సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా సరుకుల కోసం ఈ– పాస్ యంత్రంపై బయోమెట్రిక్ (వేలిముద్ర) పెట్టాల్సిన అవసరం లేదిక. ఆహార భద్రత (రేషన్) కార్డు నంబర్ చెప్పి.. దాని ఆధారంగా మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెబితే సరిపోతుంది. సరుకులను డ్రా చేసుకోవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా వచ్చే ఫిబ్రవరి నుంచి ఓటీపీ పద్ధతిని పకడ్బందీగా అమలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు ఆదేశాలు జారీ కావడంతో లబ్ధిదారుల ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ అయిందో లేదో పరిశీలించి లింక్ లేకుంటే మీ– సేవ, ఈ– సేవలకు వెళ్లి అనుసంధానం చేసుకోవాలని డీలర్లు చెబుతున్నారు. ఈ– పోస్ ద్వారా సరుకుల పంపిణీలో ఓటీపీ పద్ధతి రెండు నెలల నుంచి ప్రయోగాత్మకంగా అమలవుతున్నా తప్పనిసరి లేకుండా పోయింది. కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌కు తాత్కాలికంగా నిలిపివేసి పూర్తిగా ఓటీపీ పద్ధతి ద్వారా సరుకులు పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. దీంతో ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటేనే రేషన్ సరుకులు తీసుకునేందుకు సాధ్యపడనుంది. చదవండి: కొత్త కోడళ్లకు నో రేషన్..
తప్పనిసరి..
► కరోనా నేపథ్యంలో రేషన్ సరుకుల డ్రాకు ఓటీపీ వెసులుబాటు తప్పనిసరిగా మారింది. వాస్తవంగా కరోనా కష్టకాలంలో వరుసగా అయిదు నెలల పాటు థర్ట్ పార్టీ ఐడెంటిఫికేషన్ ద్వారా సబ్సిడీ సరుకులు పంపిణీ చేసిన పౌరసరఫరాల శాఖ నాలుగు నెలలుగా తిరిగి బయోమెట్రిక్ విధానానికి శ్రీకారం చుట్టింది.
► గత ఏడాది నవంబర్ నుంచి బయోమెట్రిక్‌తో పాటు ఓటీపీ పద్ధతి కూడా ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. తాజాగా వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది.
30 శాతం దూరం..
► గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆహారభద్రత కార్డు లబ్ధిదారుల్లో సుమారు 30 శాతం ఆధార్‌తో మొబైల్ నంబర్ల లింక్ లేనట్లు తెలుస్తోంది. కేవలం రేషన్ కార్డుదారుల్లో సుమారు 70 శాతం మాత్రమే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఆధార్ నంబర్లు మొబైల్ ఫోన్లను అనుసంధామైనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
► ఆహార భద్రత కార్డు లబ్ధిదారుల్లో హెడ్ ఆఫ్ ప్యామీలితో పాటు సరుకుల కోసం దుకాణాలకు వచ్చే లబ్ధిదారుల ఫోన్ నంబర్లు కూడా ఆధార్‌తో లింక్ చేసుకోవాలని డీలర్లు సూచిస్తున్నారు.
► వాస్తవంగా ప్రజాపంపిణీ వ్యవస్థలో ఆధార్‌తో రేషన్ కార్డు నంబర్ల అనుసంధానంతోనే బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆధార్‌తో మొబైల్ నంబర్లు కూడా అనుసంధానమయ్యాయి.
► ఆధార్ బయోమెట్రిక్ గుర్తింపు ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్లకు వచ్చే ఓటీపీ ద్వారా సరుకులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.
►కొందరు లబ్ధిదారులకు మొబైల్ నంబర్లు లేకపోవడం, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు పనిచేయకపోవడంతో సమస్యగా తయారైంది. లింక్ చేసుకునేందుకు ఈ నెలాఖరులోగా వెసులుబాటు కల్పించారు.
ఓటీపీ ఇలా..
► ప్రభుత్వ చౌకధరల దుకాణానికి సబ్సిడీ సరుకులు కోసం వెళ్లే లబ్ధిదారులు డీలర్‌కు తమ ఆహార భద్రత కార్డుకు సంబంధించిన నాలుగు చివరి నంబర్లు చెప్పాలి.
► ఈ– పాస్ యంత్రంపై కార్డు నంబర్లు ఫీడ్ చేస్తే సంబంధిత రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పగానే డీలర్ దానిని ఫీడ్ చేస్తే సరుకుల పంపిణీకి ఆమోదం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment