సాక్షి, సిటీబ్యూరో: వంద రూపాయల విలువైన నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల కొరత ఏర్పడింది. రెండు మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రూ.100 స్టాంప్‌ల విక్రయాలు పూర్తిగా ఆగిపోయాయి. ఫలితంగా బహిరంగ మార్కెట్‌లో నాన్ జ్యుడీషియల్ స్టాంప్ ధర రెండు నుంచి మూడు రేట్లు అధికంగా పలుకుతోంది. నాసిక్ ముద్రణాలయం నుంచి స్టాంప్‌ల సరఫరా నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్ శాఖ స్టాంప్ డిపోల్లో నిల్వలు లేకుండా పోయాయి. ఫలితంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రెవెన్యూ స్టాంపుల కొరత తీవ్రంగా నెలకొంది. స్థిరాస్తి క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్, ఇతరత్రా లావాదేవీలకు అధికంగా రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లను అధికంగా వినియోగిస్తారు. దీంతో డిమాండ్ అధికంగా ఉంటోంది. రూ.20, రూ.50ల నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు సరఫరా విరివిగా ఉన్నప్పటికి రూ.100 స్టాంప్ పేపర్లపై దస్తావేజుదారులు అధికంగా ఆసక్తి కనబరుస్తారు. గత మూడు నెలలుగా వీటి సరఫరా లేకపోవడంతో మార్కెట్‌లో కొంత పాత స్టాక్‌కు డిమాండ్ పెరిగినట్లయింది.
నాసిక్‌లోనే ముద్రణ..
మహారాష్ట్రలోని నాసిక్ ముద్రణాలయంలో నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లు, రెవెన్యూ స్టాంపులు ముద్రిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఈ ముద్రణాలయం నుంచి వీటిని కొనుగోలు చేస్తోంది. నాసిక్ ముద్రణాలయానికి అవసరమైనంత ఇండెంట్ పంపించి నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లను తెప్పిస్తోంది. జిల్లా రిజిస్ట్రార్‌ల ఇండెంట్ ప్రకారం వాటిని సరఫరా చేస్తోంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ నాసిక్ నుంచి స్టాక్ తెప్పించిన ప్రతిసారీ ముందస్తుగా 20 శాతం వరకు సరుకు నిల్వ చేసి మిగితా జిల్లా రిజిస్టార్, పోస్టల్ శాఖలకు సరఫరా చేస్తోంది. జిల్లా రిజిస్టార్ ఆఫీస్ కూడా స్టాంప్ డిపోలో కొంత స్టాక్ రిజర్వ్‌డ్ చేసుకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ఇండెంట్ డిమాండ్ మేరకు పంపిణీ చేస్తోంది. స్టాక్ ముగియక ముందే ఇండెంట్ పెట్టి తెప్పించుకోవడం ఆనవాయితీ. ఇండెంట్‌కు స్టాక్ సరఫరా కాకపోవడంతో రిజర్వ్‌డ్ నిల్వలు సైతం పూర్తిగా వినియోగించినట్లు తెలుస్తోంది.
సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు..
పోస్టాఫీసులకు సైతం రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల సరఫరా నిలిచిపోయింది. వాస్తవంగా మూడేళ్లక్రితం పోస్టాఫీసుల ద్వారా కూడా నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో పోస్టల్ శాఖ రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పదం మేరకు కమిషన్‌పై జ్యుడీషియల్ స్టాంప్‌లను పోస్టాఫీసుల్లో విక్రయాలకు సిద్ధమైంది. జనరల్ పోస్టాఫీసులు ప్రతి మూణ్నెల్లకోసారి ఇండెంట్ పెట్టి రిజిస్ట్రేషన్ శాఖ నుంచి నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లను కొనుగోలు చేస్తూ వచ్చాయి. రిజిస్ట్రేషన్ శాఖకు నాసిక్ నుంచి ఇండెంట్‌వచ్చిన తర్వాత హైదరాబాద్‌లోని సర్కిల్ స్టాంప్ డిపోకు అందిస్తోంది. అక్కడి నుంచి ప్రధాన పోస్టాఫీసుల డిమాండ్ మేరకు సరఫరా అవుతోంది. ప్రధాన పోస్టాఫీసుల నుంచి సబ్ పోస్టాఫీసులకు అక్కడి నుంచి కిందిæ పోస్టాఫీసులకు సరఫరా అవుతాయి. గత మూడు నెలల నుంచి సరఫరా లేకపోవడంతో రూ.100 స్టాంప్‌లకు కొరత ఏర్పడింది. బహిరంగ మార్కెట్‌లో మాత్రం వ్యాపారులు పాత స్టాక్‌తో సొమ్ము చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మాత్రం రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌ల కోసం ఇండెంట్ పెట్టామని ఇంకా స్టాక్ రాలేదని స్పష్టం చేస్తున్నారు.
స్టాక్ లేదంటున్నారు...
సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల స్టాక్ లేదంటున్నారు. జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసుకు ఇండెంట్ పెట్టినా సరఫరా కాలేదంటున్నారు. స్థిరాస్తి నమోదు అధికంగా రూ. 100 స్టాంప్‌లు అధికంగా వినియోగంలోకి వస్తాయి. దస్తావేజుదారులు సైతం ఎక్కువగా మొగ్గు చూపుతారు. రూ.50 పత్రాలపై దస్తావేజులు చేయించేందుకు అసక్తి కనబర్చరు. దీంతో తీవ్ర కొరతగా ఉంది. వెంటనే రిజిస్ట్రేషన్ శాఖ రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లను తెప్పించాలి. – అర్జున్, స్టాంప్ అండ్ వెండర్, కొత్తపేట
Comments
Please login to add a commentAdd a comment