరుగుతోంది. – శ్రీనివాస మూర్తి, డీఐజీ, రిజిస్ట్రేషన్ శాఖ, కృష్ణా జిల్లా -
నిల్వలు నిల్
సాక్షి, సిటీబ్యూరో: వంద రూపాయల విలువైన నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల కొరత ఏర్పడింది. రెండు మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రూ.100 స్టాంప్‌ల విక్రయాలు పూర్తిగా ఆగిపోయాయి. ఫలితంగా బహిరంగ మార్కెట్లో నాన్ జ్యుడీషియల్ స్టాంప్ ధర రెండు నుంచి మూడు రేట్లు అధికంగా పలుకుతోంది. నాసిక్ ముద్రణాలయం నుంచి స్టాంప్‌ల సరఫరా నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్ శాఖ స్టాంప్ డిపోల్లో నిల్వలు లేకుండా పోయాయి. ఫలితంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రెవెన్యూ స్టాంపుల కొరత తీవ్రంగా నెలకొంది. స్థిరాస్తి క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్, ఇతరత్రా లావాదేవీలకు అధికంగా రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లను అధికంగా వినియోగిస్తారు. దీంతో డిమాండ్ అధికంగా ఉంటోంది. రూ.20, రూ.50ల నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు సరఫరా విరివిగా ఉన్నప్పటికి రూ.100 స్టాంప్ పేపర్లపై దస్తావేజుదారులు అధికంగా ఆసక్తి కనబరుస్తారు. గత మూడు నెలలుగా వీటి సరఫరా లేకపోవడంతో మార్కెట్లో కొంత పాత స్టాక్‌కు డిమాండ్ పెరిగినట్లయింది. నాసిక్‌లోనే ముద్రణ.. మహారాష్ట్రలోని నాసిక్ ముద్రణాలయంలో నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లు, రెవెన్యూ స్టాంపులు ముద్రిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఈ ముద్రణాలయం నుంచి వీటిని కొనుగోలు చేస్తోంది. నాసిక్ ముద్రణాలయానికి అవసరమైనంత ఇండెంట్ పంపించి నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లను తెప్పిస్తోంది. జిల్లా రిజిస్ట్రార్ల ఇండెంట్ ప్రకారం వాటిని సరఫరా చేస్తోంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ నాసిక్ నుంచి స్టాక్ తెప్పించిన ప్రతిసారీ ముందస్తుగా 20 శాతం వరకు సరుకు నిల్వ చేసి మిగితా జిల్లా రిజిస్టార్, పోస్టల్ శాఖలకు సరఫరా చేస్తోంది. జిల్లా రిజిస్టార్ ఆఫీస్ కూడా స్టాంప్ డిపోలో కొంత స్టాక్ రిజర్వ్డ్ చేసుకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ఇండెంట్ డిమాండ్ మేరకు పంపిణీ చేస్తోంది. స్టాక్ ముగియక ముందే ఇండెంట్ పెట్టి తెప్పించుకోవడం ఆనవాయితీ. ఇండెంట్‌కు స్టాక్ సరఫరా కాకపోవడంతో రిజర్వ్డ్ నిల్వలు సైతం పూర్తిగా వినియోగించినట్లు తెలుస్తోంది. సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు.. పోస్టాఫీసులకు సైతం రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల సరఫరా నిలిచిపోయింది. వాస్తవంగా మూడేళ్లక్రితం పోస్టాఫీసుల ద్వారా కూడా నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో పోస్టల్ శాఖ రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పదం మేరకు కమిషన్‌పై జ్యుడీషియల్ స్టాంప్‌లను పోస్టాఫీసుల్లో విక్రయాలకు సిద్ధమైంది. జనరల్ పోస్టాఫీసులు ప్రతి మూణ్నెల్లకోసారి ఇండెంట్ పెట్టి రిజిస్ట్రేషన్ శాఖ నుంచి నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లను కొనుగోలు చేస్తూ వచ్చాయి. రిజిస్ట్రేషన్ శాఖకు నాసిక్ నుంచి ఇండెంట్వచ్చిన తర్వాత హైదరాబాద్‌లోని సర్కిల్ స్టాంప్ డిపోకు అందిస్తోంది. అక్కడి నుంచి ప్రధాన పోస్టాఫీసుల డిమాండ్ మేరకు సరఫరా అవుతోంది. ప్రధాన పోస్టాఫీసుల నుంచి సబ్ పోస్టాఫీసులకు అక్కడి నుంచి కిందిæ పోస్టాఫీసులకు సరఫరా అవుతాయి. గత మూడు నెలల నుంచి సరఫరా లేకపోవడంతో రూ.100 స్టాంప్లకు కొరత ఏర్పడింది. బహిరంగ మార్కెట్లో మాత్రం వ్యాపారులు పాత స్టాక్‌తో సొమ్ము చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మాత్రం రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌ల కోసం ఇండెంట్ పెట్టామని ఇంకా స్టాక్ రాలేదని స్పష్టం చేస్తున్నారు. స్టాక్ లేదంటున్నారు... సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల స్టాక్ లేదంటున్నారు. జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసుకు ఇండెంట్ పెట్టినా సరఫరా కాలేదంటున్నారు. స్థిరాస్తి నమోదు అధికంగా రూ. 100 స్టాంప్‌లు అధికంగా వినియోగంలోకి వస్తాయి. దస్తావేజుదారులు సైతం ఎక్కువగా మొగ్గు చూపుతారు. రూ.50 పత్రాలపై దస్తావేజులు చేయించేందుకు అసక్తి కనబర్చరు. దీంతో తీవ్ర కొరతగా ఉంది. వెంటనే రిజిస్ట్రేషన్ శాఖ రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లను తెప్పించాలి. – అర్జున్, స్టాంప్ అండ్ వెండర్, కొత్తపేట -
పోస్టాఫీసుల్లో ఇక నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పోస్టాఫీసుల్లో నవంబర్ తొలివారం నుంచి నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లనూ అందుబాటులో ఉంచనున్నట్లు తపాలా శాఖ చీఫ్‌పోస్టుమాస్టర్ జనరల్ (సీపీఎంజీ) బి.వి సుధాకర్ వెల్లడించారు. తపాలా వారోత్సవాల్లో భాగంగా శనివారం రాష్ట్ర డాక్‌సదన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తపాలా శాఖకు మధ్య అవగాహన కుదరడంతో 856 పోస్టాఫీసుల ద్వారా నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు లభిస్తాయన్నారు. త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సుదర్శన దర్శనం, స్పెషల్ దర్శనం టికెట్ల జారీ సేవలను పోస్టాఫీసుల ద్వారా అందించేందుకు టీటీడీతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఆర్టీసీ డిపోల్లేని ప్రాంతాల్లో ‘ఆన్లైన్’ అనుసంధానంతో రిజర్వేషన్ టికెట్లు జారీ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 97 ప్రధాన పోస్టాఫీసులను కంప్యూటరీకరించి కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకొచ్చామని, ఇప్పటికే 18 పోస్టాఫీసుల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాయన్నారు. మరో 79 ఆఫీసు ల్లో డిసెంబర్‌కు అందుబాటులోకి వస్తాయ న్నారు. కోర్ బ్యాంకింగ్ ఏటీఎం సేవలు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటికే 29 ఏటీఏంల ఏర్పాటుకు సివిల్, ఎలక్ట్రానిక్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన 66 ఏటీఎంల పనులను డిసెంబర్ ఆఖరుకు పూర్తి చేస్తామ న్నారు. ఈ ఏడు 13 కొత్త పోస్టాఫీసులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొని ఐదింటిని ప్రారంభించామని సీపీఎంజీ తెలిపారు.