సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బ్యాంకు ఖాతాలు లేని రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.1,500 సాయాన్ని పోస్టాఫీస్‌ల ద్వారా అందించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు లేని 5,21,641 కుటుం బాలకు రూ.78,24,55,500ను అందించనుంది. ఈ మేరకు ఆ మొత్తాన్ని పోస్టు మాస్టర్ జనరల్, హైదరాబాద్ ఖాతాలో పౌర సరఫరాల శాఖ శనివారం జమ చేసింది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు మొత్తం 87.54 లక్షలు ఉండగా, 79.57 లక్షల కుటుంబాలకు ఉచి తంగా 12 కిలోల చొప్పున 3.13 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే పంపిణీ చేసింది.
బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకుల కోసం ఒక్కో కుటుంబానికి రూ.1,500 చొప్పున 74 లక్షల కుటుంబాలకు రూ. 1,112 కోట్లు సైతం జమ చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరికి సాంకేతిక సమస్యలతో జమ కాకపోగా, మరికొందరికి బ్యాంక్ ఖాతాలు లేకపోవడంతో జమకాలేదు. అయితే ఖాతాలు లేని వారికి పోస్టల్ సర్వీసుల ద్వారా సాయం అందించనుండటంతో సగం సమస్య తీరనుంది. మిగతా వారికి కూడా త్వరలోనే వారి ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటోంది. చదవండి: కరోనాతో కుదేల్..!
మరో 3.12 లక్షల మందికి...
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలో ఉన్న వలస కార్మికులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం అందిస్తోందని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలి విడతలో 3.35 లక్షల మంది కార్మికులను గుర్తించి రూ.13 కోట్లు విలువ చేసే 4,028 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేశామన్నారు. అలాగే రూ.500 చొప్పున రూ.17కోట్లు సాయమందించామన్నారు. రెండో విడతలో కొత్తగా 3.12 లక్షల మంది వలస కార్మికులను గుర్తించామని, వీరికి రూ.12 కోట్లు విలువ చేసే 3,746 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున పంపిణీ చేస్తామని తెలిపారు. వీరికి కూడా రూ.500 చొప్పున రూ.15.60 కోట్లు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 91శాతం మందికి బియ్యం పంపిణీ పూర్తయిందని, 15.63 లక్షల మంది రేషన్ పోర్టబులిటీని వినియోగించుకొని బియ్యం తీసుకున్నారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment