సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పోస్టాఫీసుల్లో నవంబర్ తొలివారం నుంచి నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లనూ అందుబాటులో ఉంచనున్నట్లు తపాలా శాఖ చీఫ్‌పోస్టుమాస్టర్ జనరల్ (సీపీఎంజీ) బి.వి సుధాకర్ వెల్లడించారు. తపాలా వారోత్సవాల్లో భాగంగా శనివారం రాష్ట్ర డాక్‌సదన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తపాలా శాఖకు మధ్య అవగాహన కుదరడంతో 856 పోస్టాఫీసుల ద్వారా నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు లభిస్తాయన్నారు. త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సుదర్శన దర్శనం, స్పెషల్ దర్శనం టికెట్ల జారీ సేవలను పోస్టాఫీసుల ద్వారా అందించేందుకు టీటీడీతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఆర్టీసీ డిపోల్లేని ప్రాంతాల్లో ‘ఆన్‌లైన్’ అనుసంధానంతో రిజర్వేషన్ టికెట్లు జారీ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 97 ప్రధాన పోస్టాఫీసులను కంప్యూటరీకరించి కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకొచ్చామని, ఇప్పటికే 18 పోస్టాఫీసుల్లో ఆన్‌లైన్ సేవలు ప్రారంభమయ్యాయన్నారు. మరో 79 ఆఫీసు ల్లో డిసెంబర్‌కు అందుబాటులోకి వస్తాయ న్నారు. కోర్ బ్యాంకింగ్ ఏటీఎం సేవలు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటికే 29 ఏటీఏంల ఏర్పాటుకు సివిల్, ఎలక్ట్రానిక్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన 66 ఏటీఎంల పనులను డిసెంబర్ ఆఖరుకు పూర్తి చేస్తామ న్నారు. ఈ ఏడు 13 కొత్త పోస్టాఫీసులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొని ఐదింటిని ప్రారంభించామని సీపీఎంజీ తెలిపారు.